భారత్‌ సహా ప్రపంచ దేశాల మద్దతు కావాలి..ప్రచండ

పార్లమెంట్‌ను రద్దు చేసిన ఆప‌ద్ధ‌ర్మ‌ ప్ర‌ధాని ఓలీ
అప్రజాస్వామికమ‌న్న ప్ర‌చండ‌

ఖాట్మాండు: నేపాల్‌ ప్రధాని కేపీశర్మ ఓలీ తీరును నిరసిస్తూ తాము చేస్తున్న పోరాటానికి భారత్‌తో పాటు ప్రపంచ దేశాలూ మద్దతివ్వాలని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ చైర్‌పర్సన్ ప్రచండ విజ్ఞప్తి చేశారు. కేపీశర్మ ఓలీ అప్రజాస్వామికంగా పార్లమెంట్‌ను రద్దు చేశారని ప్ర‌చండ అన్నారు. దీంతో ఆయ‌న చ‌ర్య‌లు ప్రజాస్వామ్య పతనానికి దారితీశాయ‌ని తెలిపారు. ఈ పరిస్థితిని అంతర్జాతీయ సమాజం గమనించాలని, నేపాల్‌లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం మ‌ద్ద‌తు తెల‌పాల‌ని కోరారు. భారత్‌ చైనాతో పాటు అంతర్జాతీయ సమాజం త‌మ‌ అండగా నిలవాలని విన‌తి చేశారు.

అయితే, చైనా మద్దతుతోనే కేపీ శర్మ పార్లమెంట్‌ను రద్దు చేశారా? అని మీడియా ప్రచండ‌ను ప్రశ్నించగా, నేపాల్ వ్యవహారాల్లో ఇతర దేశాలను తాము లాగలేమని అన్నారు. ఇటువంటి నిర్ణ‌యాల్లో దేశీయ నేతల నిర్ణయమే ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావాలంటే పార్లమెంట్‌ను తిరిగి పునరుద్ధరించాలని తెలిపారు. పార్లమెంట్ రద్దును అప్రజాస్వామిక చర్య‌గా సుప్రీం కూడా సమర్థించదని తాము భావిస్తున్నామని చెప్పారు.

ప్రధాని కేపీశర్మ ఓలీ, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్ ప్రచండ మధ్య కొన్ని రోజులుగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ప్రత్యర్థి ప్రచండకు రాజకీయంగా ఝలక్ ఇవ్వాలని నిర్ణయించుకున్న ప్రధాని… హఠాత్తుగా పార్లమెంట్‌ను రద్దు చేయాలని అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి సిఫార్సు చేశారు. వెంటనే విద్యాదేవి భండారి పార్లమెంట్‌ను రద్దు చేయడంతో పాటు సాధారణ ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏప్రిల్, మే మాసాల్లో జరుగుతాయని ప్రకటించారు.