భక్తితత్వమే మహిమాన్వితం!

భక్తితత్వమే మహిమాన్వితం!
సంతాపాలన్నీ సంకల్ప జనితాలు. ఆవేదనలన్నీ ఆలోచనా ఫలితాలు. విచారము లేకుండా విషాదము రాదు. భావనలోనే బాధలు పుట్టుకొస్తాయి. వర్షం కురిసింది అంటే ఆకాశంలో మేఘాలు న్నట్లే. గగనంలో నిలిచియున్న మేఘాలే వర్షాలే కురుస్తాయి. మనోగగనంలో చలించే సంకల్ప మేఘాలే బ్రతుకులలో బాధల వర్షాన్ని కురిపిస్తాయి. వేదనా వడగళ్లను రాల్చుతాయి.

బాధపడటం ఎవ్వరికీ ఇష్టం లేదు. అలాగని బాధల నుండి విడిపడటం ఎవరికీ సాధ్యం కావటం లేదు. అంటే, బాధలు బ్రతుకుల్లో అంతగా పెనవేసుకుని ఉన్నాయని అర్థం. విడదీయలేని రీతిలో అతుక్కుపోయాయి. బాధలు ఇష్టం లేకపోయినా, బాధపడటం కష్టంగానేయున్నా, బాధలుపడుతూ బ్రతకడం మనిషికి అనివార్యంగా ఉంది. అలవాటుగా మారింది. ఎందుకో తెలుసా! బాధలు నాకు వద్దు అంటున్నది ఎవరో ఒక్క క్షణం ఆలోచించండి. బాధలను వరించినవారే. ఇక్కడే ఉంది చిక్కుముడి.  నేను ఇంతకాలం జీవించాను అనేవారే గాని అలా జీవించడంలో ఎంత బాధను ప్రోది చేసుకున్నాను అని ప్రశ్నించుకొనేవారు అరుదుగా ఉంటారు. ఒకనాటి బాధలు నేడు లేకపోవచ్చు. బాధానుభూతులు మనస్సుల నుండి దూరం కాలేదనే వాస్తవం తెలిసినవారెందరు? బ్రతుకులో బాధలున్నాయి. బుద్ధిలో బాధల జ్ఞాపకాలూ ఉన్నాయి. అవే బాధాస్మృతులు. మతులను చెడగొట్టేవి మనుగడను కాలరాచేవి ఈ స్మృతులే. ఎవరి మనస్సులైనా చేదు జ్ఞాపకాలతోనే చిందులేస్తూ ఉంటాయి. స్మృతులను ఆపడం మనిషికి ఎలా సాధ్యం కాదో, వాటి మధ్య హాయిగా జీవించడం కూడా అలాగే సాధ్యం కాదు. ఇక్కడే బ్రతుకు మోయలేని బండగా మిగిలిపోతోంది.

మనసేమీ బాగలేదు. అలా సినిమాకెళ్దాం. ఇలా మిత్రుల మధ్య గడుపుదాం అని పలుకుతూ ఉంటారు. అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు కూడా. నిజమే. బావ్ఞంది. ఫలితమేమిటి? అలా చెయ్యడం వల్ల బాగలేని మనస్సు బాగుపడుతుందా? కానే కాదు. బాగుపడలేని మనస్సు, బాధపడే మనస్సు తాత్కాలికంగా బాధను మరచిపోతుంది. అంతే.  సినిమాలో ఉండేది రెండుమూడు గంటలే. బంధుమిత్రాదుల మధ్య ఎంతకాలం ఉండగలం? వాళ్లను, లేదా ఆ పరిస్థితుల్ని విడిచిపెట్టి రాగానే మళ్లీ జ్ఞాపకాలు ప్రారంభమవుతాయి. స్మృతులు కదుల్తాయి. మతులు కలవరపెడతాయి. మరొక విషయాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. వినోదాల మధ్య ఉన్నంత మాత్రాన జ్ఞాపకాలు రావని చెప్పలేము. సరదాగా స్నేహితుల సరసన నవ్వుతూ కాలం వెళ్లబుచ్చుతున్నా, బాధల జ్ఞాపకాలు రావచ్చు. అలాంటి సమయాల్లోనే ప్రక్కవారు ”ఏమిటి? ఉన్నట్లుండి అదోలా మారిపో యారు అని మన ఆంతర్యంలోని మూగబాధను ముఖాలలో చూసి మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందా? మన గతాలు స్వగతాలుగా మారి, అనుక్షణం బుద్ధిలో స్వాగత తోరణాలను అలం కరిస్తూ ఉన్నంతకాలం బాధల నుండి విడిపడటం మనిషికి సాధ్యం కాదు. మనం మనకు జ్ఞాపకం వస్తున్నంత కాలం మనస్సు మదనపడుతూనే ఉంటుంది. మనుగడ మలినపడుతూనే ఉంటుంది.  గతాన్ని పూర్ణంగా తుడచివేయాలి. బాధానుభవాలను గూర్చి మనస్సు ఆలోచించకుండా చూసు కోవాలి. అదెలా సాధ్యం? స్మృతుల మధ్య సతమతమయ్యే మనస్సు, బాధానుభవాలలో తలదూర్చి విలపించే బుద్ధి వాటి నుండి విడిపడాలి. అలా జరగాలి అంటే, మనస్సు మరోకోణంలో ఆలో చించడం ప్రారంభించాలి. బుద్ధి మరోవిధంగా చరించగలగాలి.  అయితే, ఒక్క సత్యాన్ని ఇక్కడ విస్మరించకూడదు. మనస్సు దేనిని గురించి ఆలోచించినా, బుద్ధి మరొక చోట సంచరించినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆలోచనలన్నీ ప్రపంచానికి సంబంధించే ఉంటాయి. మన స్మృతులు అందుకు భిన్నంగా లేవు. సంబంధాలతో ముడిపడియున్న ఈ ప్రపంచంలో ఒక అనుభవం మరొక అనుభవంతో కరచాలనం చెయ్యకపోదు.  చీకటిని చీకటితో పోగొట్టలేము. (నహి తమ స్తమసో నివర్తకమ్‌) మరి బాధల వలయం నుండి ఎలా విడి వడాలి? దానికి మార్గమేమిటి? మార్గం ఉంది. అదే భక్తి. భక్తి ఏం చేస్తుంది? భక్తి వల్ల బ్రతుకులో ఏం జరుగుతుంది? భక్తి మనస్సును సం స్కరిస్తుంది. మనస్సులోని స్మృతులను శాశ్వతంగా మరుగున పడేస్తుంది. మహిమను ఆవిష్కరిస్తుంది.  పరమేశ్వరునితో మనకుండే సంబంధాన్ని భక్తి గుర్తుచేస్తుంది. భగవంతుని స్మరణతో బుద్ధిని నింపేస్తుంది. జ్ఞాపకాలతో గొడవపడే మనస్సును గోవిందునితో ముడిపడి జీవించేలా చేస్తుంది. గతం పంచే అనుభవ స్మృతుల మధ్య శోకసాగరంలో మునిగి పోతూ భగవంతుని విస్మరించాం. సదా పరమేశ్వరుని చింతించడంలో గతానుభూతుల్ని శాశ్వతంగా పాతిపెట్టి ఆనందంగా, తృప్తిగా జీవించగలు గుతాము. ఇదంతా భక్తి వలన కలిగే దివ్యమైన శక్తి.  బాధలను శాశ్వ తంగా మరుగుపరచి, మహిమతో మనస్సును ఊరేగించే స్థితి.  భక్తి ఎలా చెయ్యాలి? భక్తితో బుద్ధిని భవ్యంగా ఎలా మార్చుకోవాలి? బుద్ధిలో సదా భగవంతుడే శోభించేలాగా ఆచారాన్ని, విచారాన్ని కదలిస్తూ ఉండటమే భక్తి.

 – స్వామి  సుందర చైతన్యానంద