భూతవైద్యంతో భ్రమలు తగ్గవు

వ్యధ

sad
sad

భూతవైద్యంతో భ్రమలు తగ్గవు

నా వయస్సు 30 సంవత్సరాలు. బి.టెక్‌ పాసయ్యాను. నా భర్తతో కలసి లండన్‌లో ఉద్యోగం చేస్తున్నాను. ఐదేళ్ల నుండి నన్నొక సమస్య వేధిస్తోంది. నేను ప్రేమించే వ్యక్తుల పట్ల ప్రతికూల భావాలు వస్తుంటాయి. ఆత్మీయులను కోల్పోతున్నట్టు, వారు త్వరలో చనిపోనున్నట్టు కలలు వస్తుంటాయి. కొన్నిసార్లు నాకు కలలో కనిపించిన వారు చనిపోవడం జరిగిన దాఖలాలు వ్ఞన్నాయి. అలాగే దేవుని పట్ల రకరకాల ఆలోచనలు తగ్గినా, ఖాళీగా వ్ఞన్నప్పుడు అవే ఆలోచనలు పదేపదే కలవరపరుస్తుంటాయి. దేవ్ఞని మీద విపరీతమైన భక్తి కలిగి ఉంటాను. అమ్మ, నాన్న, తమ్ముడు అంటే అమితమైన ప్రేమతో వ్యవహరిస్తుంటాను. నా భర్త, ఇద్దరు పిల్లల కంటే పుట్టింటివారి మీదనే ప్రేమ ఎక్కువ. మితిమీరిన ఆ ప్రేమ నాకు సమస్యగా తయారయ్యింది. గత ఏడాది మా నాన్న చనిపోతాడన్న ఆలోచనలు, కలలు విపరీతంగా వచ్చాయి. ఓరోజు ఆయన శవానికి దండవేసి నివాళులు అర్పించినట్టు కలవచ్చింది. ఆ కల వచ్చిన వారానికే ఆయన చనిపోయాడు. రెండు రోజుల క్రితం మా తమ్ముని ఫోటోకు దండవేసినట్టు కలవచ్చింది. అప్పటి నుండి అతను చనిపోతాడేమో అన్న భయం వెంటాడుతున్నది. ప్రతిక్షణం మా తమ్ముడు చనిపోయినట్టు శవం వద్ద నేను ఏడుస్తున్నట్టు ఆలోచనలు వస్తున్నాయి. దీంతో నిద్ర పట్టడం లేదు. ఆకలి కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇదిలా ఉండగా దేవ్ఞని పట్ల తప్పుడు భావాలు ఆలోచనలు వస్తున్నాయి. దేవుని విగ్రహం ముందు దిగంబరంగా కూర్చుని ప్రార్థిస్తున్నట్టు కొన్నిసార్లు అనిపిస్తుంది.

అంతలోనే ఆ విగ్రహంపై మలం వేస్తున్నట్టు, మూత్రం చల్లుతున్నట్టు స్పరిస్తుంది. దీంతో పాపభీతితో భయం వేస్తుంది. ఒళ్లంతా చెమటపట్టి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ భావాలు, ఆలోచనలు వద్దనుకున్నా నన్ను వదలడం లేదు. దీంతో ఇంట్లో బయట పలు సమస్యలను ఎదుర్కొంటున్నాను. చేసే పనిపట్ల ఏకాగ్రత కోల్పోయి తప్పులు చేస్తున్నాను. ఒక్కోసారి పరధ్యానంగా ఉండిపోతున్నాను. నా సమస్యలను మా అమ్మకు చెపితే ఇండియాకు వచ్చి భూతవైద్యం చేయుంచుకోమంటున్నది. మాది నెల్లూరు జిల్లాలోని ఒక పల్లెటూరు. తమిళనాడులో మంచి భూతవైద్యులు ఉన్నారని, వారి వద్ద మంత్రాలు వేయిస్తే తగ్గిపోతాయంటున్నది. ఈ దశలో చక్కని పరిష్కారం చూపండి.       -వై.సుచరిత, నెల్లూరు (లండన్‌)

అమ్మా మీరు తీవ్రమైన భ్రమలు, భ్రాంతులకు గురవుతున్నారు. ఇవి పదేపదే రావడాన్ని అబ్బెసివ్‌ కంపల్సివ్‌ డిజార్డర్‌ (ఒసిడి) అంటాం. వీటివల్ల డిప్రెషన్‌కు గురవ్ఞతున్నారని స్పష్టమవ్ఞతున్నది. ఇవన్నీ మానసిక రుగ్మతలని గుర్తించండి. భ్రమలు, భ్రాంతులు కలగడానికి స్కిజోఫ్రెనియా అన్న మానసిక రుగ్మత కారణం కావచ్చు. మీ రుగ్మతను స్పష్టంగా గుర్తించాలంటే మరింత సమాచారం అవసరముంటుంది.

ఏది ఏమైనా భూతవైద్యంతో భ్రమలు, భ్రాంతులు తగ్గవని గుర్తించండి. మానసిక వైద్యం సరిగా అందుబాటులో లేని రోజుల్లో మంత్రాలు, తంత్రాలు, పూజలు, తాయెత్తులు వగైరాలపై ఆధారపడే వాళ్లం. ఒక మోస్తరు రుగ్మతలు, నమ్మకం, విశ్వాసం, భక్తి, శారీరక వ్యాయామాల వల్ల తగ్గే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న సమస్యలు కాలంలో కరిగిపోతాయి.

అంటే శారీరక ఆరోగ్యం, పరిసరాలు అనుకూలించినపుడు కొన్ని మానసిక సమస్యలు ఉపశమించే అవకాశాలు వ్ఞన్నాయి. భూతవైద్యలు వేసే మంత్రాలు, కట్టే తాయత్తులలో ఎలాంటి మహిమలూ లేవ్ఞ. అవన్నీ పూర్తిగా అశాస్త్రీయమైనవే. కాబట్టి మీరు తక్షణం అనుభవజ్ఞుడైన మానసిక వైద్యున్ని (సైకియాట్రిస్టు) కలసి చికిత్స తీసుకోండి. మీ రుగ్మత తీవ్రతను బట్టి అతను తగిన మందులు ఇస్తారు.

అలాగే మంచి సూచనలు చేస్తారు. మందులను దీర్ఘకాలం వాడాల్సి ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా చికిత్స చేయించుకోండి. అలాగే డాక్టర్‌ అనుమతి తీసుకుని మానసిక నిపుణుని (సైకాలజిస్ట్‌) ద్వారా కౌన్సెలింగ్‌ తీసుకోండి. వివేక కల్పన, ప్రవర్తనా మార్పు చికిత్సలు, ఇతర పద్ధతుల ద్వారా మీ మనస్సును నియంత్రించుకోవడం నేర్పిస్తారు. రోజు అర్ధగంట పాటు ఉదయం లేదా సాయంత్రం ఎండలో వ్యాయామాలు చేయడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. యోగ, ధ్యానం, స్వీయ సమ్మోహనం (హిప్పాటిజం) లాంటివి చికిత్సకు సహాయకరిగా పనిచేస్తాయి. అలాగే సానుకూల ఆలోచనలు, సంతోషకర పరిసరాలను అభివృద్ధి పరచుకోవడం మంచిది.

– డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌ రెడ్డి, సైకాలజిస్ట్‌