బాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌న్నుమూత

neeraj vora
neeraj vora

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, రచయిత నీరజ్ ఓరా గురువారం ఉదయం సుదీర్ఘ అస్వస్థతతో కన్నుమూశారు. ఆయన వయస్సు 54 సంవత్సరాలు. తీవ్రమైన గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో 13 నెలలుగా ఆయన కోమాలోనే ఉన్నారు. ఇవాళ తెల్లవారుజామున 4 గంటల సమయంలో అంధేరిలోని క్రిటికేర్ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచినట్టు ఓరా కుటుంబసభ్యులు తెలిపారు. సాయంత్రం 3 గంటలకు శాంతాక్రుజ్ ఎలక్ట్రిక్ క్రెమిటోరియంలో ఆయన అంత్యక్రి యలు జరుపనున్నారు. నీరజ్ ఓరా కన్నుమూసిన విషయాన్ని ఆయన మిత్రుడు, నటుడు పరేష్ రావల్ ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. ‘ఫిర్ హేరా ఫెరి’ సహా పలు హిట్ చిత్రాలు అందించిన నీరజ్ ఓరా ఇక లేరంటూ ఆయన ట్వీట్‌లో తన సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. నీరజ్ ఓరా ‘కంపెనీ’, ‘పుకార్’, ‘రంగీలా’, ‘సత్య’, ‘బాద్‌షా’ వంటి పలు చిత్రాల్లో నటించారు. ‘హేరా ఫెరి’ చిత్రానికి రచన చేయగా, ‘ఫిర్ హేరా ఫెరి’, ‘చాచీ 420’ చిత్రాలకు దర్శకత్వం వహించారు.