బిసి రిజర్వేషన్ల తగ్గింపు వద్దు

BREAKING NEWS
BREAKING NEWS

విద్యానగర్‌: పంచాయతీ ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను తగ్గించాలనే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. రిజర్వేషన్లను కుదించడమంటే రెండు కోట్ల మంది బిసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని వ్యాఖ్యానించారు. బిసి సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటి, బిసి సర్పంచ్‌ల సంఘం సంయుక్త సమావేశం గురువారం విద్యానగర్‌లోని బిసి భవన్‌లో జరిగింది. గ్రామపంచాయతీల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు రెండున్నర దశాబ్దాల నుంచి కొనసాగుతున్నాయని, అయితే వీటిని తగ్గించాలని 2010లో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. కాని ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్‌ వేయకపోవడం, రాజ్యాంగ సవరణ చేయకపోవడం వల్ల త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో బిసిల వాటాను కుదించే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రస్తుతమున్న 34 శాతం కోటాను 22 శాతానికి తగ్గించే ప్రతిపాధనలను పంచాయతీ రాజ్‌ శాఖ సిద్దం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని కృష్ణయ్య పేర్కొన్నారు. ఇదే జరిగితే బిసిలపట్ల వివక్ష చూపుతున్నారనే అపవాదు సిఎం కెసిఆర్‌కు వస్తుందన్నారు. బిసిల రాజకీయ మనుగడను దెబ్బతీయకుండా 34 శాతం కోటాను కొనసాగించాలన్నారు. ఇందు కోసం వెంటనే సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయాలని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ జరిగేలా చూడాలనని కృష్ణయ్య సూచించారు. నీల వెంకటేశ్‌, బర్క కృష్ణ, వేల్పుల బిక్షపతి, జయ శ్రీనివాస్‌, జి. రవి, అంజి, రాజ్‌కుమార్‌, నరసింహానాయక్‌, అనంతయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.