భవిష్యత్తు అంతా ప్రైవేట్‌ బ్యాంకులదే!

MORGAN-
MORGAN-

భవిష్యత్తు అంతా ప్రైవేట్‌ బ్యాంకులదే!

ముంబై,: మున్ముందు కాలంలో భారతదేశంలోని ఆర్థికవ్యవస్థలో పెద్ద ప్రైవేట్‌ బ్యాంకులు అత్యంత ప్రాధాన్యమైన పాత్రలను పోషించనున్నాయని ఆయా బ్యాంకుల షేర్లు భారీగా పెరుగగలవని మోర్గాన్‌ స్టాన్లీ సంస్థ జోస్యంచెప్పింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే ప్రైవేట్‌ బ్యాంకులు శీఘ్రంగా అభివృద్ధి చెందుతాయని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్టేట్‌ బ్యాంకుకు మాత్రమే ఆ అవకాశముందని మోర్గాన్‌ స్టాన్లీ ప్రకటించిన ఒక పరిశోధన పత్రంలో పేర్కొంది. మారిన ఆర్థిక అంశాలను దృష్టిలో ఉంచుకొని మోర్గాన్‌ స్టాన్లీ ఈ నివేదికను సమర్పించింది. ఎన్‌బిఎఫ్‌సిల సంక్షోభం, రూపాయి మారకం విలువ తగ్గడం, పెట్రోల్‌ ధరలు పెరగడం వంటి అన్ని అంశాలు దృష్టిలో ఉంచుకొని మోర్గాన్‌ స్టాన్లీ ఒక పరిశోధనా పత్రాన్ని తయారుచేసింది.

ఎన్‌బిఎఫ్‌సిలు దిగాలుపడిన నేటి తరుణంలో లిక్విడిటీ సంక్షోభం తలెత్తిన సమయంలో ప్రైవేట్‌ బ్యాంకులు మరింత చురుకుగా వ్యవహరిస్తాయని, రుణాల వితరణ పరితగతిని పూర్తిచేసుకుంటూ అభివృద్ధి సాధిస్తాయని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. ప్రీ ప్రొవిజన్‌ ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ (పిపిఒపి)ని కొనుమానంగా తీసుకొని మోర్గాన్‌ స్టాన్లీ ఈ నివేదికను రూపొందించింది. ప్రీ ప్రొవిజన్‌ ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ అంటే ఒక నిర్ధిష్టకాలంలో ఆ ఆర్థిక సంస్థ గడించే మొత్తం ఆదాయం అన్నమాట. ఇందులో మొండిబకాయిలు ఇతర ఖర్చులను కలపరు. అంటే మొత్తం ఆదాయం దృష్టిలో ఉంచుకొని నిష్పత్తి పరంగా చెప్పే సంఖ్య. దీన్ని పిపిఒపి అంటారు. ప్రైవేట్‌ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల్లో ఏ విధంగా ఆదాయాలు గడిస్తాయి? వాటి దగ్గర ప్రస్తుతమున్న కేపిటల్‌ ఎంత? ఇప్పుడు వస్తున్న లాభం ఎంత? మొదలగు విషయాలన్నీ కూడా పరిగణలోని తీసుకొని దీన్ని లెక్కడతారు. ఆ విధంగా రూపొందించిన నివేదిక వివరాలను మోర్గాన్‌ స్టాన్లీ తన పత్రంలో పేర్కొంది. ‘ప్రైవేట్‌ బ్యాంకుల పట్ల ముఖ్యంగా పెద్ద ప్రైవేట్‌ బ్యాంకుల పట్ల మాకు సదాభిప్రాయం ఉంది. ఇప్పుడిప్పుడు ఎన్‌పిఎల్‌ పరిభ్రమిస్తోంది.

దానివల్ల రీ-రేటింగ్‌ జరుగుతోంది. ఈ రీ-రేటింగ్‌ వల్ల ప్రైవేట్‌ బ్యాంకులు ముందంజలో ఉండడం తప్పని సరి అనిపి స్తోందని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. ప్రైవేట్‌ బ్యాంకుల్లో కూడా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు ముందుంటాయని మార్కెట్‌లో పరిస్థితులు సర్దుకుని తిరిగి పెరగడం ప్రారంభిస్తే, ఈ మూడు బ్యాంకుల షేర్లు పెరుగుతాయని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. గతంలో 32శాతం ఉన్న పిపిఒపి ఇప్పుడు 29శాతానికి తగ్గిందని, అయితే రిటైల్‌ బ్యాంకింగ్‌లో చెప్పుకోదగిన అభివృద్ధి సాధ్యమవుతుం  దని, తిరిగి పిపిఒపి 38శాతానికి చేరుతుందని మోర్గాన్‌ స్టాన్లీ జోస్యం చెప్పింది. ఈ లెక్కల ఆధారంగా రానున్న రెండు, మూడు నెలల్లో ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు షేర్లు 46శాతం పెరుగుతాయని, అదేవిధంగా స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా షేర్లు 30నుంచి 34 శాతం పెరుగుతుందని జోస్యం చెప్పింది. ఈ లెక్కప్రకారం చూస్తే ఐసిఐసిఐ బ్యాంకు స్టాక్‌ రూ.460కి, యాక్సిస్‌ బ్యాంకు స్టాక్‌ రూ.800కు, ఎస్‌బిఐ బ్యాంకు షేరు రూ.425కు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు షేరు రూ.2550కి పెరగాల్సి ఉంది. ప్రైవేట్‌ రంగంలో ఉన్న మరో బ్యాంకు ఎస్‌బ్యాంకు విషయంలో మాత్రం మోర్గాన్‌ స్టాన్లీ నిరుత్సాహకరమైన జోస్యం చెప్పింది. మూలధనం తగినంత లేకపోవడమే దీనికి కారణంగా తేల్చిచెప్పింది. భవిష్యత్తులో మూలధనాన్ని మిగతా బ్యాంకులకు ప్రభుత్వం సమకూర్చుతే, ఆయా బ్యాంకులు కూడా వ్యాపారాలను అందుకోగలవని మోర్గాన్‌ స్టాన్లీ ఆ నివేదికలో పేర్కొంది.