భోగభాగ్యాలను తెచ్చే భోగి

          భోగభాగ్యాలను తెచ్చే భోగి

bhogi
bhogi

‘సంక్రాంతి రైతుల పండగ.. పిల్లల పండగ.. స్త్రీల పండగ… ఒకరికనేమిటి అన్ని వర్గాల వారిని అలరించే పండగ సంక్రాంతి. ప్రకతి అంతా కొత్త అందాలను సంతరించుకుని పచ్చగా కళకళలాడుతుంటుంది. పొద్దున్నే మంచు దుప్పటి కప్పుకున్న పల్లెటూళ్లు పట్టణాలను రా… రమ్మని పిలుస్తున్నట్లుంటాయి.

భోగి: భోగిమంట భోగాలను ఇచ్చేది కనుక భోగిపండుగ భోగాలను కోరుకునేవారు అగ్నిని పూజించాలి. ఆరోగ్యాన్ని సూర్యుడు, ఐశ్వర్యాన్ని అగ్నిదేవ్ఞడు ఇస్తారని బుషివాక్యం. రేగిపళ్లు పోసి పిల్లలను దీవించడం వెనుక రేగిచెట్టు విష్ణువ్ఞకు ప్రీతి. సంక్రాంతి విష్ణువ్ఞ పండుగ. ఆ రోజు భోగిపళ్లు పేరుతో రేగిపళ్లు పోసి పిల్లలను దీవిస్తారు. గొబ్బిళ్లు పెట్టడమంటే భూదేవిని పూజించడం. ఈరోజునే కదా భూమి ఉద్ధరించినది. రైతు ఇంట ఏ మూల చూసినా ధాన్యంతో నిండిన గుమ్మాలు కనిపిస్తుంటాయి. నగరాల్లో మనకు కనిపించేది పతంగుల హడావుడి మాత్రమే. ఈ మధ్యగా కొత్తగా ముగ్గుల పోటీలు ప్రారంభమయ్యాయి. కొత్త అల్లుళ్ల రాకతో మరదళ్లు చేసే హంగామా, పిల్లలకు భోగిపళ్లు, యువకులకు గాలిపటాలు, అమ్మమ్మలు, నానమ్మలకు అరిసెలు, చక్కిలాలతో చేతినిండా పనే పని. సంక్రాంతి నెలరోజుల పండగ. ధనుర్మాసం మొదలయినప్పటి నుండే ప్రతి ఇల్లు సంక్రాంతి శోభ సంతరించుకుంటుంది. సినీ రంగానికి ఇది సెంటిమెంటు పండగ. బాగా కలిసొచ్చే పండగ కూడా. ”సంక్రాంతి అంటే మారడం అని అర్థం. దీనినే సంక్రమణమని కూడా అంటారు. పుష్యమాసంలో, హేమంత రుతువులో వచ్చే మకరసంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. మకర సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజు నుండి స్వర్గద్వారాలు తెరిచి ఉంటాయట. సంక్రాంతి ప్రాధాన్యం భిన్నత్వంలో ఏకత్వం అనేది సంక్రాంతికి సరిగ్గా సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల్లో సంక్రాంతి, తమిళనాడులో పొంగల్‌, మహారాZష, గుజరాత్‌లో మకర్‌ సంక్రాంతి, పంజాబ్‌, హర్యానాలో లోరీ అని పిలుస్తారు. పంట చేతికొచ్చిన శుభ సందర్భంలో రైతులు ఈ పండగను జరుపుకుంటారు. సంక్రాంతిని పెద్ద పండగ అని పిలుస్తారు. నెల రోజులు కాకపోయినా మూడు రోజులు తప్పని సరిగా జరుపుకుంటారు. మొదటి రోజు భోగి. సూర్యునికి ఇష్టమైన పండగ. తెల్లవారకముందే లేచి పనికిరాని సామాన్లతో భోగిమంటలు వేస్తారు. చలిని వదిలించుకోవటానికి కొందరు, కొత్త సంవత్సరం కొత్త సామాన్లతో ప్రారంభించాలని మరికొందరు చెప్తుంటారు. సాయంత్రం పూట చిన్న పిల్లలకు భోగిపళ్లు పోస్తారు. బొమ్మలకొలువు పేరుస్తారు. రేగుపళ్లు, చెరుకుముక్కలు, కాసిన్ని బియ్యం, పచ్చి సెనక్కాయలు, పూలు, చిల్లర నాణాలు కలిపి బంగారు ఆభరణంతో పిల్లల తలపై పోస్తారు. భోగిపళ్లు పిల్లలను దష్టి దోషం నుండి కాపాడతాయి. పేరంటానికి వచ్చిన ముత్తయి దువులంతా భోగిపళ్లు పోసి చిట్టి ముత్తయిదువ్ఞ లను ఆశీర్వదిస్తారు. ముత్తయిదువులకు తాంబూలం ఇచ్చి యథాశక్తిగా గౌరవిస్తారు. భోగి నాడు గోదాదేవి కళ్యాణం అన్ని దేవాలయాల్లో జరిపిస్తారు. నెలరోజులుగా రోజుకొక్క పాశురం చొప్పున పాడిన ఆండాళ్‌ (గోదాదేవి) భగవంతునిలో ఐక్యమయిన రోజిది. రెండవ రోజు సంక్రాంతి. ధనుర్మాసం మొద లయినప్పటి నుండి రోజూ వాకిట్లో పెట్టిన గొబ్బె మ్మలను, ఏరునుగ్గుల(పొలాల్లో దొరికే పిడకలు) పై కొత్త కుండలో పాలు పొంగిస్తారు. పాలు పొంగిన తరువాత కొత్త బియ్యంతో పొంగలి చేసి చిక్కుడు ఆకుల్లో సూర్యునికి నివేదిస్తారు. సంక్రాంతి నోము నోచుకుంటారు. పెద్దవాళ్లు, కుండలు, చిన్నపిల్లలు గురుగులు పెట్టి వాటిని చక్కగా అలంకరించి, అందులో నువ్వుల లడ్డూలు మొదలైనవి వేసి అమ్మవారి దగ్గరుంచి నోము నోచుకుంటారు. ప్రస్తుతం కుండల స్థానంలో రకరకాల ఆధునిక వస్తువులు వచ్చి చేరాయి. సాయంత్రం అందరినీ పేరంటానికి పిలిచి వాటిని వాయనంగా ఇస్తారు. ఈ రోజు పితదేవతలకు తర్పణాలు వదులుతారు. బూడిద గుమ్మడికాయను దానం చేయాలి. గోదానం చేస్తే స్వర్గలోకం లభిస్తుందని పండితుల అభి ప్రాయం. ”అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికీ దండం పెట్టు అని ఆడిస్తూ వచ్చే గంగి రెద్దులవాళ్లు ఈ పండగకి ప్రత్యేక ఆకర్షణ. పిల్లలు ఇచ్చే కానుకలు తీసుకుని గంగిరెద్దులు తలలూపుతుంటే పిల్లల కేరింతలు పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తాయి. ”హరిలో రంగ హరి అంటూ వీధి వీధిలో తిరిగే హరిదాసులు ఈ పండగకు కొత్త ఆకర్షణగా నిలుస్తారు. తలపై అక్షయపాత్ర, నుదుట తిరుమణి పట్టెలు, కాళ్లకు కంచుగజ్జెలు, చిరుతలు కొడుతూ కనిపించే హరిదాసులను నగరాల్లో చూడటం కొంచెం కష్టమే. ఇంటి ముందర చక్కని ముగ్గులు వేసి, గొబ్బిళ్లు పెట్టి హరిని కీర్తించేవాళ్లు సాక్షాత్‌ శ్రీకష్ణుడు హరిదాసు రూపంలో వస్తారని నమ్ముతారు. ఉత్తరాయణ కాలం దేవతలకు ఇష్టమైన కాలం. ఉత్తరాయణం ప్రారంభమైన సంక్రాంతినాడు చేసే దానాలు సర్వ శ్రేష్ఠమైనవి. ధాన్యం, పండ్లు, విసన కర్ర, వYసం, కా యగూరలు, దుంపలు, నువ్వులు దానం చేయవచ్చు. మూడవ రోజు కనుమ. ఇది పూర్తిగా వ్యవసాయ దారులకు సంబంధించింది. పశువులకు శుభాకాంక్షలు తెలియజేసేది కనుమ పండగ. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు కోళ్ల పందాలు నిర్వహిస్తారు. కోళ్లపందాల మోజు ఇప్పటి క్రికెట్‌ ఫీవర్‌తో పోల్చవచ్చు. అంతగా ప్రాధాన్యం ఉంది కోళ్లపందేలకి. కోళ్ల పందెం పేరుతో కొన్ని కోట్లు చేతులు మారుతాయంటే వీటి ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. కనుమ రోజు మినుములు తప్పనిసరిగా తినాలనేది శాYసం. కనుక ప్రతి ఒక్కరు ఈరోజు మినుప గారెలు చేస్తారు. మరుసటి రోజు ముక్కనుమ. దక్షిణ భారతదేశంలో సంక్రాంతిని మూడు రోజులు జరుపుకుంటారు. ఉత్తర భారతదేశంలో రెండో రోజు అంటే ”లోరీ (సంక్రాంతి) మాత్రమే జరుపుకోవటం ఆచారంగా వస్తోంది. మాంసాహారులు కనుమనాడు ఇష్టమైన మాంసాహారంతో విందుభోజనం చేస్తారు. శాకా హారులు మినుములతో చేసిన వంటకాలు చేసు కుంటారు. మినుములో అధిక మాంసకత్తులు ఉండటంవల్ల కనుమనాడు మినుములు తినాలన్న నియమం పెట్టారేమో! ”కనుమనాడు కాకి కూడా ప్రయాణం చెయ్యదని సామెత. కనుమ నాడు ప్రయాణాలు చేయడం శుభాలను కలిగించదని నమ్ముతారు. కనుమనాడు అందరి వాకిళ్లలో రథం ముగ్గులు కనువిందు చేస్తాయి. తెలంగాణ ప్రాంతంలో భోగినాడు చేసిన నువ్వుల రొట్టెలు తిని, పసుపు రంగు దుస్తులు ధరించి, ఉదయమే ముగ్గులు వేయడం ఆచారం. సంక్రాంతి ముగ్గుల ప్రత్యేకత నేలను చదును చేసి శుభ్రంగా అలికిన ప్రదేశం నిర్మలమైన ఆకాశానికి గుర్తు. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గడులలో వేసే ముగ్గు ఖగోళంలో జరుగుతున్న మార్పులకు గుర్తు. గడుల మధ్య పెట్టే చిన్న చుక్క సూర్యునికి సంకేతం. విల్లు ఆకారంలో వేసే ముగ్గు పునర్వసు నక్షత్రానికి, పుష్పం పుష్యమీ నక్షత్రానికి, పాము ఆకారం ఆశ్లేషకు, మేక, ఎద్దు, పీత, సింహం మొదలైనవి మేషం, వషభం, మిథునం, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలకు సంకేతాలుగా భావిస్తారు.పండగల పరమార్థం ఏమైనప్పటికీ పండగల పేరుతో ఆచరించే ఆచారాలు, సంప్రదాయాలు వాతావరణ పరిస్థితులకు తగినట్లు మార్పు చెందే వారికి చక్కని ఆరోగ్యాన్ని, సిరిసంపదలను కలిగిస్తాయని చెప్పవచ్చు. సంక్రాంతి నెల రోజులు అతివలకు చక్కటి వ్యాయామాన్ని కలిగిస్తుంది.