భద్రాచలంలో 100% ఓటింగ్‌

ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు
95.32 పోలింగ్‌ నమోదు: కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌
ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ఎంఎల్‌సి ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ ఆదివారం తెలిపారు.జిల్లాలోని 4 పోలింగ్‌ కేంద్రాలలో ఎన్నికలు నిర్వహించగా ఎక్కడా అవాంచనీయ సంఘటనలకు తావులేకుండా ఓటుహక్కును వినియోగించుకున్నారని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా 95.32 శాతం ఓటింగ్‌ నమోదుకాగా భద్రాచలంలో 100శాతం ఓటింగ్‌ జరిగినట్లు తెలిపారు.ఖమ్మం డివిజన్‌ పరిధిలో 326 మంది ఓటర్లకుగానూ 321 మంది,కొత్తగూడెం డివిజన్‌ పరిధిలో 226 కుగానూ 199మంది,పాల్వంచ డివిజన్‌ పరిధిలో 115 మందికి 113మంది ఓటు వేయగా భద్రాచలంలో 59మందిగానూ 59మంది ఓటుహక్కును వినియో గించుకొన్నారు. జిల్లా వ్యాప్తంగా 726 మందికి 692 మంది ఓటువేసారు. ఎన్నికల నిర్వహణకు సంబందించి పోలీస్‌శాఖ కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది.ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొంది. పోలింగ్‌ కేంద్రాల వద్దకు అనుమతి లేకుండా ఎవరినీ అనుమతించలేదు.అధికారికంగా ఇచ్చిన గుర్తింపు కార్డులు ఉన్నవారికే ప్రవేశం కల్పించారు.దీంతో జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అలజడిలేకుండా ప్రశాంతంగా ఎన్నికలు ముగిసాయి.

జిల్లాలో జరిగిన ఎంఎల్‌సి ఎన్నికల నిర్వహణ తీరును కలెక్టర్‌, జిల్లాఎన్నికల అధికారి లోకేష్‌ కుమార్‌ క్రమంతప్పకుండా పర్యవే క్షించారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని పోలింగ్‌ కేంద్రా లను ఆయన తనిఖీచేసి ఓటింగ్‌తీరుపై ఎప్పటికప్పుడు సమీక్షించి అందుకనుగుణంగా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల సిబ్బంది పనితీ రును పరిశీలిస్తూ తగు సూచనలు ఎన్నికలు సజావుగగా సాగేలా కృషిచేసారు.కాగా ఎన్నికల నిర్వహణను ప్రత్యేకాధికారులు నవీన్‌ మిట్టల్‌, శ్రీవాత్సవలు పరిశీలించారు. ఎన్నికల తీరు ఓటింగ్‌ సరళిపై సమీక్షించారు. పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.