బెంగళూరుపై పుణే ఘన విజయం

SMITH
SMITH

బెంగళూరుపై పుణే ఘన విజయం

పుణే: బెంగళూరుపై రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ శనివారం ఘన విజయం సాధించింది.ఐపిఎల్‌ పదవ సీజన్‌లో బెంగళూరు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.అసలు పోరాటాన్ని పూర్తిగా మరిచిపోయినట్లు కనబడుతున్నా ఆర్‌సిబి మరో ఘోర పరాజయం మూటగట్టుకుంది.రైజింగ్‌ పుణేతో జరిగిన తాజా మ్యాచ్‌లో కోహ్లీ సేన 61 పరుగుల తేడాతో పరాజయం చెందింది. పుణే నిర్ధేశించిన 158 పరుగుల సాధారణ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఆర్‌సిబి పూర్తిగా చేతులెత్తేసింది.

పది మంది సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారంటే బెంగళూరు పేలవ ప్రదర్శన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.ఇన్నింగ్స్‌ రెండవ ఓవర్‌లో మొదలైన పతనం ఏ దశలోనూ ఆగకపోవడంతో ఆర్‌సిబికి ఘోర పరాజయం తప్పలేదు.ఇది ఆర్‌సిబికి ఏడవ పరాజయం కావడంతో ఒక ఆ జట్టు నాకౌట్‌ ఆశలు సుమారుగా గల్లంతే.ఈ రోజు మ్యాచ్‌లో కోహ్లీ 48 బంతులు ఆడి 4 బౌండరీలు,1 సిక్సర్‌తో 55 పరుగులు చేయడం మినహా ఏ ఒక్కరూ క్రీజులో నిలబడే ప్రయత్నం చేయలేదు.ఆర్‌సిబి ఆటగాళ్ల దారుణ ఆట తీరుకు అవతలి ఎండ్‌లో కోహ్లీ చూస్తూ ఉండి పోవడం మినహా చేసేదేమి లేకపోయింది.కనీసం పోరాడటంలో విఫలం కావడంతో ఆర్‌సిబి 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసి పరాజయం చెందింది.

ఈ మ్యాచ్‌లో పుణే బౌలర్లు సమిష్టిగా సత్తా చాటి ఆర్‌సిబికి చుక్కలు చూపించారు.పుణే బౌలర్లల ఇమ్రాన్‌ తాహిర్‌ మూడు వికెట్లు సాధించగా,పెర్గ్యుసన్‌కు రెండు,ఉనద్కత్‌,వాష్టింగ్టన్‌ సుందర్‌కు ఒక్కొక్కరికి ఒక వికెట్‌ లభించింది.అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌ 3 వికెట్ల నష్టానికి 157పరుగులు చేసింది.కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ 32 బంతులు ఆడి 5 బౌండరీలు,1 సిక్సర్‌తో 45 పరుగులు చేయగా,రాహుల్‌ త్రిపాఠి 28 బంతులు ఆడి 4 బౌండరీలు,1 సిక్సర్‌తో 37 పరుగులు,మనోజ్‌ తివారి 35 బంతులు ఆడి 4 బౌండరీలు,1 సిక్సర్‌తో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.పుణేకు ఆదిలోనే అజింక్యా రహానే 6 పరుగుల వద్ద వికెట్‌ కోల్పోయింది.

ఆ సమయంలో త్రిపాఠికి జత కలిసిన స్టీవ్‌ స్మిత్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. క్రీజులోకి వచ్చీ రావడంతోనే స్మిత్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అయితే స్టువర్ట్‌ బిన్నీ వేసిన 14వ ఓవర్‌ చివరి బంతికి స్మిత్‌ ఔటయ్యాడు.దీంతో పుణే స్కోరులో వేగం తగ్గింది.ఆ తరువాత మనోజ్‌ తివారి,ధోనిలు మెల్లగా ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఆఖరి ఓవర్లలో పుణే సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులను సాధించడంలో విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో మాత్రమే చేసింది.ఆర్‌సిబి బౌలర్లు సమిష్టిగా సత్తా చాటి పుణేను భారీ స్కోరు చేయకుండా అడ్డుకోగలిగారు.