భార‌త్-అమెరికా మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతోంది: మోదీ

modi and trump in philippines
modi and trump in philippines

మనీలా: ఫిలిప్పీన్స్‌ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొద్దిసేప‌టి క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఆసియాన్‌ సదస్సు హాజరయ్యేందుకు వచ్చిన ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో రక్షణ, భద్రత తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ప్రధాని మోదీ, ట్రంప్‌ సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత్‌, అమెరికా మధ్య బంధం మరింత బలపడుతోందన్నారు. ‘ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ద్వైపాక్షిక బంధాన్ని దాటిపోయాయి. ఆసియా ప్రజల ప్రయోజనాలు, భవిష్యత్‌ మనుగడకు మేం కలిసి కృషి చేస్తున్నాం’ అని మోదీ అన్నారు. అంతేగాక.. భారత్‌పై ప్రశంసలు కురిపిస్తున్న ట్రంప్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ‘సందర్భం వచ్చినప్పుడల్లా భారత అభివృద్ధిని ట్రంప్‌ ప్రశంసిస్తున్నారు. అందుకు చాలా అనందంగా ఉంది. భారత్‌ నుంచి అమెరికా ఏం ఆశిస్తుందో ఆ సహకారాన్ని ఎప్పటికీ అందిస్తామని హామీ ఇస్తున్నా’ అని మోదీ అన్నారు. మ‌రోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ.. మోదీపై పొగడ్తల వర్షం కురిపించారు. ‘ప్రధాని మోదీని నేను ఇంతకు ముందే శ్వేతసౌధంలో కలిశాను. ఆయన మంచి స్నేహితుడు. భారత అభివృద్ధి కోసం ఆయన ఎన్నో గొప్ప పనులు చేస్తున్నారు. అనేక సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఆయన నాయకత్వంలో ప్రజలకు మంచి ఫలితాలు అందుతున్నాయని విన్నాను. మున్ముందు కూడా ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ట్రంప్ స్ప‌ష్టం చేశారు.