బ్యాలెట్‌పత్రాల వినియోగించే ప్రశ్నేలేదు

sunil arora
sunil arora

మన ఇవిఎంలు,వివిపాట్‌లు భద్రతలో టాప్‌
సిఇసి సునీల్‌ అరోరా
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలనుంచే బ్యాలెట్‌పత్రాలతో ఎన్నికలు నిర్వహించే వీలులేనేలేదని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా స్పష్టంచేసారు. ఎలక్ట్రానిక్‌ఓటింగ్‌ యంత్రాలపై వెల్లువెత్తుతున్న నిరసనలు, సందేహాలనేపథ్యంలో బ్యాలట్‌పత్రాలనే ఎన్నికలకు వినియోగించాలన్న డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో బ్యాలట్‌ పత్రాల వినియోగించే సమస్యేలేదని సిఇసి అరోరా స్పష్టంచేసారు. ఎన్ని ఆరోపణలు వెల్లువెత్తినా ఎన్నికల సంఘం మాత్రం ఎలాంటి వెనుకంజవేయబోదని ఆయన స్పష్టంచేసారు. ఇవిఎంలను సమస్యగా లేవనెత్తి కొన్ని వర్గాలు ఫుట్‌బాల్‌ ఆడుతున్నాయని ఆయన విమర్శించారు. ఈ వర్గాలుకావాలనే బురదజల్లుతున్నాయని ఆరోపించారు. అందువల్లనే ఇవిఎంల స్థానంలో బ్యాలట్‌ పత్రాలను వినియోగించే సమస్యేలేదని మరోసారి స్పష్టంచేస్తున్నామని సిఇసి పేర్కొన్నారు. భవిష్యత్తులోకూడా బ్యాలట్‌పత్రాలవైపు వచ్చే ప్రశ్నేలేదని పేర్కొన్నారు. బ్యాలెట్‌పత్రాల కౌంటింగ్‌లో చాలా సమస్యలు తలెత్తాయిని ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌లోకూడా మెషిన్లు సాంకేతికలోపాలు ఎదురయినా వాటిస్థానంలో మరికొన్నింటిని ఏర్పాటుచేసి పోలింగ్‌ను పూర్తిచేసిన సందర్భాలున్నాయన్నారు. కొత్తఢిల్లీలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఓటర్లకు అవగాహన కల్పించేందుకు సిఇసి ప్రత్యేక కార్యక్రమంలోప్రసంగించారు. మన ఎన్నికలు సమ్మిళిత స్వేఛ్ఛాయుత అన్నివర్గాల ప్రయోజనాలకు జరిగేవిధంగా చేయాలని సూచించారు. ఎలాంటి విమర్శలనైనా స్వాగతిస్తామనిఅలాగే కష్టనష్టాల సమాచారం కూడా కోరుతున్నట్లు వెల్లడించారు. రాజకీయ పార్టీలుసైతం తమతమ అభిప్రాయాలు పంపించవచ్చన్నారు. వాస్తవానికి వారే ఎన్నికలసంఘంతో ప్రత్యక్ష సంబంధం ఎక్కువ ఉంటుందని పేర్కొన్నారు. అదేసమయంలో తాము ఎలాంటి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగేదిలేదని, ఇవిఎంలు, వివిపాట్‌లతోనే ఎనినకలు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. తనకుతానుగానే సైబర్‌నిపుణుడిగా చెప్పుకున్న సయ్యద్‌షూజా ఇవిఎంల హ్యాకింగ్‌ద్వారానే 2014లో బిజెపి గెలిచిందని తీవ్రస్థాయి ఆరోపణలు చేసిన నేపథ్యంలోసిఇసి ఈ వ్యాఖ్యలను కొట్టివేసారు. అంతేకాకుండా సైబర్‌నిపుణుడిపై కేసునమోదుచేయాలని ఆదేశించారు. ఇవిఎంల వినియోగాన్నే సమర్ధించిన సిఇసి 2014 లోక్‌సభ ఎన్నికలఫలితాలను చూస్తే తర్వాత జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో భిన్నమైన ఫలితాలు వచ్చాయన్నది గుర్తుచేసుకోవాలన్నారు. ఆ తర్వాత హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌; కర్ణాటక, త్రిపుర, నాగాలాండ్‌;మిజోరమ్‌, ఇపుడు ఛత్తీస్‌ఘర్‌, ఎంపి, తెలంగాణ,రాజస్థాన్‌లలో ఎన్నికలు నిర్వహించామని, ఆయా రాష్ట్రాలపరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఫలితాలు వచ్చాయని అన్నారు. తన అభిప్రాయం ప్రకారంచూస్తే ఇపుడు ఇవిఎంల వినియోగంలో ఖచ్చితత్వం కనిపించలేదా అని ప్రశ్నించారు. అంతేఆకుండా ఈ యంత్రాలను భారీ బందోబస్తు మధ్య రెండుప్రభుత్వరంగ సంస్థలు తయారుచేసాయన్నారు. భారత్‌ ఎలక్ట్రానిక్స్‌,ఇసిఐఎల్‌ సంస్థలు రెండూ వీటిని ఉత్పత్తిచేసాయన్నారు. ఇవన్నీ కూడా రక్షణరంగసంస్థలకు ఎక్కువ ఉత్పత్తులు అందిస్తాయని గుర్తుచేసారు. ఇటీవలి అసెంబ్లీఎన్నికల్లో రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘర్‌, మధ్యప్రదేశ్‌,మిజోరమ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో కేవలం మొత్తం ఆరు సంఘటనలుమాత్రమే ఫిర్యాదులుగా వచ్చాయన్నారు. 1.76 లక్షల పోలింగ్‌కేంద్రాల్లో ఆరు సంఘటనలు చోటుచేసుకోవడంతోనే ఇంత రాద్ధాంతం జరగడాన్ని సమర్ధించబోమని ఆయన పేర్కొన్నారు. ఈ ఆరు చోట్ల వినియోగించినయంత్రాలను సైతం అంతకుముంద ఎన్నికల్లో వినియోగించారని గుర్తుచేసారు. ఇవిఎంలపరంగా కొన్ని లోపాలు ఉండవచ్చని, వాటినిసరిచేస్తామని, అపోహలకు తావులేకుండా మళ్లీ ఓటింగ్‌ నిర్వహించామన్నారు. అంతేకాకుండా మరమ్మతులు పాలయినందుకు సైతం 24గంటల్లోపై చర్యలు తీసుకున్నామన్నారు. ఎలాంటి వైఫల్యాలు ఎదురయినా వెంటనే సరిచేసినట్లు వెల్లడించారు. ఇక పేపర్‌ ట్రయల్‌ యంత్రాలకు సంబంధించి కొన్నిచోట్ల మాత్రమే పనిచేయని సంఘటనలు నమోదయ్యాయన్నారు. వివిపాట్‌లపరంగా ఇపుడిపుడే నేర్చుకుంటన్నామని, ఇపుడు పూర్తిస్థాయిలో అవగాహన వచ్చిందని అన్నారు.