భారత్‌లో మహిళలకు రక్షణలేదని టోర్నీ నుంచి తప్పుకున్న ప్లేయర్‌.

భారత్‌లో మహిళలకు రక్షణలేదని
టోర్నీ నుంచి తప్పుకున్న ప్లేయర్‌

SQUAS PLYAER

చెన్నై: భారత్‌లో మహిళలకు రక్షణ లేదన్న కారణంగా స్విట్జర్ల్యాండ్‌కు చెందిన ఓ క్రీడాకారిణి భారత్‌కు వచ్చేందుకు నిరాకరించింది. చెన్నై వేదికగా జరగనున్న వరల్డ్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌ షిప్‌ టోర్నీకి స్విట్జర్ల్యాండ్‌కు చెందిన ఓ ప్లేయర్‌ను పంపించేందుకు ఆమె తల్లిదండ్రులు అభ్యంతరం తెలిపారు. దీంతో స్విట్జర్ల్యాండ్‌కు చెందిన టాప్‌ జూనియర్‌ స్క్వాస్‌ ప్లేయర్‌ ఆంబ్రే అలింక్స్‌ భారత్‌లో జరిగే ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌ షిప్‌నుంచి తప్పుకుంది. జాతీయ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఆంబ్రే అలింక్స్‌ను ఆమె తల్లిదండ్రులు భారత్‌లో భద్రతా కారణాలను చూపుతూ అడ్డుకోవడంతో టోర్నీ నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నాయి. దీనిపై టోర్నీ నిర్వాహకులు మాట్లాడుతూ క్రీడాకారుల తల్లిదండ్రుల అభిప్రాయాలను గౌరవిస్తాం. 28 దేశాల నుంచి 250మంది ప్లేయర్లు, అధికారులు భాతర్‌కు వస్తున్నారని, అందులో స్విట్జర్ల్యాండ్‌ నుంచి జట్టు కూడా వస్తోందని డబ్ల్యుఎఫ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆండ్రూ షెల్లీ ఒక ప్రకటనలో తెలిపారు.

మరోవైపు స్విట్జర్ల్యాండ్‌ కోచ్‌ పాస్కల్‌ బురిన్‌ మాట్లాడుతూ ఆంబ్రే అలింక్స్‌ తల్లిదండ్రులు ఆమెను భారత్‌లో జరగనున్న వరల్డ్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌కు అనుమతించలేదు. అందుకే ఆమె ఈ టోర్నీలో పాల్గొనడం లేదు. మహిళలకు రక్షణ ఉండదని ఇంటర్నెట్‌లో వచ్చిన నివేదికను వారు చదివారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్‌; ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా భారత్‌లో మహిళల రక్షణపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. మరోవైపు ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించేందుకు అనువైన సెక్యూరిటీ ఏర్పాట్లు బాగానే ఉన్నాయని వరల్డ్‌ స్క్వాష్‌ ఫెడరేషన్‌ (డబ్ల్యుఎస్‌ఎఫ్‌) సంతృప్తి వ్యక్తం చేసింది. ఒకప్పుడు మహిళలకు రక్షణలేని దేశాల్లో ఆప్గనిస్తాన్‌, పాకిస్తాన్‌ వంటి దేశాలు ముందు వరుసలో ఉండేవి. అయితే, థామ్సన్‌ రాయిటర్స్‌ ఫౌండేషన్‌ అనే లండన్‌ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో భారత్‌ మొదటి స్థానంలో ఉందని పేర్కొనడం ఆందోళన కలిగిస్తోంది.