బాసర లో పూజా టికెట్ ధరల పెంపు..

బాసర భక్తులకు షాక్ ఇచ్చింది ఆలయకమిటీ. బాసరలోని శ్రీ సరస్వతి అమ్మవారి ఆలయంలో పూజ టిక్కెట్లను పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన ధరలు ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్లు, బాసర ఆలయ ఈవో విజయ రామారావు కీలక ప్రకటన చేశారు. అమ్మవారి రుద్రాభిషేకానికి ఏకంగా 500 రూపాయలు పెంచారు.

అలాగే వంద రూపాయలు ఉన్న అక్షరాభ్యాసం ధరను 150 రూపాయలకు పెంచారు. ప్రత్యేక కుంకుమార్చనను 200 రూపాయలకు పెంచారు. సత్యనారాయణ స్వామి పూజ 400 రూపాయలకు అలాగే నిత్య చండీ హోమం పదిహేను వందల రూపాయలు నిర్ధారించారు. అన్నప్రాసన 150 రూపాయలు పెంచుతూ ఆలయ కమిటీ నిర్ణయం తీసుకుంది.

బాసర గుడి విషయానికి వస్తే..భారతదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది ఇదేనని చెపపుకోవచ్చు. బాసరలో జ్ఞాన సరస్వతీ అమ్మవారు మహాలక్ష్మి, మహాకాళి సమేతులై కొలువు తీరి ఉన్నారు. ఇక్కడి మందిరం చాళుక్యులకాలంలో నిర్మింపబడింది. ఈ మందిరం సాదా సీదాగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది.

బాసర సరస్వతీ ఆలయం దేశంలోని ప్రఖ్యాత సరస్వతీ ఆలయాలలో ఒకటి. ఇక్కడ సరస్వతీ ఆలయంలో బాలబాలికలకు అక్షరాభ్యాసం చేయడానికి ప్రజలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ ఉన్న త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ ప్రత్యేకత. అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుం ఉంటుంది. ప్రజలు బంధు మిత్రులతో వచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు. ఆలయ ప్రాంగణంలోని ప్రత్యేక మందిరంలో అక్షరాభ్యాసం జరిపిస్తారు. ఆలయ ప్రాంగణంలోని జ్ఞానప్రసూనాంబ చేతిలో ఉన్న అఖండ జ్యోతికి నూనె పంచడానికి భక్తులు ఆసక్తి ప్రదర్శిస్తారు.