భోగభాగ్యాల భోగి

This slideshow requires JavaScript.

భోగభాగ్యాల భోగి

చిన్న పిల్లలున్న ఇళ్లల్లో భోగినాడు పిల్లలకు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేయిస్తారు. నువ్ఞ్వలనూనెతో మసాజ్‌ చేసి కుంకుడుకాయతో తలంటు పోయాలి. చివరి చెంబులో రేగిపళ్లు, పైసలు వేసి దిష్టితీయాలి. ఈ సమయంలో ఈ క్రింది రక్షామంత్రం చదువ్ఞకోవాలి. ఆ రేగిపళ్లు ఎవరూ తినరాదు. బయట ఎవరూ తొక్కని చోటపడేయాలి. రేగిపళ్లు పోసేటపుడు నారాయణ మంత్రం పఠించి ఈశ్వరుని స్మరించుకోవాలి. రక్షరక్ష మహాదేవ నీలగ్రీవ జటాధరా గ్రీహైస్తు సహితోరక్ష ముంచ ముంచ కుమారకం ఇది చదువుతూ భోగిపళ్లు పోస్తే పిల్లల మీద ఉండే దిష్టిదోషాలు పోతాయి.

 

భోగభాగ్యాలను తెచ్చేది భోగిపండుగ. పౌష్యలక్ష్మి ధనరాశులు ఇంటికి చేరే వేళ భోగిపండుగ రోజున ఇంద్రునికి పూజ చేయాలి. మేఘాధిపతి ఇంద్రుడు కనుక ఆయనను ప్రసన్నం చేసుకోవడానికే ఈ పూజలని పౌరాణికులు చెప్తుంటారు. ధనుర్మాసదీక్ష పూర్తయిన దక్షిణాయనం చివరిరోజు ఇదే కనుక గోదాకళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం చేసినా, చేయించినా, తిలకించినా దోషాలు పోతాయి. లక్ష్మీనారాయణుల అనుగ్రహం దొరుకుతుంది. భోగిరోజున రాత్రి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే మకర సంక్రాంతి. నువ్ఞ్వలతో పిండి వంటలు చేసుకోవడం ప్రాధాన్యత. చాలా ఇళ్లల్లో అరిసెలు చేసుకుంటారు. గోదారంగనాథుల కల్యాణం కనువిందు కమనీయం. సుకృతం. సురులు నరుల అదృష్టం. మార్గళి మాసం అంటేనే మహాలక్ష్మి రూపమైన గోదాదేవి పుట్టుట. మెట్టుట. హిందూ సాంప్రదాయాలు, సంస్కృతులతో సమ్మిళితమైన ఈ పండుగ ప్రాముఖ్యం గొప్పది.

ముఖ్యంగా ముదితలను మురిపించే ముగ్గుల పండుగ. సంక్రాంతి నిల(నెల)బెట్టినప్పటి నుండి ముదితల ముగ్గుల ముచ్చట్లు, ఆ ముగ్గుల్లో గౌరమ్మలు. (గొబ్బెమ్మలు)తెలంగాణలో గౌరమ్మ అంటారు. ఆంధ్రలో గొబ్బెమ్మ అంటారు. ఎలా పిలిచినా అమ్మ ”గౌరీదేవి ఒక్కతే. ఆ గౌరమ్మలపై బంతి పూల అలంకారాలు, అమ్మాయిల అందాల సందళ్ల ముగ్గుల ముత్యాల పందిళ్ల వాకిళ్లు. ఆడవారి కళా నైపుణ్యాన్ని తెలిపే అందమైన ముగ్గులతో ముదతలను పోల్చడం సబబు. చుక్కలాంటి చక్కనైన అమ్మాయి అంటారు. ధనుర్మాసం ప్రారంభమైన సంక్రాంతి మాసమంతా ధరణి (భూమి)పై తళతళ మెరిసే ముత్యాలముగ్గుల మెరుపులే విరజిమ్ముతూ కళకళలాడే వాకిళ్లు కనువిందు.

ఆ వాకిళ్ల ముందు హరిదాసుల హరినామస్మరణలు. గంగిరెద్దుల మేళతాళాలు. బుడుబుక్కుల గంటానాదాలు. తెల్లవారకముందే ప్రతి పల్లె ప్రతి ఇల్లు పచ్చని పేడ జల్లిన వాకిళ్లలో రంగురంగుల కాంతులతో రతనాల ముగ్గుల దర్శనం. ”ముగ్గును లక్ష్మీదేవి అంటారు. ఏ ఇంటి ముందు అందమైన ముగ్గు ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందనే సూక్తి. భారతీయ సంస్కృతిలో ముగ్గుకెంతో ప్రాముఖ్యత ఉంది. అన్ని శుభాలకు, ”శుభం సూచన ముగ్గు. ఈ ధనుర్మాసాన్ని, మార్గశిరమాసం, ”మార్గళి మాసం అని కూడా అంటారు. మాసానాం మార్గశీర్షోహం ధనురాశితో మొదలైన మార్గశిరమాసంలో ప్రతిరోజు భగవతారాధన పర్వదినం కనుకనే భగవంతుడు ఈ మాసాన్ని తనతో పోల్చుకున్నాడని భగవద్గీత సారాంశం. ”కృష్ణం వందే జగద్గురుమ్‌ అని ద్వాపరయుగంలో గీతోపదేశం చేసినది. ఈ మార్గళిమాసంలోనే ఈ మాసమంతా ప్రతి వైష్ణవ దేవాలయాలన్నీ గోవింద, కృష్ణ అనే భక్తిభావంతో మారుమ్రోగుతాయి.

లక్ష్మీదేవికి ప్రతిరూప మైన అవతారమూర్తిగా కీర్తింబడిన గోదాదేవి ఆండాళ్‌ శూడకొడుత్త నాచియార్‌ అనే నామాలతో ప్రసిద్ధిగాంచి బ్రాహ్మి (పొద్దున్నే) సమయంలో నిదురించే కృష్ణ పరమాత్మున్ని లేపాలనే సంకల్పంతో మార్గశిరమాసమంతా ముప్పది పాశురాలు పాడి తిరుప్పావై వ్రతాన్ని ఆచరించి యోగనిద్రలో ఉన్న అది మధ్యాంత రహితుడు అవతార పురుషుడైన శ్రీకృష్ణ భగవానున్ని మేల్కొలిపి, తన వ్రత విధానాన్ని విన్నవించుకుని కోరిక సఫలం చేయమని ప్రార్థించి తరించిన భక్తురాలు గోదాదేవి. భక్తి, రక్తి మేళవించి భగవంతున్ని భర్తగా పొందిన ఆమె సాక్షాత్తు శ్రీదేవి, భూదేవి, నీళాదేవి అంశ. భగవం తుని సన్నిధికి చేర్చే గోదాదేవి రచించి పాడిన తిరుప్పావై సంకీర్తనాలు ప్రతిరోజు ప్రాతఃకాలంలో పఠించడం పవిత్రం. పరమపదానికి సోపానం. ప్రాచీనకాలం నుండే సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంది. సంక్రాంతి నెలరోజులు గుళ్లల్లో, ఇళ్లల్లో స్మరణ, సందడి, సంతోషం. గోదా రంగనాధుల కల్యాణం రోజే భోగిపండుగ. మరునాడు సంక్రాంతి పండుగ. మూడోరోజు కనుమ పండుగ. సృష్టిలోని అనంతకోటి జీవరాశు లకు వెలుగును శక్తిని ప్రసాదించే సప్తాశ్వరుని (సూర్యుడు) గమనానికి సంబంధమైన పర్వదినమే సంక్రాంతి. ద్వాదశరాశులతో ధనురాశిలో నుంచి మకరరాశిలోకి మార్తాండుని ప్రవేశం. సంక్రాంతికి నాంది మకర సంక్రాంతి పండుగ.

మకర సంక్రమణతోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కాబట్టి ఈ మార్గశిరమాసం. పూజలు వ్రతాలతో దేవ్ఞని స్మరణతో దేవాలయాలన్నీ కనువిందు చేస్తాయి. దేవతలకు అత్యంత ప్రీతివంతమైన రోజులు సంక్రా ంతి మాసం. సంక్రాంతి పండుగ తర్వాత కనుము పండుగ. పశువ్ఞల పండుగ. పసుపు, కుంకుమ పూలతో గోపూజ చేస్తారు. ”భోగి రోజు గోదా కల్యాణం, సంక్రాంతి రోజు సూర్యోపాసన, కనుము రోజు గోపూజ మూడు రోజుల ముచ్చటకాదు. నెలరోజుల సందడిగల సంక్రాంతి. సంతోషానికి నిలయం. తులసి పూజ కూడా సంక్రాంతి రోజులలో ముఖ్యమైనదే. గోదాదేవి తులసివనంలోనే పెరిమాళ్వారు విష్ణుచిత్తుడనే భక్తునికి చిన్నపాపలా ప్రత్యక్షమై అతని పెంపకంలోనే పెరిగి శ్రీరంగనాథున్ని నాధునిగా పొందుతుంది కాబట్టి తులసి, గోదా రెండు లక్ష్మి అంశనే కాబట్టి ఈ నెల రోజులు తులసి చెట్టు దగ్గర దీపం పెట్టడం ఆచారంగా పాటించాలి. భోగి రోజు చిన్నపిల్లలకు భోగి. బోడపండ్లు పోయడం కూడా సాంప్రదాయం. రేగుపండ్లు చెరకు ముక్కలు, బియ్యం నువ్ఞ్వలు, కలిపి చిల్లర నాణాలు అన్నీ కలిపి పిల్లలకు కొత్త బట్టలేసి తలపై నుండి బోడపండ్లు పోయాలి. దీనిని సాయంత్రం ఆచరిస్తారు. ముత్తయిదువలతో పేరంటం పెట్టి వారి ఆశీర్వచనం తీసుకుంటారు. భోగి, సంక్రాంతి పండుగలరోజు వాకిళ్లలో వేసిన అందమైన ముగ్గుల మధ్య గౌరమ్మలను పెట్టాలి. అవ్ఞపేడతో గౌరమ్మలను చేసి పసుపు కుంకు మలు అద్ది పూలు, గరికతో పూజించి, నువ్ఞ్వలు, రేగుపండ్లు నైవేద్యంలా గౌరమ్మల పైన పోయాలి. ఆవ్ఞపేడతో చేసిన గౌరమ్మలు ముగ్గురమ్మలకు ప్రతిరూపం కాబట్టి, గౌరీదేవి ఆడబిడ్డల్ని ఆడపడుచులని చల్లంగాచూస్తుంది. సుమంగళిగా దీవిస్తుందని ఆడవారందరి నమ్మకం. సంతోషాల సంక్రాంతి పండుగకు స్వాగతం సుస్వాగతం.

– ఆర్‌. తార