భారత్‌ బుల్లెట్‌రైలుతో జపాన్‌ లబ్ధి పొందనుందా?

-JAPAN
-JAPAN

న్యూఢిల్లీ: భారత్‌లో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుతో జపాన్‌ కంపెనీలు లబ్ధి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. 17బిలియన్‌ డాలర్ల విలువచేసే భారత్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుకు కావాల్సిన వస్తువుల సరఫరాకు సంబంధించిన కాంట్రాక్టులు జపాన్‌లోని స్టీల్‌, ఇంజినీరింగ్‌ కంపెనీలకు దక్కేలా ఉన్నాయని సంబంధిత వర్గాల నుంచి సమాచారం. భారత ప్రధాని నరేంద్రమోడీ ఆర్థిక విధానం మేక్‌ ఇన్‌ ఇండియా సిద్ధాంతాన్ని పక్కన పెట్టి జపాన్‌కు కాంట్రాక్టులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం జపాన్‌ ఎక్కువ భాగం నిధులు సమకూరుస్తోంది. అలాగే రైలు లైన్‌కు కావాల్సిన దాదాపు 70శాతం వస్తువులను జపాన్‌ కంపెనీలే సరఫరా చేయనున్నాయని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న వారి నుంచి సమాచారం. అయితే ప్రధాని కార్యాలయ అధికార ప్రతినిధి దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ప్రాజెక్టు కావాల్సిన ప్రధాన పరికరాలు, వస్తువుల సరఫరాకు సంబంధించిన అంశంపై ఇరు దేశాలు ఓ నిర్ణయానికి రావాల్సి ఉందని, జూలై నాటికి దీనిపై ఓ ప్రణాళిక ఇస్తామని జపాన్‌ రవానా మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రాజెక్టు విషయంలో నెలకొన్న సందిగ్ధత నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2017 సెప్టెంబరులో జపాన్‌తో బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భారత్‌లో తయారీతో పాటు సాంకేతికత బదిలీ అంశాలను చేర్చారు. ఇక్కడే తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ కల్పన చేయాలని భారత్‌ ఆశిస్తోంది. అయితే సంస్కృతి, వ్యవస్థల విషయంలో జపాన్‌కు, భారత్‌కు తేడా ఉందని, పని సంస్కృతిలోనూ చాలా తేడా ఉందని జపాన్‌ నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అచల్‌ ఖరే తెలిపారు. ప్రస్తుతం హైస్పీడ్‌ రైల్వే సిస్టమ్‌కు కావాల్సిన ప్రత్యేకమైన టెక్నాలజీ, అనుభవం భారత్‌ కంపెనీల వద్ద లేదని జపాన్‌ అంతర్జాతీయ ఇంజినీరింగ్‌ అఫైర్స్‌ డైరెక్టర్‌ టోమొయుకి నకానో అన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులో కీలకమైన పనులు జపాన్‌కే ఎక్కువగా దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.