బిసి క్రీమీలేయర్ విధానం అమలుచేసే యోచనను విరమించుకోవాలి: జాజుల
హైదరాబాద్ : బిసి క్రిమి లేయర్ విధానాన్ని అమలు చేసే యోచనను విర మించుకోవాలని, లేనట్టయితే బిసిల ఆగ్రహావేశాల్లో కెసిఆర్ ప్రభుత్వం పతనం కాయమని బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం నవ సమాజ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో బిసి క్రిమిలేయర్‌ను రద్దు చేయాలని కోరుతూ హిమాయత్‌నగర్ బిసి సాధికారత సంస్థ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బిసిల పట్ల కెసిఆర్ తన వైఖరి మార్చు కోవాలని హెచ్చరించారు. బిసిల మధ్య చిచ్చుపెట్టా లని ప్రయత్నిస్తే భస్మం కాయమన్నారు. గతంలో నెదురుమల్లి జనార్థన్‌రెడ్డి క్రిమిలేయర్ తేనె తుట్టేను కదిపి సిఎం పీఠం కోల్పోయారని, కెసిఆర్‌కు అదే గతి పడుతుందన్నారు. ఒక వేళ క్రిమిలేయర్ అమ లు చేయాలని చూస్తే అది కెసిఆర్ ఇంటి నుంచే ప్రారంభం కావాలన్నారు. ఒకే కుటుంబం ఒకే పదవి, ఒకే ఇల్లు ఒకే ఉద్యోగం ఉండాలన్నారు. ఓపెన్ కేటగిరీల్లోనూ క్రిమిలేయర్ అమలు చేస్తే 50శాతం అగ్రకుల పేదలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎనిమిది వర్గాలకు లేని క్రిమిలేయర్ బిసిలకు మాత్రమే ఎందుకని ప్రశ్నించారు. క్రిమి లేయర్ అంటే బిసిలను విభజించి పాలించడమేనని అన్నారు. రిజర్వేషన్లు అంటే పేదరిక నిర్మూలన పథకం కాదన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి ఆఫీసుల్లో ఇంత వరకు ఒక్క ఐఎఎస్ ఆఫీసరు లేడన్నారు. అనంతరం వక్తలు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అనేక మంది బోగస్ బిసి సర్టిఫికేట్లతో లబ్ధిపొందుతున్నారని వారిపై చర్యలు తీసుకోకుండా సంపన్న శ్రేణి అమలు పరిచేందుకు ప్రణాళికలు రూపొందించడం దురదృష్టకరమన్నారు. జనాభా దామాషా ప్రకారం బిసిలకు అన్ని రంగాల్లో సమాన వాటా ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంస్థ అధ్యక్షుడు శ్రీరాం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, బిసి ఐక్యసంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షుడు విజిఆర్ నారగోని, మేకల నరేందర్‌గౌడ్, ఆమ్ ఆద్మీపార్టీనేత కాసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.