మండుతున్న కూరగాయలు..అకాల వర్షాలతో దెబ్బతిన్న తోటలు

vegetables
Vegetables

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రధానంగా హైదరాబాద్‌ నగరంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వేసవికి ముందు కేవలం కిలో 10 రూపాయలు ధర పలికిన టమాట ప్రస్తుత ధర 28 రూపాయలుగా ఉంది. ఇక మిరప ధర రెండు నెలల్లో మూడు రెట్లు పెరిగి ప్రస్తుతం కిలో 50 రూపాయలకు చేరుకుంది. బీన్స్‌ ధర అయితే మండిపోతోంది. కిలో బీన్స్‌ ధర 80 రూపాయలుగా ఉంది. క్యారెట్‌ 30 రూపాయలు, క్యాప్సికమ్‌ 45 రూపాయలుగా ఉన్నాయి. అయితే రుతుపవనాల రాక ఆలస్యంతో ప్రతీ ఏటా జూన్‌ మధ్యలో కూరగాయల ధరలు స్థిరంగా ఉండేవని, అయితే మార్కెట్లలో ఈసారి మాత్రం ఎటువంటి తగ్గుదల లేదని మార్కెట్‌వర్గాలు వెల్లడిస్తున్నాయి. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా సీజనల్‌ వెజిటేబుల్స్‌ ఉత్పత్తి బాగా తగ్గిపోయిందని, దీంతో పెద్ద స్థాయిలో మార్కెట్లలో సరఫరా తగ్గిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. మరోపక్క కొంత కాలంగా మార్కెట్‌లకు తరలి వస్తున్న కూరగాయల్లో చాలా వరకూ కూడా బయట రాష్ట్రాల నుండే వస్తున్నాయి. తెలంగాణ జిల్లాల్లో కొంత కాలంగా కూరగాయాల దిగుబడులు బాగా తగ్గాయి. అధిక శాతం కూరగాయలు బయటి రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్నాయి. దీంతో స్థానిక రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. నగరంలోని ప్రధాన హోల్‌సేల్‌ మార్కెట్లు అయిన బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్‌, ఎల్‌బీనగర్‌, మాదన్నపేట్‌తోపాటు ఎర్రగడ్డ, మోహదపట్నం వంటి ప్రదాన రైతు బజార్లకు కూడా అధిక శాతం బయటి రాష్ట్రాల నుండి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. ఇందులో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లి, కర్నాటక నుండి భారీ మొత్తంలో టమాట, పచ్చిమిర్చి దిగుమతి అవుతోంది. ఇక మహారాష్ట్ర, రాజస్థాన్‌ నుండి ఆలుగడ్డలు తరలిస్తుండగా, చత్తీస్‌ఘడ్‌, గుజరాత్‌, కర్నాటక నుండి బీన్స్‌ సరఫరా అవుతోంది. రెండు నెలలుగా హైదరాబాద్‌ శివారు జిల్లాలైన మెదక్‌, సిద్దిపేట్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో కూరగాయల పంటలు తక్కువగా ఉండడంతో నగరానికి దిగుబడి తగ్గింది. ప్రత్యేకించి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్‌, శంషాబాద్‌ తదితర ప్రాంతాల్లో టమాటా ఎక్కువగా పండిస్తున్నారు. కాగా ఇటీవల కురిసన భారీ వర్షాలు, వడగళ్ల వానల కారణంగా పెద్ద మొత్తంలో పంట నష్టం జరిగింది. ఈ కారణంగానే మార్కెట్‌కు స్థానిక ఉత్పత్తుల సరఫరా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మిగిలిన కూరగాయల ఉత్పత్తులు తగ్గడం వల్లనే నగర మార్కెట్‌కు దిగుబడి తగ్గిందని అంటున్నారు. దీంతో వ్యాపారులు అంతా అధికంగా బయటి రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈనేపథ్యలో కూరగాయల ధరలు పెరిగాయని చెబుతున్నారు. కాగా పూర్తిగా బయటి రాష్ట్రాల నుండి తరలి వచ్చే ఉత్పత్తులపై ఆధారపడితే ధరలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం బావిస్తోంది. ఈనేపథ్యంలో ప్రస్తుత వానాకాలం సీజనులో తెలంగాణ జిల్లాల్లో పెద్ద ఎత్తున కొత్త పంటలు వేసేలా అధికారులు రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే మెదక్‌, సిద్దిపేట్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాల్లో భారీగా పంటలు వేయడంతో మరో రెండు వారాల్లో అవి మార్కెట్‌కు వస్తాయిన అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో ప్రస్తుతం పెరిగిన ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో కూరగాయల ఉత్పత్తులను మరింత పెంచేందుకు ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలను రూపొందించింది. ఉద్యాన శాఖ అధికారుల ద్వారా రైతులకు వివిధ పంటల దిగుబడులు పెంచడంపై ప్రత్యేక సలహాలు, సూచనలు ఇప్పిస్తున్నారు.