మంత్రి కెటిఆర్‌ మాటలు అహంకార పూరితం: పొంగులేటి

Ponguleti sudha
Ponguleti sudhakar reddy

హైద‌రాబాద్ః మంత్రి కెటి రామారావు ఖమ్మం పర్యటనలో మాట్లాడిన మాటలు అహంకార పూరితంగా ఉన్నాయని మండలి విపక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ నకిలీ గాంధీలంటూ కెటిఆర్‌ మాట్లాడడం సరికాదన్నారు. కుటుంబంతో సమేతంగా సోనియాగాంధీ వద్దకు వెళ్లి కాళ్లు మొక్కినపుడు ఇది గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. కెటిఆర్‌ స్థాయికి మించి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఖమ్మం పర్యటలో మదిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కకు ప్రోటోకాల్‌ పాటించకుండా అవమానించడం సరికాదని, భట్టికి జరిగిన అవమానం దళిత జాతికి జరిగిన అవమానమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఉంటే మేము అభివృద్ధి చేయమనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమని, ఇది కక్షసాధింపు రాజకీయాలకు ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు. అమెరికాలో చదువుకున్న కెటిఆర్‌ మాట్లాడే సంస్కారం ఇదేనా, అక్రమ సంపాదన చూసుకుని ఈ అహంకారమా అని ప్రశ్నించారు. భట్టికి కెటిఆర్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే పట్ల ప్రవర్తించే తీరు ఇదేనా ప్రశ్నించారు. రాష్ట్రంఓల అంబేద్కర్‌ రాజ్యాంగా అమలవుతోందా కల్వకుంట్ల రాజ్యాంగం అమలవుతోందా అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఏం చేసిందనేది చరిత్ర చెబుతుందన్నారు. నకిలీ గాంధీలని ఇష్టం వచ్చినట్లు కవిత, కెటిరా మాట్లాడుతున్నారని ఇలాంటి వ్యాఖ్యలు విస్మయం కలిగించాయన్నారు. వెంటనే ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కొడుకు కెటిఆర్‌, కూతురు కవితల నోరు కెసిఆర్‌ అదుపులో పెట్టుకోవాలన్నారు.