భారత్ భూభాగాన్ని చైనాకు అప్పగించారు.. రాహుల్
భారత భూభాగాన్ని ఎవరు అప్పగించారన్న విషయాన్ని నెహ్రూను అడుగు కిషన్ రెడ్డి
PM Modi has given away Indian territory to China, alleges Rahul Gandhi
న్యూఢిల్లీ: భారత భూభాగాన్ని ప్రధాని మోడి చైనాకు అప్పగించారు అని రాహుల్ ఆరోపించారు. దీనిపై దేశ ప్రజలకు మోడి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. నిన్న రాజ్యసభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. తూర్పు లఢక్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత పరిణామాలపై ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై రాహుల్ ఈ రోజు ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ… భారత సైన్యం ఫింగర్ 4 నుంచి ఫింగర్ 3కి చేరుకుంటోందని తెలుసుకున్నామని, ఫింగర్ 4 మన దేశ భూభాగానికి చెందినది అయినప్పటికీ మన ఆర్మీ ఫింగర్ 3కి ఎందుకు రావాలని ఆయన ప్రశ్నించారు.
మనత భూభాగాన్ని చైనాకు ఎందుకు అప్పగిస్తున్నారని నిలదీశారు. చైనాతో నెలకొన్న పరిస్థితులపై నిన్న పార్లమెంటులో మాట్లాడిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చైనా ప్రవేశించిన డెప్సాంగ్ మైదానాలపై ఎందుకు మాట్లాడలేదని రాహుల్ ప్రశ్నించారు. భారత ఆర్మీ చేసిన త్యాగాలను కూడా పక్కనపెట్టి, దేశానికి మోడి ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి చర్యలను దేశ ప్రజలు ప్రోత్సహించకూడదని చెప్పారు. దీనిపై ప్రధాని మోడి సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.
కాగా, రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడి భారత భూగాన్ని చైనాకు అప్పగించారన్న రాహుల్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించారు. చైనాకు భారత భూభాగాన్ని ఎవరు అప్పగించారనేది మీ ముత్తాతను(జవహర్ లాల్ నెహ్రూ)ను అడిగితే సమాధానం తప్పకుండా తెలుస్తుందని ఆయన అన్నారు. దేశభక్తి ఎవరికి ఉందో.. ఎవరికి లేదో ప్రజలకు తెలుసు అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.