బొప్పి కడుతున్నా నొప్పి తెలియనట్లుగా ప్రభుత్వం

TS Govt
TS Govt

కోర్టు కేసులపై వెల్లువెత్తుతున్న విమర్శలు
హైదరాబాద్‌: కోర్టులో కేసుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కొంత విచిత్రంగా ఉంది. ప్రభుత్వంపై సమ్మెటపోటులా ఒక్కో కోర్టు తీర్పు వెలువడుతున్నా, సహేతుకత కనిపించడం లేదు. తలకు బొప్పి కడుతున్నట్లుగా పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నా, పాలనా యంత్రాంగానికి నొప్పి తెలిసినట్లుగా లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ పరంగా ఆలోచనల తప్పిదం వల్ల ఇలా జరుగుతున్నదా? లేక సరైన అడ్వకేట్లను నియమించుకోలేని పరిస్థితి వల్ల కోర్టుల్లో సమస్యలు పెరుగుతున్నాయా అనేది చర్చనీయాంశమవుతున్నది. ప్రభుత్వ యంత్రాంగం వద్దనే అధిక సమాచారం ఉంటుంది. రాజ్యాంగానికి భాష్యం చెప్పేవారు అందుబాటులో ఉంటారు. లేనట్లయితే అధిక వ్యయం కూడా భరించే స్తోమత కూడా ప్రభుత్వంలో ఉన్నవారికే ఉంటుంది. కోర్టుల్లో న్యాయం అర్థించే వారు అది కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్లు పెట్టే వారు భాధితులుగానే ఉంటారు. అంటే స్వయంగా వారు అత్యధిక ఖర్చులను భరించడం కష్టమే. కానీ ప్రభుత్వ పెద్దల ఆరోపణల ప్రకారం రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ప్రేరిత కేసులుగానే వాటిని కొట్టిపారేస్తూ, ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి. కేసులో పసలేకుంటే ప్రతిపక్షం పిటిషన్‌లో కీలకపాత్ర వహించినప్పటికీ న్యాయస్థానాలు ప్రభుత్వ నిర్ణయాలను ఎందుకు తప్పుపడుతాయనేది మిలియన్‌ డాలర్ల సమస్య. ప్రభుత్వంలోనే నిర్ణయాత్మక పరిశీలనలు జరగకుండా ఉత్తర్వులు వెలువడం వల్లనే ఇలాంటి దుస్థితిని అధికారంలో ఉన్న వారు ఎదుర్కోవాల్సి వస్తున్నదనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తలబొప్పి కట్టిన మరిన్ని కేసుల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఎన్టీఆర్‌ మైదానంలో కళాభారతి ఏర్పాటుపై
ఎన్టీఆర్‌ మైదానంలో కళాభారతి ఏర్పాటు చేస్తే పిల్లలు ఆదుకునేందుకు ఎంత స్థలం మిగులుతుందో చెప్పాలని హైకోర్టు ప్రశ్న-క్రీడా మైదానాలే లేకపోతే గవాస్కర్‌, సచిన్‌లు ఉండేవారా? సర్కారు తలంపుపై కాదు. పిల్లల కోసమే మా తపనంతా వారు ఎక్కడ ఆడుకోవాలి? కళాభారతి నిర్మాణంపై ఉమ్మడి హైకోర్టు ప్రశ్న(15-07-2015)
తెలంగాణలో విద్యాచట్టం అమలుపై
తెలంగాణలో విద్యా చట్టాన్ని ఎందుకు అమలుచేయడం లేదు? చట్టమొచ్చి ఆరు ఏళ్లు కావస్తున్నా పట్టించుకోరా?(15-07-2015)
బీసీ జాబితా నుంచి కులాల తొలగింపు
మీరెలా తొలగిస్తారు? బీసీ రిజర్వేషన్‌పై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం ప్రశ్న(15-09-2015)
పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపై చర్యలపై
పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపై చర్యలేవి? అసలు తీసుకుంటారా? లేదా? తీసుకుంటే ఎప్పటిలోగా తీసుకుంటారు? స్పీకర్‌ను అడిగి ఏదో ఒక నిర్ణయం చెబుతాం. తెలంగాణ ఏజీకి స్పష్టం చేసిన హైకోర్టు(17-07-2015)
గ్రేటర్‌ హైదరాబాద్‌లో పన్నుల వసూలుపై
అత్యవసర సేవలు మీరెలా ఆపేస్తారు? జీహెచ్‌ఎంసి కమీషనర్‌ సోమేష్‌కుమార్‌ తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం-మోనార్క్‌లా వ్యవహరించద్దంటూ మందలింపు(27-03-2015)
భూ క్రమబద్దీకరణ జీవో అమలుపై
మీకు చేతకాకుంటే మేం చేయిస్తాం-భూ క్రమబద్దీకరణపై టీ సర్కార్‌కు హైకోర్టు మొట్టికాయ. కోర్టు ఆజ్ఞలనే అమలు చేయరా అంటూ ఆగ్రహం(30-03-2015)
గ్రేటర్‌ ఎన్నికల నిర్వహణ తేదీ ప్రకటనపై
గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలెప్పుడు? వారంలో తేదీ చెప్పండి రాజ్యాంగాన్ని విస్మరిస్తారా? రాఫ్ట్రపతి పాలన లేదుకదా? సర్కార్‌పై హైకోర్టు ప్రశ్న(03-02-2015)
ఏపీ ఇంటర్‌ బోర్డు ఖాతాల జప్తుపై
ఏపీ ఇంటర్‌ బోర్డు ఖాతాలను ఎలా స్థంభింపజేస్తారు? తెలంగాణ ఇంటర్‌ బోర్డు,ఎస్‌బిఐని తప్పుపట్టిన హైకోర్టు(13-08-2015)
గ్రేటర్‌ వార్డుల కుదింపుపై
గ్రేటర్‌ వార్డుల కుదింపు ఎందుకు? వార్డుల సంఖ్యను తొలుత 200గా ప్రతిపాదించి తిరిగి 150 ఎందుకు కుదించాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు(16-10-2015)
ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి కూల్చివేతపై
ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి భవనాన్ని హెరిటేజ్‌ భవనంగా తేల్చేదాక జోలికి వెళ్లవద్దు-ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రి భవనంపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు(18-04-2015)
ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతపై
బడులకెళ్లని గురువులెందుకు వారిని సాగనంపండి -ఖాళీల భర్తీలో నిర్లక్ష్యం చూపిన వారిని ఉపేక్షించవద్దు విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యం-ప్రమాణపత్రం దాఖలు చేయండి-తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు(18-08-2015)
526 మందికి విద్యార్థులకు ఒక్క టీచర్‌ ఉండటంపై
526 మంది విద్యార్థులకు ఒక్క టీచరా? ఇది సర్కారు సిగ్గుపడాల్సిన విషయం-అధికారులు తమ పిల్లలను ప్రభుత్వ బడికి పంపుతారా? తెలంగాణలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలున్నాయి? టీచర్లు ఎందుకు? ఖాళీలెన్ని? తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం(21-08-2015)
ఉపాద్యాయుల నియామకంపై
కొత్త రాష్ట్రమని ఎంతకాలం చెబుతారు? -ఉపాధ్యాయలు లేకుంటే స్కూళ్లు మూతపడవా? టీ సర్కార్‌ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం(29-10-2015)
సింగరేణిలో వారసత్వ భర్తీ రాజ్యాంగ విరుద్దం
సాకుగా మారిన అనారోగ్యం-పథకం వివక్షాపూరితం-భర్తీ ప్రకటనను,పథకాన్ని రద్దు చేసిన హైకోర్టు(17-03-2017)
గ్రూప్‌-2 నియామక ప్రక్రియ నిలిపివేత
గ్రూప్‌-2 నియామక ప్రక్రియ 4 వారాల పాటు నిలిపివేస్తూ ఉమ్మడి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ(05-07-2017)
గురుకులాల్లో అన్ని పోస్టులు మహిళలతో భర్తీపై
అన్ని పోస్టులు-మహిళలకేనా రాజ్యాంగ విరుద్దం-గురుకుల జీవోపై హైకోర్టు స్టే 20-07-2017
సంపత్‌కుమార్‌,కోమటిరెడ్డిలపై అనర్హత వేటుపై
సంపత్‌కుమార్‌,కోమటిరెడ్డి ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. హైకోర్టు సంచలన తీర్పు – బహిష్కరణ ప్రొసీడింగ్స్‌ రద్దు – అసెంబ్లీ స్థానాల ఖాళీ ప్రకటన నోటిఫికేషన్‌ కూడా. వారి శాసన సభ్యత్వాల పునరుద్దరణ-బహిష్కరణ సహజ న్యాయ సూత్రాలకు విరుద్దం. నోటీసులు ఇవ్వలేదు. వివరణ తీసుకోలేదు. పిటీషనర్ల ప్రాథమిక హక్కులను హరించారు. ఒక్క కలం పోటుతో వారిని అనర్హులుగా చేశారు. వీడియే పుటేజీ ఇస్తామన్న హామీ నిలబెట్టుకోలేదు(17-04-2018)
పంచాయతీ ఎన్నికలు-బీసీ రిజర్వేషన్ల అంశంపై
బీసీ జనాభా ఓటర్లను లెక్కించాకే నిర్ణయం తీసుకోండి. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం, ఎబీసీడీఈ వర్గీకరణపై తర్వాత తేలుస్తామని స్పష్టీకరణ-ముందు బీసీ జనాభాను,ఓటర్లను లెక్కించాలని ప్రభుత్వానికి ఆదేశం. అనంతరం ఆ వివరాలను ప్రచురించి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని స్పష్టం చేసిన కోర్టు-ఇవన్నీ పూర్తి చేశాకే ఎన్నికల నిర్వహణ విషయంలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది(26-06-2018)
క్రీడా కోటా కింద వృత్తి విద్యా ప్రవేశాలపై
క్రీడా కోటా రిజర్వేషన్ల కింద వృత్తి విద్యలో ప్రవేశాలను ఈ ఏడాది అమలు చేయరాదని తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు ధర్మాసనం ఆదేశం. క్రీడా కోటా కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 7ను టి.శ్రియ మరో నలుగురు సవాల్‌ చేసిన కేసులో కోర్టు ఆదేశాలు జారీ-క్రీడా కోటాపై విమర్శలు రావడంతో ప్రభుత్వం ఏసీబి దర్యాప్తునకు ఆదేశాలు జారీ(06-07-2018)
పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతం మించొద్దనే దానిపై
పంచాయతీ ఎన్నికల్లో ఎస్పీ,ఎస్టీ,బీసీలకు కల్పించే రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టిబిఎన్‌ రాధా కృష్ణన్‌,జస్టిస్‌ రమేష్‌ రంగనాధన్‌తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ.(09-07-2018)
సాంస్కృతిక సారధి నియామకాలపై
దరఖాస్తు చేసుకోకుండానే ఉద్యోగమా నోటిఫికేషన్‌ ఇవ్వకుండా భర్తీయా ఇది సరికాదు, అర్హులకు అన్యాయం.-3 వారాల్లో తాజా నోటిఫికేషన్‌ ఇవ్వండి – 3 నెలల్లో భర్తీ పూర్తి చేయండి.హైకోర్టు ఆదేశం (10-07-2018)