బెంగాల్ పంచాయితీ ఎన్నిక‌ల్లో హింస‌

WEST BENGAL ELECTIONS
WEST BENGAL ELECTIONS

కోల్‌క‌త్తాః పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు హింసకు దారి తీశాయి. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఉదయం పోలింగ్ మొదలైన రెండు గంటల్లోనే నాలుగు జిల్లాల పరిధిలో హింసాత్మక చర్యల గురించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. దీంతో చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం పోలీసులను ఆదేశించింది. ఉత్తర 24 పరగణాలు, బుర్ద్వాన్, కూచ్ బెహర్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో హింస చోటు చేసుకుంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలతో కొంత మందికి గాయాలయ్యాయని ఎన్నికల సంఘం తెలియజేసిన ప్రాథమిక సమాచారం. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ మంత్రి జ్యోతిప్రియో ముల్లిక్ స్పందిస్తూ హింసాత్మక చర్యల్లో తమ పార్టీ పేరు ఉందన్న వాదనను తోసిపుచ్చారు. ఓటర్లను బీజేపీ భయపెడుతోందన్నారు. టీఎంసీయే ఓటర్లను భయపెడుతోందని ప్రతిపక్ష బీజేపీ, సీపీఎం ఆరోపించాయి.