భీష్ముడు శాంతమూర్తి

Swamy Sundara Chaitanyananda
Swamy Sundara Chaitanyananda

భీష్ముడు శాంతమూర్తి

కంటికి గోచరిస్తున్న ఒక రూపాన్ని చూడటం మనస్సుకు ఇష్టం లేకపోతే వెంటనే కళ్లు ప్రక్కకు తిరుగుతాయి. చూపు మారుతుంది. కాని, ఇష్టంలేని అనేక రూపాలు, కష్టాన్ని కలిగించే అనేక విషయాలు మనస్సులో గోచరించినపుడు మనస్సు ఏం చేయగలుగుతుంది? ఏమీ చెయ్యలేదు, బాధపడటం తప్ప, వ్యధ చెందటం తప్ప. ఇష్టం లేదు కనుక గిట్టని వాళ్లతో భాషించకుండా ఉండ వచ్చు. అలాగని, వారిని గూర్చిన భావాలు బుద్ధిలో కదలకుండా ఆపగలమా? మనస్సులోని మర్మర ధ్వనుల్ని నిలపగలమా? బాహ్యం ఉంది. అది ఆంతర్యానికి బాహ్యంలో లేదు.

మనస్సులో కోపం పుడుతుంది. అంతే, కళ్లు ఎరుపెక్కుతాయి. శ్వాసలు పరుగులెత్తుతాయి. పెదవ్ఞలు చలిస్తూ ఉంటాయి. దేహం ఊగుతుంది. చెమటలు పోస్తాయి. మనస్సులో కారణాన్ని పెట్టుకొని దేహస్థాయిలో కార్యాలను ఆపగలమా? మనం చేసే పూజ ఎవరి కొరకు? భగవంతుని కొరకు. మనం కీర్తించేది ఎవరిని? భగవంతుణ్ణి. సరే, బావ్ఞంది. మనపూజలు, కీర్తనలు పరమాత్మకు అవసరమా? వాటివల్ల ఆయనకు ఏం లాభం? అనంతుడైన పరమాత్మకు మన సాధనల వలన ఒరిగే దేమిటి? తరిగేదేమిటి? ఏమీ లేదు. మన మనస్సులో భక్తి ఉంది. భావశుద్ధి ఉంది.

అది అర్చన కీర్తనాదుల ద్వారా వ్యక్తమవ్ఞతోంది. ఇదంతా ”స్వాంతస్సుఖాయ. మన తృప్తికొరకే. ఆంతర్యం ఉంది. బాహ్యానికి అభ్యంతరం కాదు. చందనం ముఖాన పెట్టుకుని అద్దం ముందు నిలబడతాం. ఆకాశంలో చంద్రుని లాగ ముఖాన శోభించే చందనాన్ని చూసుకుని హాయిగా మనసు చల్లబడుతుంది. అద్దంలో బాహ్యంగా కనిపించే చందనపు బొట్టు అద్దంలో లేదు. బాహ్యంలో ఉన్నట్లు కనిపించేది, వాస్తవానికి ఉన్నది మన ముఖంపైనే. అలా ఉన్నట్లు తెలిసేది మాత్రం ముఖం మీద కాదు, మనస్సులో. అద్దంలో బొట్టు అందంగా లేకుండా బొద్దుగా ఉందనుకోండి. మనవైపు చూస్తున్నాడు కదా అని అద్దం బొట్టును సరిచేయగలదా? సైజ్‌ చేయగలదా? బాహ్యం ఉంటుంది.

ఆంతర్యమే శోభించాలి. ముఖాన బొట్టు అందంగా ఉంది. అద్దం మురికిగా ఉంది. అందమైన చందనపు బొట్టు అందంగా కనిపించటం లేదు. అందం లేదు అనిపిస్తుంది కనుక మనస్సు ఆనందాన్ని జారేసుకుంది. అనవ సరంగా పారేసుకుంది. మళ్లీ మళ్లీ ముఖాన్ని శుద్ధి చేసుకుని నూతనంగా చందనం దిద్దుకున్నంత మాత్రాన అద్దంలో క్రొత్త అందాలు చిగురించవ్ఞ. పాత రోతలు పోవు. అద్దంపై నున్న మురికిని శుద్ధి చేయాలి. ఆ తరువాత బుద్ధి ఆనందంతో పండుతుంది. అద్దంపై నున్న మురికిని శుద్ధి చేయటానికి సుద్దలాంటి మురికినే ఉపయోగించవచ్చు. ఏది ఉపయోగించామనేది ప్రశ్నకాదు. శుద్ధి జరిగిందా? లేదా? అనేదే విషయం. ఆంతర్యం శోభించాలి. బాహ్యంలోనే అది ప్రతిఫలించాలి.

శుద్ధబుద్ధి గలవాడు లేదా, శుద్ధబుద్ధి కొరకు ప్రయత్నించువాడు సాధకుడు. సాధకుడు ఆచార వంతుడు. విచారవంతుడు కానివాడు ఆచారవంతుడు కాలేడు. ఆచార, విచారాలలో సమతూక మెరిగినవాడు, సమతుల్యంగా చరించేవాడు సాధకుడు. బాహ్యంలో ఆచారం బహిరంగ సాధన. ఆంతర్యంలో విచారం అంతరంగం సాధన. యజ్ఞము, పూజ, దానము, సంకీర్తనము, సేవ ఇవన్నీ బహిరంగాలు. ధ్యానము, మననము, స్మరణము, విచారము, ఇవన్నీ అంతరంగాలు. సామగ్రి, ధనము, జనము, కాలము,

దేశము ఇవి బహిరంగ సాధనకు సహకారాలు. ప్రశాంతత, అహింస, సత్యము, నిరహంకారత. ఇవి అంతరంగ సాధనకు సహకారాలు. ఆకారం అవశ్యం. సహకారం అనివార్యం. సాధకుడు కొన్ని రూపాలు చూడకూడదు. ఇది బహిరంగ సాధన. చూసినా మనస్సు వాటిని నిలుపుకోకూడదు. ఇది అంతరంగ సాధన. కొన్ని శబ్దాలను సాధకుడు వినకూడదు. ఇది బహిరంగ సాధన. వినినా మనస్సు వాటిని నిలుపుకోకూడదు. ఇది అంతరంగ సాధన బాహ్యంలో చలనముంది.

ఆంతర్యంలో సంచలనం లేదు. ఇది రాగం లేని స్థితి…ద్వేషం రాలేని పరిస్థితి. లేని రాగం తెచ్చేదేముంటుంది? రాలేని ద్వేషం కొనితెచ్చేదేముంటుంది? రాగద్వేషాలు లేని కర్మలో అప్రియమేది? అశాంతి ఎక్కడిది? అరణ్యం. అయినా, అరణ్యవాసియైన రాముడు అయోధ్యావాసియే. అంపశయ్యపై పవ్వళించియున్నా, కాపురమున్న కొంప కూలిపోతున్నా, కునుకు లేకుండా, కన్నీటి చినుకు రాలకుండా, శాంతి తల్పముపై పయనించిన శంతనసుతుడు, శాంతమూర్తి భీష్ముడే. బాహ్య చలనాలు కదిలించలేని, ఆంతర్య సంచలనాలు కరిగించలేని ఏకదశలో, ఏకాదశిలో, శాంతిరూపుడై, కాంతిరూపుడై శోభించిన భీష్ముడు సాధకుడే. ఉత్తరాయణంలో తాను సాధ్యమే. ఏదో ఒకనాడు సాధకులందరూ భీష్ములే.

– స్వామి సుందర చైతన్యానంద