బిసిల కోసం జనగాం స్థానాన్ని వదులుకున్నాం

kodandaram
kodandaram

సోనియా సభకు హాజరవుతా
టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరాం
హైదరాబాద్‌: బీసిల కోసం తాము జనగామ స్థానాన్ని వదులుకున్నట్లు టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా తెలంగాణ జన సమితికి ఎనిమిది సీట్లు ఇస్తామన్నారు. కానీ ఆరు మాత్రమే ఇచ్చారన్నారు. మిర్యాలగూడ, వరంగల్‌ ఈస్ట్‌, మహబూబ్‌నగర్‌ కావాలని అడిగినట్లు తెలిపారు. తమ అభ్యర్థులు ఉన్నచోట కాంగ్రెస్‌ అభ్యర్థులను ఉపసంహరించుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. సరైన పద్దతిలో సీట్ల సర్దు బాటు జరగలేదని పేర్కొన్నారు. ముస్లీంలకు ఒక్క సీటు అయినా ఇవ్వాలనుకున్నాం, కానీ గందరగోళం మద్య ముస్లింలకు సీటు కేటాయించలేకపోయామని అన్నారు. తమకిచ్చే సీట్లకు అదనంగా ఒక్క సీటును పాతబస్తీలో అదనంగా కావాలని కోరామన్నారు. అందర్ని ఒప్పించే పరిస్థితి ఉంటేనే జనగామ సీటు ఇవ్వమన్నానని కోదండరాం తెలిపారు. మహాకూటమి నష్టం లేకపోతేనే జనగామా నుంచి పోటీ చేయలని అనుకున్నట్లు తెలిపారు. బీసీల కోసం ఆ స్థానాన్ని వదులుకున్నట్లు తెలిపారు. తాము కోరుకున్న మిర్యాలగూడలో బీసి నాయకుడు ఆర్‌.కృష్ణయ్యను పెట్టారని తెలిపారు. ఆర్‌.కృష్ణయ్యను పోటీలో పెడతారని తమకు తెలియదన్నారు. మహాకూటమీ కామన్‌ మినిమమ్‌ ప్రోగ్రాంను త్వరలోనే ప్రజల ముందుకు తీసుకుని వస్తామన్నారు. కూటమి వల్ల తెలంగాణ ప్రజలకు ప్రత్యామ్యాయ ఉందని అర్థమైందన్నారు. పెద్దన్న పాత్రను కాంగ్రెస్‌ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. మేడ్చేల్‌లో జరిగే సోనియాగాంధీ సభలో పాల్గొననున్నట్లు తెలిపారు. స్నేహపూర్వక పోటీని విరమించుకునే అంశంపై చర్చలు జరుగుతున్నాయని, దీనిపై ఇప్పుడు మాట్లాడలేనని పేర్కొన్న ఆయన తమకు కేటాయించిన స్థానాలపై అసంతృప్తి సహజంగానే ఉందన్నారు.