బ్యాంకులు, పోస్టాఫీసులు పాతనోట్లు జమచేయాలి

Cash
Cash

బ్యాంకులు, పోస్టాఫీసులు పాతనోట్లు జమచేయాలి

న్యూఢిల్లీ, జూన్‌ 22: బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పాత నోట్లు రూ.5090, రూ.100 నోట్లను రిజర్వు బ్యాంకువద్ద వచ్చేనెల 20వ తేదీలోపు జమచేయాలని ఆదేశాలు జారీచేసింది. పెద్దనోట్ల రద్దు కాలంలో బ్యాంకులు, పోస్టాఫీసులకు భారీ ఎత్తున పెద్దనోట్లు అందాయి. వీటన్నింటిని రిజర్వుబ్యాంకు కరెన్సీ చెస్ట్‌ లకు బ్యాంకులు తరలిస్తూ వచ్చాయి. తాజాగా రెండో సారి రిజర్వుబ్యాంకు గడువును పెంచి బ్యాంకులు, పోస్టాఫీసులు తమ వద్ద ఉన్న పాతనోట్లను జూలై 20వ తేదీలోపు జమచేయాలని ఆదేశించింది. వీటితోపాటు సహకార బ్యాంకులు కూడా జమచేయాలని సూచించింది. ఈ నిబంధనలు అమలయిన 30రోజులలోపు ఈ సంస్థలు విధిగా పాతనోట్లను జమచేయాలని ఆర్థిక వ్యవహారాలశాఖ ఆదేశించింది. గతంలో డిసెంబరు 31వ తేదీ వరకూ మాత్రమే ఈ పాతనోట్లను తీసుకున్న రిజర్వుబ్యాంకు తాజాగా మరోసారి గడువు ఇస్తున్నట్లు వెల్లడించింది. పెద్దనోట్ల రద్దుకాలం 50రోజుల్లోను లక్షలకోట్ల రూపాయలు రిజర్వుబ్యాంకు కరెన్సీ చెస్ట్‌కు బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి వచ్చిపడిన సంగతి తెలిసిందే. అలాగే 2.5 లక్షల రూపాయలకు దాటిన లావాదేవీల వివరాలన్నింటినీ ఆదాయపు పన్నుశాఖకు తెలియజేయాలని బ్యాంకులు, పోస్టాఫీసులను సైతం ఆదేశించింది. పోస్టాఫీసుల్లో పెద్దనోట్ల రద్దుకాలంలో 32,631కోట్ల రూపాయలను జమచేసింది.