భక్తిమార్గంతో సమాజ శ్రేయసు: వెంకయ్యనాయుడు

venkaiah naidu
venkaiah naidu

హైదరాబాద్‌:సమాజంలో పోటీతత్వం పెరగడం హర్షణీయమే అయినా…ఈవేగంలో విలువలు, సంప్రదాయాలను వదిలి పెట్టి యాంత్రికమయమౌతున్న జీవితానికి భక్తి మార్గంతోనే సాంత్వన లభిస్తుందిని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. భౌతిక వాద దృక్పథం, వ్యక్తిగత స్వార్థం వల్ల సమాజంలో అశాంతి పెరుగుతున్న తరుణంలో భక్తి జీవితంలో ఒక భాగం కావడం చాలా అవసరమని ఆయన అన్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఇస్కాన్‌ సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లక్ష్మీనరసింహస్వామివారి కళ్యాణానికి పట్టుబట్టలు, తలంబ్రాలు సమర్పించి, స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. దేవాలయాలు ఆధ్యాత్మిక భక్తిభావనను పెంపొందిస్తాయని, మనసుకు శాంతిని, స్వస్థతను చేకూరుస్తాయని అందువల్ల ఓ మతానికి చెందినవి కావని, మానవత్వాన్ని పెంపొందించే ప్రతి ప్రదేశమూ ఆలయమే అని తెలియజేశారు. ఆలయంలో దేవుడు మాత్రమేకాదు, మన సంస్కృతి కేంద్రీకృతమై ఉంటుందని, చదువు చెప్పే విద్యాలయాలు, ఆరోగ్యాన్నిచ్చే వైద్యాలయాలు, అన్నం పెట్టే భోజనాలయాలు, ఇలా అన్నీ అణువణువులో భగవంతుణ్ని దర్శించి, మానవులుగా ఎదగమని చెప్పడానికి ప్రతీకలని అభిప్రాయపడ్డారు. మానవ జీవితంలో భక్తి…అనురక్తిని, సద్భావనను, సత్ప్రవర్తనను, సదాచారాన్ని, సదాశయాన్ని, సద్భుద్దిని ప్రసాదిస్తుందని, భక్తితోనే ముక్తి సాధ్యమని ఆయన అన్నారు. ప్రతి మనిషిలో భక్తి భావన పెంపొదడం వల్ల వ్యక్తిగతంగానే కాక..అతని కుటుంబం, సమాజం దేశం తద్వారా ఈ విశ్వం శాంతితో వర్ధిల్లుతుందని ఆకాంక్షించారు. సర్వేజనా: సుఖినోభవంతు అనే భావన భక్తితోనే పెంపొందుతుందని తెలియజేసారు. అందువల్ల ప్రతి ఒక్కరిలో భక్తి భావన అంకురించాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు.