భారీగా స్విస్ పెట్టుబడులు

Chandra Babu
ఎపి సిఎం తొలిరోజు పర్యటనలో ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్తలతో భేటీ
మియర్‌ బర్గర్‌ సోలార్‌ ప్యానెల్‌ యూనిట్‌
2వేల కోట్లతో టెక్స్‌టైల్‌ పార్క్‌
ఇండాని సంస్థ నూనెశుద్ధి కార్మాగారం
జ్యూరిచ్‌లో 11 సమావేశాలు నిర్వహించిన చంద్రబాబు
హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి చంద్ర బాబు మంగళవారం స్విట్జర్లాండులో బిజీబిజీగా గడిపారు. నవ్యాంధ్రలో పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా సాగిన ఆయన పర్యటనలో తొలిరోజు దిగ్విజయమైంది. మధ్యాహ్నం జురిచ్‌లో అడుగుపెట్టిన వెంటనే ఎన్నారైల సమా వేశంలో పాల్గొన్న సిఎం బృందం పెట్టుబడీ దారులతో వరుస వారీగా భేటి అయింది.సౌర విద్యుత్‌ రంగంలో ప్రసిద్ధి గాంచిన మియర్‌ బర్గర్‌ కంపెనీ ఏపిలో సోలార్‌ ప్యానెల్‌ తయారీ సంస్థ స్థాపనకు ఏపిలో సోలార్‌ ప్యానెల్‌ తయారీ సంస్థ స్థాపనకు సంసిద్ధత వ్యక్తం చేసింది. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్‌లో ప్రారంభమైన ఇన్వెస్టర్‌ మీట్‌ సందర్భంగా మియర్‌ బర్గర్‌ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం భేటీ అయింది. ఈ సందర్భంగా విశాఖపట్టణం, రాజమహేంద్ర వరంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీ ఆసక్తిని వ్యక్తం చేసింది. తమ ఉత్పత్తులో 50 శాతం ఎగుమతి చేసి మిగతా 50 శాతం ఉత్పత్తులను దేశీయంగా విక్రయిస్తామని కంపెనీ ప్రతిపాదించింది. దీనికి అంగీకరించిన సిఎం చంద్రబాబు సంస్థ ఏర్పాటుకు పూర్తిగా సహకరిస్తామని మియర్‌బర్గ్‌ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.

మరో సోలార్‌ ప్యానెల్‌ తయారీ కంపెనీ అయిన ఫ్లిసమ్‌ కూడా ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని ప్రదర్శించింది. ఈ సంస్థ 200 మిలియన్‌ డాలర్లను పెట్టుబడితో తమ యూనిట్‌ను నెలకొల్పేందుకు సంసిద్ధతను వ్యక్తం చేసింది. చైనా, యూరప్‌లకు చెందిన పలువురు ప్రతినిధులు సైతం బయో టెక్నాలజీ, బయోమెడికల్‌ సైన్స్‌, రోగ నిర్ధారణలకు సంబంధిం చిన రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. జ్యురిచ్‌లో దాదాపు 11 సార్లు వివిధ సంస్థల ప్రతినిధులతో సిఎం సమావేశాలు నిర్వహించారు. లో ఎనర్జీ భవన నిర్మా ణాల్లో తన ప్రత్యేకతను చాటుకున్న న్యూఇష్‌ సంస్థ సైతం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థ ఇప్ప టికే పూనెలో పెట్టుబడులు పెట్టింది. ఫ్రాన్సెసో గెరి చైర్మన్‌ 2000 కోట్ల రూపాయల పెట్టుబడులతో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటుకు ముందుకొచ్చారు. ఎథికల్‌ కాఫీ కంపెనీ ఏడేళ్లలో బిలియన్‌ డాలర్లతో విశాఖ జిల్లా అరకులో ఆర్గానిక్‌ కాఫీ ప్లాంటును నెలకొల్పేందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఇండాని గ్లోబల్‌ సంస్థ పామాయిల్‌ వంట నూనె శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్రంలో బంగారు నిక్షేపాలు సరిపడ నిల్వలు ఉంటే గోల్డ్‌ రిఫైనరీని ఏర్పాటు చేస్తామని ఇదే సంస్థ సంసిద్ధతను వ్యక్తం చేసింది.

బిటి,ఐటి రంగాల్లో ఏపి మేటి
వినూత్న ఆవిష్కరణలకు వేదికగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూరప్‌ తెలుగు సమాజానికి పిలుపు ఇచ్చారు. దావోస్‌లో జరిగే ఆర్ధిక వేదిక 46వ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లేముందు జ్యురిచ్‌లో కొన్ని గంటలు గడిపిన సిఎం చంద్రబాబు తొలుత ప్రవాసాంధ్రులు, ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.లండన్‌కు చెందిన తెలుగు సంఘం నిర్వహించిన ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో సిఎం పాల్గొని ప్రవాసాంధ్రులతో మాట్లాడారు.విదేశీ గడ్డపై ఇప్పటికే కీర్తి బావుటా ఎగురవేసిన తెలుగు వారు తమ అనుభవాలను,సాధించిన విజయాలను జన్మభూమికి అందించాలని ఈ సందర్భంగా వారిని సిఎం కోరారు.యూరోపియన్‌ దేశాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తమ విధానాలు, పద్ధతులతో నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బాటలు వేయవచ్చని అన్నారు.లండన్‌,స్విట్జర్లాండ్‌లోని తెలుగు ప్రముఖులతో సిఎం మాట్లాడి వారి సూచనలను, ప్రతిపాదనలను స్వీకరించారు.ఏపిలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ విధానాలలో గుణాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా రాష్ట్రాన్ని ప్రపంచానికే నమూనాగా నిలపవచ్చని పలువురు ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రికి సూచించారు. ముఖ్యంగా బయోమెడికల్‌ టెక్నాలజీలో ఇన్నోవేషన్స్‌ కోసం ప్రయత్నించడం ద్వారా అనూహ్య ఫలితాలు సాధించవచ్చనా ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ చెప్పారు. బయోమెడికల్‌ టెక్నాలజీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని ,సుమారు 500 బిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరుగుతోందని వివరించారు.ఈ రంగంలో భారత్‌ వెనుకపడి ఉన్నందున యూరోపియన్‌ భాగస్వామ్యంతో ఏపిలో ఇన్నోవేషన్‌ ఏర్పాటు చేస్తే గ్లోబల్‌ మార్కెట్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టిన బిడ్డ నుంచి బొడ్డుతాడును సేకరించి భద్రపరిచే అత్యంత ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని మరో ప్రవాస భారతీయుడు సూచించారు.నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా చేపట్టాలని ఎస్‌టిఎన్‌ఆర్‌ఐ చైర్మన్‌ అమరకవి సూచించారు. ఐటి స్టార్టప్‌లపై దృష్టి కేంద్రీకరించాలని సిఎంను ఐటి రంగ నిపుణుడు రాజేష్‌ కోరారు.మహిళా సాధికారత పై పద్మజారెడ్డి, స్మార్ట్‌గ్రిడ్‌పై జోగినాయుడు , సాఫ్ట్‌వేర్‌రంగంపై మరి కొందరు ముఖ్యమంత్రి ఎదుట కొన్ని ప్రతిపాదనలు ఉంచారు. వీటిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఇటువంటి సరికొత్త ఆలోచనల కోసమే తాను దేశవిదేశాల్లో పర్యటిస్తున్నానని చెప్పారు.ఎన్‌ఆర్‌ఐల నుంచి ప్రతిపాదనలను,సలహాలను స్వీకరించేందుకు ఏపిఎన్‌ఆర్‌టి పేరుతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుంచి ప్రముఖ విద్యావేత్తలను రాష్ట్రానికి ఆహ్వా నిస్తున్నామని, వారి సహాయ, సహకారాలతో రాష్ట్రాన్ని విద్య, వైజాఙనిక నిలయంగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రయత్నమని సిఎం చెప్పారు. సిఎంతో పాటు ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరాకాల ప్రభాకర్‌, ఎంపీ సిఎం రమేష్‌ ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.