భగవంతుని రెండు చేతులు

Shirdi Saibaba
Shirdi Saibaba

భగవంతుని రెండు చేతులు

షిరిడీలో ఒక వేసవికి భాగ్‌చంద్‌ సేర్‌ గడ్డివాము తగలబడింది. భాగ్‌చంద్‌ ద్వారకామాయికి వెళ్లి సాయిని దర్శించుకున్నాడు. తనకు కలిగిన నష్టం గురించి సాయికి చెప్పాడు. అంతటితో ఊరుకోలేదు. ఈ నష్టం నుండి తనను కాపాడమని సాయిని పదేపదే కోరసాగాడు. అంతలోనే నానాసాహెబ్‌ చందోర్కరు వచ్చాడు సాయిసన్నిధికి. సాయిబాబా నానాసాహెబ్‌ చందోర్కరుతో ‘చూచావా! ఈ ప్రజలెంత స్వార్ధపరులో. ఈ రోజు భాగ్‌చంద్‌ మార్వాడి గడ్డివాము తగలబడింది. ఎక్కువ నష్టం వచ్చిందంటూ నా వెంట పడ్డాడు.

లాభనష్టాలు, జననమరణాలు ఆ పరమేశ్వరాధీనములు. ఆ పరమేశ్వరుని ఈ గుడ్డి ప్రజలు ఎలా మరచిపోతారో ఏమో? లాభాలు కలిగినప్పుడు ఆనందిస్తారు కదా, మరి నష్టం వచ్చినపుడు ఏడ్వటమెందుకు? ఆ గడ్డివాము విత్తు నుండే ఉత్పత్తి అవ్ఞతున్నది. వీటికి అసలు యజమానులు, భూమి, సూర్యుడు, సజలమేఘములు కాగా వీళ్లు, ‘నాది, నాది అని విర్రవీగుతుంటారు. ప్రపంచంలో సృష్టించబడే వస్తువ్ఞలన్నింటికి ఉత్పత్తిదారులు మనం కాము. ప్రకృతి శక్తులే. అనవసరంగా దుఃఖించవద్దని ఇతనికి చెప్పు. అగ్నికి ఆహుతి అయినప్పటి నుండి, తాను బాధ పడుతూ, నన్ను బాధపెడుతున్నాడు.

ఒక చేతితో ఈశ్వరుడిస్తాడు. రెండవ చేతితో తీసుకెళతాడు. జీవ్ఞలకు సుఖదుఃఖాలు అజ్ఞానజనితాలు అన్నారు. మార్వాడే వైపు తిరిగి ‘ఓ సేట్‌! ఇక ఇంటికి వెళ్లి నిశ్చింతగా నిద్రపో. ఇంకో వ్యాపారంలో ఈ నష్టం పూడుతుందిలే అన్నారు. మార్వాడీ ఇక నిశ్చింతగా నిష్క్రమించాడు. సాయి తెలిపిన ఈ బోధ పంటలకే పరిమితం కాదు. శిశువ్ఞ జన్మిస్తే సంబరాలు, మరణిస్తే విషాదం కూడదంటారు సాయి. ఆ బోధను ఆచరణలో పెట్టినవారు లేకపోలేదు. ఇది సాయి మహాసమాధి అనంతరం జరిగిన లీల. జంబూనాథన్‌ సాయిబాబా భక్తుడు. ఆయన భార్య కూడా సాయి భక్తురాలే. సాయి తత్వాన్ని అర్ధం చేసుకున్న వ్యక్తి జంబునాథన్‌. ఆయనకు ఒక కుమార్తె ఉన్నది.

ఆ కుమార్తె స్వప్నంలో ఒక ముసలి వ్యక్తి కనబడ్డాడు. ‘త్వరలో నీకు కుమారుడు జన్మిస్తాడు అని చెప్పాడు ముసలి వ్యక్తి. ఆ ముసలి వ్యక్తి ఎవరో కాదు, సాయిబాబాయే అని వారందరూ గాఢంగా నమ్మారు. కుమారుడు జన్మించాడు. ఆ బిడ్డడికి ‘సాయిరామన్‌ అనే పేరు పెట్టారు. అనంతరం మరొక బిడ్డడు కలిగాడు. ఆ బిడ్డడికి ‘సాయిప్రసాద్‌ అనే పేరు పెట్టారు. సాయిరామన్‌కు సాయిబాబా అంటే ఇష్టం. ఒకసారి ఆమెకు స్వప్నంలో ముసలివాడు కన్పించి ‘నా సాయిరామన్‌ను నాకిస్తావా? అన్నాడు. ‘ఇవ్వను అన్నది ఆమె. మరునాడు జంబునాథన్‌కు ఈ విషయం చెప్పగా సాయి ఇచ్చిన కానుకను ఆయన అడిగినప్పుడు ఇవ్వననడం అపరాధం అని ఆమెకు చెప్పాడు.

మరల స్వప్నంలో ఆమెకు సాయి కన్పించి సాయిరామన్‌ తాను ఎప్పుడు తీసుకుపోయేది స్పష్టంగా చెప్పాడు. అప్పుడు కూడా సాయిరామన్‌ను సాయికి ఇవ్వటం ఇష్టం లేదు. సాయి చెప్పిన సమయం రానే వస్తోంది దగ్గరకు. ఆ సమయంలో ఆమె నిద్రపోతున్నది. సాయి తాను చెప్పిన సమయానికి సాయిరామన్‌ను తీసుకుపోయాడు. నిద్రిస్తున్న ఆమె హఠాత్తుగా లేచింది. బాలుడు నిర్జీవిగా ఉన్నాడు. సాయి తత్వం తెలిసిన జంబునాథన్‌ దుఃఖించలేదు. సాయి ఒక చేతితో ఇస్తాడు, వేరొక చేతితో తీసుకుంటాడు.

– యం.పి.సాయినాధ్‌