బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణీ ఈ నెల 20కి పూర్తి కావాలిః కేటిఆర్‌

KTR
KTR

హైదరాబాద్‌: తెలంగాణలోని పేద మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ 20 కల్లా పూర్తి కావాలని ఆదేశించారు. సోమవారం బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ చీరల పంపిణీ, ఇతర అంశాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆ శాఖ క‌మిష‌న‌ర్‌ శైలజారామయ్యర్‌ తదితర అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ‘కేవలం రెండు నెలల వ్యవధిలో కోటి ఆరు లక్షల మంది ఆడపడుచులకు చీరలను అందిస్తున్నాం. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌, రాజీవ్‌ విద్యామిషన్‌ వస్త్రాల సేకరణను వ్యవస్థీకృతం చేయాలి. బతుకమ్మ, రంజాన్‌, క్రిస్మస్‌ వంటి పర్వదినాలు, రాజీవ్‌ విద్యామిషన్‌ వంటి ప్రభుత్వ పథకాలకు అవసరమైన వస్త్రాలను పూర్తిగా రాష్ట్రంలోనే సేకరిస్తామని, నేతన్నల పూర్తి ఉత్పాదక సామర్థ్యాన్ని వినియోగించేందుకు వార్షిక ప్రణాళికను త్వరలో ఉత్తర్వులు రూపంలో విడుదల చేస్తామని తెలంగాణ చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నేతలన్నలకు ప్రతీయేటా ఎనిమిదేసి నెలలు ప్రభుత్వం సేకరించే వస్త్రాల ద్వారానే ఉపాధి కలుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వమిస్తున్న ఆర్డర్లతో నెలకు రూ.15 వేల చొప్పున వేతనం మూడు నెలల పాటు లభిస్తుంది. ఇందుకోసం ముందస్తు ప్రణాళికను సిద్ధం చేయాలి. నేతన్నకు చేయూత కార్యక్రమాలపై అన్ని జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే చేనేత మగ్గాలు, కార్మికుల సమాచారం ఉంది. మరమగ్గాల కార్మికులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించాలి.