భూరికార్డుల ప్ర‌క్షాళ‌న‌కు కెసిఆర్ క‌లెక్ట‌ర్లకు ఆదేశాలు

KCR
KCR

హైద‌రాబాద్ః హైద‌రాబాద్‌లో ముఖ్య‌మంత్రి కెసిఆర్ భూరికార్డుల ప్ర‌క్షాళ‌న దిశ‌గా క‌లెక్ట‌ర్ల‌తో , జెసీలు, ఆర్డీఓల‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. తెలంగాణ రైతు సమితుల్లో లక్షా 75 వేల మంది సైన్యం చేరబోతుంది. వారి ద్వారా వ్యవసాయం పండుగ అవుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతులను సంఘటితం చేసేందుకు పూనుకుంది. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నాం.‘అయిదు ఎకరాలు దాటిన భూములకు సంబంధించి సాదా బైనామాలను కలెక్టర్‌ అనుమతితో క్రమబద్ధీకరించాలి. పాత దరఖాస్తుదారుల నుంచి సాదా బైనామా రాసుకున్న తేదీ నాటి రేటుతో రిజిస్ట్రేషన్‌ చేయాలి. వివాదాలు లేని అసైన్డ్‌ భూముల వివరాలు నమోదు చేసి రైతు యాజమాన్య హక్కులపై స్పష్టతనివ్వాలి అని కెసిఆర్ అన్నారు. తెలంగాణకు నూతన సంవత్సర కానుకగా జనవరి మొదటి తేదీ నాటికి సవరించిన, సరళీకరించిన, నవీకరించిన రికార్డులను అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. 10,785 రెవెన్యూ గ్రామాల్లో ఒక మహాయజ్ఞంలా ఈ కార్యక్రమం సాగుతుందన్నారు. రికార్డుల ప్రక్షాళనను ప్రభుత్వ కార్యక్రమంగా గాకుండా పితృవాత్సల్యంతో, అంకితభావంతో నిర్వహించాలని కోరారు. వచ్చే మూడు నెలల పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, సంయుక్త కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లు భూరికార్డుల ప్రక్షాళనకు అత్యంత ప్రాధాన్యమిచ్చి పనిచేయాలని ఆదేశించారు. బాగా పనిచేసిన వారికి ప్రోత్సాహకాలిస్తామన్నారు.గ్రామాల్లో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని నిర్వహించే బృందాల ఎంపిక బాధ్యత పూర్తిగా కలెక్టర్లదే.ఈ కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతీ కలెక్టర్‌కు రూ.50 లక్షలిస్తున్నాం.