మంత్రి కొడాలి నానికి ఎస్‌ఈసీ షోకాజ్ నోటీసు

మంత్రి వ్యాఖ్యలు ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌తిష్ఠ‌ను దిగ‌జార్చేలా ఉన్నాయి
వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేయాలి

అమరావతి: ఏపి మంత్రి కొడాలి నానికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ శుక్రవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. ఎస్‌ఈసీని కించపరిచేలా కొడాలి నాని మీడియా సమావేశంలో మాట్లాడారని నోటీసులో పేర్కొన్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు కమిషన్‌ ప్రతిష్ఠను దిగజార్చేలా దురుద్దేశ ప్రకటనలు ఉన్నాయని, మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై తక్షణమే వివరణ ఇవ్వాలన్నారు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు బహిరంగ ప్రకటన చేయాలని, సాయంత్రం 5గంటల్లోగా మంత్రి స్వయంగానైనా.. ప్రతినిధి ద్వారా సమాధానం ఇవ్వాలని నోటీసులో ఎస్‌ఈసీ పేర్కొన్నారు.


కాగా, ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్య‌లు చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ ర‌మేశ్ కుమార్ జగన్నాథ‌ రథ చక్రాల కింద నలిగిపోతారంటూ మీడియాతో అన్నారు. అలాగే, తాము పనికిమాలిన మీడియాను నమ్ముకోలేదని, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా వైఎస్‌ఆర్‌సిపి విజయం సాధిస్తుంద‌ని చెప్పారు. సిఎం జగన్‌ చిటికెనవేలిని కూడా ఎవ‌రూ తాక‌లేరంటూ, ఇప్ప‌టికైనా బుద్ధి తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం.. కొడాలి నానికి షోకాజ్ నోటీసు ఇచ్చింది.