మండుతున్న తెలుగు రాష్ట్రాలు

temperature high
– సాధారణంకరటే నాలుగు నుంచి ఆరు డిగ్రీలు అదనంగా నమోదవుతున్న ఉష్ణోగ్రత
బేగంపేట : తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిలా మారాయి. రోజు రోజుకు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల వరకు అదనంగా నమోదవుతుండటంతో ప్రజలు విలవిలలాడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అత్యధింగా నమోదవుతున్నాయి. దీనికి తోడు వడగాలుల ప్రభావం తోడవడంతో మంట మరింత అధికమైంది. ఉదయం నుంచే మంటలు ప్రారంభమవుతుండటంతో పాటు వడగాలుల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతుంది. వడగాలుల కారణంగా గాలిలోతేమ శాతం తగ్గిపోతుండటంతో క్యుములో నింబస్‌మేఘాలు ఏర్పడటంలేదు. దీంతో భూమి త్వరగా వేడెక్కుతుంది. వడగాలుల కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి. దశాబ్ధకాలంగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఈ సీజన్‌ ఏప్రిల్‌ రెండవవారంలోనే నమోదవుతుండటంతో ఈ ఏడాది ముందు రోజుల్లో ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొట్టే స్థాయిలో నమోదవుతాయని వాతావరణశాఖాధికారులు భావిస్తున్నారు. శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదలలు కొనసాగాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ, రాయలసీమలకు మరో ఐదు రోజులపాటు వడగాలుల హెచ్చరికను బేగంపేట వాతావరణశాఖా ధికారులు జారీచేసారు. తెలంగాణలోని నల్లగొండ, నిజామాబాద్‌ (44.9), భద్రాచలం(44.8)లో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ 44.3. హకీంపేట42 (41.7), హన్మకొండ 42.5, హైదరాబాద్‌ 43, మహబూబ్‌నగర్‌ 44.1, మెదక్‌ 43.6, రామగుండం 44.2 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమలోని తిరుపతి 44 (43.6), కర్నూలు 43.1, అనంతపూర్‌ 43 (42.8) చొప్పున నమోదయ్యాయి. కోస్తాంధ్రాలోని బాపట్ల 37.2,కాకినాడ 38.4, కళింగపట్నం 34 (33.6), కావలి 44 (43.6). మచిలీపట్నం 39, నర్సాపూర్‌ 35, ఒంగోలు 40.2, తుని 41,3, విజయవాడ 43, (42.7), విశాఖపట్నం 33 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

తెలుగు రాష్ట్రాలకు 5 రోజులు వడగాలుల హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులపాటు వడగాలుల తీవ్రత కొనసాగనుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు హెచ్చరిక జారీచేసారు. రాయలసీమలోని రాగల 48 గంటలపాటు అనంతపూర్‌, కర్నూలుతో పాటు పలు ప్రాంతాల్లో వడగాలుల తీవ్రత కొనసాగనుందన్నారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నల్లగొండతోపాటు పలు ప్రాంతాల్లో వడగాలులు తీవ్రత కొనసాగుతుందని బేగంపేట వాతావరణశాఖ అధికారులు హెచ్చరిక జారీ చేసారు. దీని దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వారు హెచ్చరించారు.