బిజెపి కలలు కల్లలుగానే మిగిలాయి

ముంబై: కాంగ్రెసేతర భారత్ ఏర్పాటు చేస్తామంటూ బిజెపి కన్న కలలు కల్లలుగానే మిగిలిపోయాయని శివసేన ఎద్దేవా చేసింది. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై శివసేన తన సామ్నా పత్రికలో కథనాన్ని ప్రచురించింది. బిజెపి ప్రాబల్యం తగ్గుతుండగా రాహుల్‌కు ఆదరణ పెరుగుతుంది అని ప్రశంసలు కురిపించింది. ప్రధానికి కీలకంగా ఈ మూడు రాష్ట్రాలు మద్దతుగా నిలిచాయి, ఐదేళ్ల క్రితం బిజెపికి ఈ రాష్ట్రాల్లో ఉన్న ఆదరణ ఇప్పుడు లేకపోవడం గమనార్హం. ఇంకో విషయమేమంటే ఈ రాష్ట్రాలే మోదిని ప్రధాని అభ్యర్ధిగా సూచించాయి. అలాంటిది ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూస్తే బిజెపి ముక్త్ భారత్ మొదలైనట్లుగా ఉంది. ఈ ఐదు రాష్ట్రాలు బిజెపి ఏతర భారత్‌ను కోరుకుంటున్నట్లు సంకేతాలిస్తున్నాయి. ప్రతిసారీ ప్రజలను మోసగించలేరు అని సేన వెల్లడించింది. ప్రధానంగా ఎన్నికల హామీలో పేర్కొన్నట్లు రామ మందిర నిర్మాణం చేపడతామని చెప్పిన బిజెపి అది నెరవేర్చడంలో విఫలమయ్యిందని సేన విమర్శలు గుప్పించింది.