బిడ్డకి తల్లిపాలు అమృతం

Mother and baby
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. శిశువు పుట్టిన గంటలోపే తల్లి రొమ్ము అందించి పసుపుపచ్చ రంగులో ఉండే మొట్టమొదటిసారిగా వచ్చే ముర్రుపాలు (కొలస్ట్రం) తప్పనిసరిగా పట్టాలి. ఎందుకంటే అందులో శిశువుకు కావలసిన ఖనిజాలు, మాంసకృత్తులు, విటమిన్‌-సి సమృద్ధిగా ఉంటాయి. వ్యాధుల నుండి రక్షించే యాంటీబాడీలు ఉంటాయి. సున్నిత మైన బిడ్డపేగుల నుండి విసర్జకాలను తొలగించడానికి, అలర్జీలు రాకుండా నిరోధించడానికి ముర్రుపాలు తోడ్పడతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ముర్రుపాలలో శిశువ్ఞకు కావలసిన అన్ని పోషకవిలువలు బిడ్డ శరీరానికి అందుతాయి.  తల్లిపాలు బిడ్డకు మొదట వ్యాధినిరోధక టీకాగా పనిచేస్తుంది. ఇవి శిశువుకు ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధమైన అత్యుత్తమమైన  పౌష్టికాహారం. వీటిని తాగే పిల్లలు పెరగడమే కాకుండా ఎక్కువ కాలం జీవిస్తారు. ఈ పాలు బిడ్డకు సులువుగా జీర్ణమయి మలవిసర్జన సులభంగా జరుగుతుంది. అంతేకాదు తల్లిపాలు శిశువ్ఞలకు దృష్టిలోపం రాకుండా నివారించడానికి దోహదపడతాయి. ఇవి శిశువ్ఞనకు కావలసిన ఉష్ణోగ్రతలో ఉండడమే కాకుండా అన్ని పోషకపదార్థాలు పూర్తి మోతాదులో ఉంటాయి. బిడ్డ కోరుకున్న ప్రతిసారి పగలైనా, రాత్రయినా తల్లిపాలు పట్టాలి. బిడ్డ ఎంతసేపు పాలు తాగుతుంటే అంతసేపు తాగిస్తుండాలి. తల్లిపాలు తాగే పిల్లలు ఆకస్మిక మరణానికి గురయ్యే అవకాశం తక్కువని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. తల్లిపాల వలన పోషకాహార లోపాలు తగ్గి 13శాతం శిశుమరణాలు రేటు తగ్గాయని నిపుణులు పేర్కొన్నారు. శిశువులు అనారోగ్యంతో బాధపడుతున్నా తల్లిపాలు పట్టాలి.
మండు వేసవిలోనైనా శిశువ్ఞకు ఎలాంటి నీరు పెట్టనవసరం లేదు. ఎందుకంటే తల్లిపాలలో 90శాతం నీరు ఉంటుంది. తల్లిపాలు తాగే శిశువులకు తల్లిపాల నుండి తగినంత నీరు లభిస్తుంది. శస్త్రచికిత్స ద్వారా పుట్టిన పిల్లలకు కూడా వెంటనే తల్లిపాలు పరిశుభ్రమైన గిన్నెలో పిండి చెంచాతో లేదా ఉగ్గుగిన్నెతో పట్టించాలి. శిశువుకు తల్లిపాలు ఇచ్చేటప్పుడు సరైన రీతిలో కూర్చుని ఇవ్వాలి. ఉద్యోగినులైతే శిశువుకి కనీసం నాలుగు గంటల కొకసారి పాలివ్వాలి. బిడ్డల్ని వదలి కూలి పనికి వెళ్లే తల్లులు తమ పాలను ఒక పరిశుభ్రమైన గ్లాసులో పిండి సురక్షిత ప్రాంతంలో ఉంచి 8గంటలలోగా ఆ పాలను శిశువ్ఞలకు చెంచాతోగానీ లేదా ఉగ్గుగిన్నెతో కాని పట్టవచ్చును. తల్లి బిడ్డకు పాలివ్వడం వలన మొదటి 6నెలలలోపు అండం విడుదల కానందున గర్భం దాల్చే అవకాశం లేదు. తల్లికి సహజ కుటుంబనియం త్రణ పద్ధతిగా ఉపయోగపడుతుంది. ఈ పద్ధతినే లాక్టేషనల్‌ఎమోనోరియా లేదా లామ్‌ అని అంటారు. పిల్లలకు పాలిచ్చే తల్లులు వైద్యుల సలహా లేకుండా ఎలాంటి మందులు వాడకూడదు. ఒక తల్లి మరో తల్లి బిడ్డలకు అత్యవసరమైన సమయాలలో పాలు పట్టించ వచ్చును. దీర్ఘకాలవ్యాధులు ఉన్న తల్లులు వైద్యుల సలహా మేరకు శిశువులకు పాలివ్వాలి. హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌ ఉన్న తల్లులు పోతపాలు సుక్షితంగా ఇవ్వలేనప్పుడు కేవలం తమ పాలను 6నెలల వరకు శిశువు లకు ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం. ఎట్టిపరిస్థితిలోనూ కలగలుపు ఫీడింగ్‌ ఇవ్వకూడదు. ఏదో ఒకరకం పాలు మాత్రమే పట్టాలి. ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫార్సు ప్రకారం శిశువ్ఞల గరిష్ట పెరుగుదలను మానసికాభివృద్ధిని ఆరోగ్యాన్ని సాధించాలంటే వారికి మొదట 6నెలల పాటు కేవలం తల్లి పాలు మాత్రమే తాగించాలి. కేవలం తల్లిపాలను మాత్రమే తాగించడం శిశువు జీవితానికి శుభారంభం పలుకుతుంది. అవి వారిని చురుగ్గా చేసి మేథా ప్రతిభను పెంచుతుంది. ఆరు నెలల తర్వాత ఎదుగుతున్న శిశువు, పెరుగుతున్న అవసరాలు తీర్చడం కోసం శిశువులకు ఇష్టపూర్వకమైన ఇంట్లోనే లభ్యమయ్యే పౌష్టిక విలువలున్న ద్రవ, ఘన అనుబంధ ఆహారాన్ని ఇస్తూ రెండు సంవత్సరాల వరకు తల్లిపాల పోషణను కొనసాగించాలి. అనుబంధ ఆహారాన్ని తయారు చేయడంలోనూ, తినిపించడంలోనూ పరిశుభ్రతను పాటించాలి. జాతీయ వ్యాధినిరోధక టీకాల కార్యక్రమంలో భాగంగా పిల్లలకు అవసరమైన వ్యాధినిరోధక టీకాలు అన్నీ సకాలంలో వేయించాలి. చిన్న పిల్లలకు నిర్ణీత వ్యవధిలో టీకాలు ఇప్పించకపోతే ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చి మరణానికి దారితీసే ప్రమాదం ఉంది.
ఎముకలు గుళ్లబార కుండా దృఢంగా ఉండడానికి, ప్రసవ సమయంలో స్థిరత్వం కోల్పోయిన గర్భసంచి పూర్వస్థితికి వచ్చి అధిక రక్తస్రావం తగ్గడానికి, శివువును తల్లి పాలతోనే పెంచినట్లయితే హార్మోను ప్రభావంతో ఆరునెలల వరకు అండం విడుదల కానందువలన గర్భధారణ జరుగదు కాబట్టి తల్లికి ఇది తాత్కాలిక కుటుంబనియంత్రణగా పయోగపడుతుందని వైద్యులు అంటున్నారు. తల్లిపాల సంస్కృతి ఒక సామాజిక బాధ్యత,   ఒక జీవశాస్త్ర ప్రక్రియ కాబట్టి సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించి తల్లిపాల సంస్కృతిని పెంపొందించుకోవాలి.
– పాకెర్ల బాబు డేవిడ్‌