బిజెపిలోకి పరుగుల రాణి పీటీ ఉష!

బిజెపికి అనుకూలంగా గళాన్ని వినిపిస్తున్న పీటీ ఉష

న్యూఢిల్లీ: ఇటివల బిజెపిలో మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన శ్రీధరన్ చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా పరుగుల రాణి పీటీ ఉష కూడా బిజెపిలో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. పీటీ ఉష ఇప్పటికే బిజెపికీ అనుకూలంగా తన గళాన్ని వినిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఆమె మద్దతు పలుకుతున్నారు. నిరసనలు చేపట్టిన రైతులకు మద్దతుగా అంతర్జాతీయ సెలబ్రిటీలు చేసిన వ్యాఖ్యలను కూడా ఆమె ఖండించారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ట్వీట్లు చేశారు. అయితే, తాను బిజెపిలో చేరుతున్నట్టు ఉష ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అంతేకాదు, ఈ వార్తలపై స్పందించేందుకు ఆమె సన్నిహిత వర్గాలు కూడా నిరాకరించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం… కేరళకు చెందిన పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులను బిజెపి ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది.

బిజెపికి కేర‌ళ నుంచి పార్ల‌మెంట్‌లో ప్రాతినిధ్యం ఉన్నా.. రాష్ట్ర ప్ర‌భుత్వం విష‌యానికి వ‌స్తే అది కాంగ్రెస్‌, లెఫ్ట్ పార్టీల మ‌ధ్యే చేతులు మారుతోంది. త‌న మిష‌న్ సౌత్‌లో భాగంగా ఈసారి కేర‌ళ‌లోనూ త‌న మార్క్ చూపించాల‌ని బిజెపి చూస్తోంది. శ్రీధ‌ర‌న్‌, పీటీ ఉష‌లాంటి ప్ర‌ముఖ‌ల‌తో ఓట్ల‌కు గాలం వేయ‌డానికి కాషాయ పార్టీ ఎత్తులు వేస్తోంది. ముఖ్యంగా వీళ్లు కేర‌ళ ప‌ట్ట‌ణ ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌గ‌ల‌ర‌ని ఆ పార్టీ బ‌లంగా విశ్వ‌సిస్తోంది. 


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/