బ్రెగ్జిట్‌ ఓటింగ్‌లో థెరిస్సాకు చుక్కెదురు

 

 

Theressa May
Theressa May

లండన్‌ : బ్రిటీష్‌ పార్లమెంట్‌లో నిన్న జరిగిన కీలకమైన బ్రెగ్జిట్‌ ఓటింగ్‌లో ప్రధాని థెరిస్సా మే ఓటమి పాలయ్యారు. ఆమె సొంత పార్టీ ఎంపీలే తిరగబడి, బ్రెగ్జిట్‌ క్రమంపై తుది నిర్ణయం పార్లమెంట్‌దే వుండాలని డిమాండ్‌ చేశారు. థెరిస్సా మే కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన సభ్యులు ప్రతిపక్ష సభ్యులతో చేతులు కలిపి ఇయు (ఉపసంహరణ) బిల్లుపై ప్రభుత్వ మొదటి ఓటమికి కారకులయ్యారు. కాగా ప్రభుత్వానికి ఎదురు తిరిగిన రెబెల్స్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు మంత్రులు చాలా ప్రయత్నాలు చేశారు. ఇయు నుండి బ్రిటన్‌ విడిపోవడానికి సంబంధించి ఒపందం విషయంలో పార్లమెంట్‌ ఓటు వుంటుందంటూ హామీ ఇవ్వజూపారు. అయితే రెబెల్స్‌ నేత, మాజీ అటార్నీ జనరల్‌ డొమినిక్‌ గ్రీవ్‌ మాట్లాడుతూ, ఇప్పటికే చాలా ఆలస్యమైందని హెచ్చరించారు. 2019 మార్చిలో ఇయు నుండి బ్రిటన్‌ వైదొలగడానికి ముందుగా ఒప్పందంపై ఓటింగ్‌ జరగాలని డిమాండ్‌ చేస్తూ తీసుకువచ్చిన సవరణ 309 ఓట్లతో ఆమోదం పొందింది. కాగా ఈ పరిణామం తమను నిరాశ పరిచిందని బ్రెగ్జిట్‌ వ్యవహారాలు చూసే మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానించింది. ఈ బిల్లుకు మరిన్నిమార్పులు చేర్పులు అవసరమా లేదా అనేది నిర్ణయించాల్సి వుందని పేర్కొంది. బ్రస్సెల్స్‌లో కీలక సదస్సు జరుగుతున్న నేపథ్యంలో థెరిస్సా మేకు ఇది పెద్ద ఎదురుదెబ్బ. నెలల తరబడి చర్చలు జరిపిన తర్వాత గత వారంలో కుదిరిన తాత్కాలిక బ్రెగ్జిట్‌ ఒప్పందంలోని నియమ నిబంధనలను ఇయు నేతలు ఆమోదిస్తారని భావిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం సంభవించింది.