భయపడక ధైర్యంగా పోరాడండి

                       భయపడక ధైర్యంగా పోరాడండి

Cute
Cute

మోసపోయి పెళ్లాడాను. ఇప్పుడు భార్యనో, సహజీవన భాగస్వామినో తెలియని స్థితిలో ఉన్నాను. హఠాత్తుగా సవతి సమస్య ఎదురవడంతో తికమక పడుతున్నాను. అర్థంకాని అయోమయస్థితి లో కొట్టుమిట్టాడుతున్నాను. నా వయస్సు 26 సంవత్సరాలు. పదవతరగతి వరకు చదువుకు న్నాను. మేం పేదవాళ్లం కావడంతో, భార్యతో విడిపోయిన వ్యక్తితో పెళ్లి చేశారు. నాభర్త ప్రభుత్వ ఉద్యోగి. అతని మొదటి భార్య బాగా చదువు కున్నామె. ఆమెకు పెళ్లికి ముందే మరో వ్యక్తితో సంబంధం ఉండటం వల్ల ఇద్దరి మధ్య గొడవలు మొదలై, ఇక కలిసి ఉండటం వీలుకాదని విడిపోయారు. పెద్దల సమక్షంలో స్టాంపు పేపర్‌పై విడాకుల పత్రం రాసుకున్నారు. ఆమె జీవన భృతికింద రెండు లక్షలు తీసుకుంది. తరువాత ఆమె పాతప్రియుడితో వెళ్లిపోయింది. వారు విడి పోయిన రెండేళ్లకు నన్ను పెళ్లి చేసుకున్నారు. తనకు రెండవ పెళ్లి కావడం వల్ల కట్నకానుకలేమి లేకుండా, పెళ్లి ఖర్చు కూడా తానే భరించాడు. పేదరికం కారణంగా తను దొరకడాన్ని అదృష్టంగా భావించారు అమ్మానాన్న. ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు. ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్ల వాని కోసం ఇప్పుడు మళ్లీ గర్భం దాల్చాను. సంతోషంగా ఉన్న మా జీవితాల్లోకి ఆయన మొదటి భార్య ఆరునెలల క్రితం వచ్చింది. తాము కోర్టు ద్వారా విడాకులు తీసుకోలేదు కనుక ఇప్పటికీ భార్యాభర్తలమేనంటూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అందరినీ పిలిచి మాట్లాడారు. మూడునాలుగుసార్లు కౌన్సిలింగ్‌ చేసి రాజీకుదిర్చారు. ఆయనను వారంలో మూడేసి రోజులు మా ఇద్దరి వద్ద ఉండేలా నిబంధన పెట్టారు. మిగిలిన రోజు ఆయన ఇష్టం వచ్చినచోట ఉండొచ్చని చెప్పారు. దీనికి అందరం సమ్మతించాం. ఇప్పుడు ఆమె కూడా ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ పక్క మండలంలో నివాసముంటుంది. మావారు అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నారు. ఆమెకు పాపు ఉంది. ఆ పాప తన ప్రియుడివల్ల కలిగింది. అయితే ఆమె మాత్రం మా వారి వల్లనే కలిగిందని బుకాయిస్తున్నది. రాజీ సమయంలో మావారి సర్వీసు రిజిస్టర్‌లో నాపేరు రాయాలని నిర్ణయించారు. అందుకు ఆరుమాసాల గడువు పెట్టారు. మొదట ఆమె కూడా సమ్మతించి, ఇప్పుడు తన పేరు రాయాలంటూ తిరకాసు పెట్టింది. కాదంటే పోలీసులను ఆశ్రయించింది. నా భర్తపై ఛీటింగ్‌ కేసుపెట్టి జైలుకు పంపుతానని బెదిరిస్తోంది. దాంతో నా భర్త భయపడి ఎస్‌ఆర్‌లో ఎవరిపేరు రాయనంటున్నారు. ఈ దశలో నాకు భవిష్యత్తు పట్ల భయం వేస్తుంది. తక్కువ చదువు, ఉద్యోగం లేని నన్ను మావారు వదిలేస్తే ఏం చేయాలనే సంశయంలో ఉన్నాను. ఇద్దరు పాపలు, పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు ఎలా అన్న ప్రశ్న నన్ను వేధిస్తుంది. పోలీసులు నాపట్ల జాలిచూపుతున్నారు తప్ప ఖచ్చితంగా వ్యవహరించలేకపోతున్నారు. అలాగే తెలిసినవారు, బంధువులు కూడా ఏదోవిధంగా సర్ధుకుపొమ్మని సలహా ఇస్తున్నారు. ఈ పరిస్థితులలో నన్ను నేను భార్యగా నిరూపించు కొని, సంసారాన్ని రక్షించుకునే మార్గం చూపండి.
– గాయత్రి, శ్రీకాకుళం.

అమ్మా, నూటికి నూరుశాతం మీరే భార్య. మీ సవతి చట్టాన్ని అడ్డుపెట్టుకొని మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నది. మీవారిపై కేసుపెట్టడానికి వీలుపడదు. కుటుంబ సమస్యలు, కలహాలపై ఛీటింగ్‌ కేసులు పెట్టడానికి లేదని చాలాసార్లు ఉన్నత న్యాయస్థానాలు తీర్పు చెప్పాయి. ఒకవేళ భర్త వేధించి, హింసిస్తుంటే గృహహింస చట్టం కింద కేసు పెట్టవచ్చు. అదికూడా ఇప్పుడు బాగా సరళీకరించారు. గతంలో లాగా గృహహింస కేసులో అరెస్టులు, రిమాండ్‌లు లేవు. కౌన్సిలింగ్‌ చేసి, రాజీ కుదరకపోతే భర్తకు నోటీసు ఇచ్చి కోర్టుకు పిలిపిస్తారు. మీ సవతి బెదిరింపులకు మీరు భయపడవలసిన పనిలేదు. ఇక ఆమె పెళ్లి విడాకుల విషయానికి వద్దాం. ఆమె భర్తతో ఉండలేక తన ఇష్టం మేరకే విడిపోయింది. పెద్దల సమక్షంలో స్టాంపు పేపరు మీద విడాకులు రాయించుకుంది. మరొక వ్యక్తితో కాపురం చేసింది. అతని ద్వారా ఒక పాపకు తల్లయ్యింది. ఇంత జరిగినా కోర్టు ద్వారా విడాకులు పొందలేదన్న ఒకే ఒక్క కారణంగా ఆమె నిజమైన భార్య అంటే సామాజిక న్యాయం, ధర్మం సమ్మతించదు. ఆమె కోర్టుకెళ్లినా గెలుస్తుందన్న నమ్మకం లేదు. సాధారణంగా భర్త అంటే ఇష్టం లేకపోయిన, శారీరక సంబంధాలు లేకపోయిన, వివాహేతర సంబంధాలున్న, భార్యాభర్తలు చాలా రోజులు విడివిడిగా ఉన్నా కోర్టులు విడాకులు మంజూరు చేస్తుంటాయి. మీ సవతిలో అన్ని అంశాలున్నాయి. ఆమె భర్తంటే ఇష్టంలేదని, డబ్బుతీసుకొని, ఒప్పందపత్రం రాసిచ్చి, వివాహేతర సంబంధం కొనసాగిస్తూ పాపకు జన్మనిచ్చింది. ఇవన్నీ సాక్ష్యాలుగా చూపితే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. కాబట్టి మీరు కేసులకు భయపడి జీవితాన్ని పాడు చేసుకోకండి. ఇప్పుడు ఎలాగు పోలీసులు కౌన్సిలింగ్‌ చేస్తున్నారు కనుక వారి ద్వారానే రాజీపడటానికి ప్రయత్నించండి. అలా వీలుకాకుంటే మీరే ఒక న్యాయవాది ద్వారా కోర్టును ఆశ్రయించండి. పోలీసులు కూడా నాకు తెలిసినంత వరకు క్రిమినల్‌ కేసుపెట్టడానికి లేదు. ఆమెను కూడా కోర్టుకు వెళ్లమని సలహా ఇచ్చి చేతులు దులుపుకుంటారు. ముందు మీ భర్తకు ధైర్యం చెప్పండి. అనుభవం ఉన్న లాయర్‌ను కలిసి చర్చించండి. అసలు మీ ఇద్దరితో చెరోమూడురోజులు కాపురం చేయమనడమే తప్పు. మీ వారి మొదటి భార్య ప్రవర్తనలో మానసిక లోపాలున్నట్లు భావించాల్సిఉంది. ఆమెలో నిలకడలేని తనం, అనైతిక ప్రవర్తన స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి పోలీసుల సాయంతో మానసిక చికిత్స చేయించడానికి ప్రయత్నించండి. ధైర్యంగా మీ పని మీరు చేసు కోండి. ఆమె కోర్టుకు వెళ్లినా సాక్ష్యాలు, ఆధారా లు చూపితే మీకే అనుకూలం అవుతుంది.
– డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి, సైకాలజిస్టు