బరితెగించిన భూబకాసురులు

LAND MAFIA
LAND MAFIA

బరితెగించిన భూబకాసురులు: దర్జాగా కబ్జా

కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమి హాంఫట్‌
2005 నుంచి 2008 వరకు కనిపించని రికార్డులు

కడప: ప్రభుత్వ భూమికనిపిస్తే భూ భకాసురులు తన్నుకుపోతు న్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి అన్యక్రాంతమవుతుంది. ప్రభుత్వం ఎంత కట్టుదిట్టం చేసిన ఫలితం శూన్యమని చెప్పవచ్చు. రాజంపేట మండలం ఎంజిపురం రెవెన్యూ గ్రామంలోనే సర్వే నెం.1171లో సుమారు 200ల ఎకరాల పైబడి ప్రభుత్వ భూమి ఉంది. ఈ సర్వే నెంబరులో 1984-85లో జెడ్‌హెచ్‌డి కార్పొరేషన్‌ ద్వారా ఎస్సీలకు కోళ్లఫారం నిర్మాణం కొరకు 30 మంది లబ్దిదారులకు సుమారు 10 ఎకరాలు స్థలాన్ని కేటాయించారు. ఒక్కొక్క లబ్దిదారునికి 30 సెంట్ల కేటాయించి షెడ్యూల్డ్‌లు నిర్మించారు. కోళ్లఫారం నిర్మాణంతో పాటు కోళ్ల కొనుగోలు, వాటి పెంపకం కొరకు 4 లక్షల 95 వేల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. రాజంపేట పట్టణానికి సుమారు 4 కిలో మీటర్లు ఉడడంతో అప్పట్లో అక్కడ ఎవరు నివాసం ఉండేవారు కాదు. మునకప్రాంతం నుంచి వచ్చిన ముంపువాసులకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నివాస గృహాల కోసం భూమిని కేటాయించింది.

ఒంటిమిట్ట మండలం మాధవరం గ్రామ పంచాయితిలోనే బోయనపల్లికు చెందిన ముంపు వాసులకు ఇక్కడ సుమారు 250 కుటుంబాలు పైబడి ముంపు వాసులకు నివాసాల కొరకు భూములు కేటాయించారు. ఇదే ప్రాంతంలో ఇంజనీరింగ్‌ కాలేజిలతో పాటు రెస్టారెంట్లు, అన్నమయ్య పార్కును ఏర్పాటు చేయడంతో ఇక్కడ స్థలాలకు భారీగా గిరాకీ పెరిగింది. గతంలో సెంటు స్థలం 1000 నుంచి 5 వేలు పలికిన ధర ఒక్కసారిగా లక్షల్లోకి పోయింది. దీంతో ఇక్కడ స్థలాలకు భారీ గిరాకీ ఏర్పడింది. ఇదే అదునుగా భావిం చిన భూకభ్జాదారులు బరి తెగించి కభ్జాలకు తెర లేపారు. తాళ్లపాక గ్రామ పంచాయితి, కారెంపల్లి గ్రామపంచాయితి పరిధిలోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. రెవెన్యూశాఖ వారు ముట్టచెప్పే ముడుపుల సొమ్ముకు ఆశపడి ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారికి అండగా నిలబడ్డారు. ఎవరు అడ్డుఅదుపు చేయకపోవడంతో భూదందా దారులు సుమారు 500ల నుంచి 600ల వరకు ఇంటి స్థలాలు ఆక్రమించుకొని ధర్జాగా అమ్ముకున్నారు. 2005 నుంచి 2008 వరకు గతంలో పనిచేసిన తహశీల్దార్ల సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ నకిలీ సిల్‌ తయారు చేసుకొని ఇంటి పట్టాలను సృష్టిస్తున్నారు. ఆ నకిలీపట్టాలతో ఇతరులకు లక్షల రూపాయలకు అమ్మేస్తున్నారు.

గతంలో రెవెన్యూలో పనిచేసిన రిటైర్డ్‌ విఆర్వో, ప్రస్తుతం ఇతర మండలంలో పనిచేస్తున్న మరో విఆర్వో ఈ నకిలీ ఇంటి అనుబంధం పట్టాలను తయారు చేసి కభ్జాదారులకు అందిస్తున్నట్లు సమాచారం. సర్వే నెం.1171లో ఎక్కడ ఖాళీ స్థలం కనిపించిన రాత్రికిరాత్రే బూల్డోజర్లు పెట్టి చదును చేసి బేస్‌మటాలు వేస్తున్నారు. తెల్లవారే సరికి ఖాళీ స్థలాల్లో బేస్‌మటాలు వెలుస్తున్నాయి. రెవెన్యూ శాఖకు ఫిర్యాదు చేసిన కభ్జాదారులు 2005 నుంచి 2008 రెవెన్యూశాఖ మాకు పట్టాలు ఇచ్చారని నకిలీ పట్టాలను చూపిస్తున్నారు. అప్పటి రికార్డులు రెవెన్యూశాఖలో కనిపించలేదని విమర్శలు గుప్పుమంటున్నాయి. రికార్డులలో కనిపించకపోవడంతో రెవెన్యూశాఖ ఏమి చేయలేక చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో కభ్జాదారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. చెరువులను కూడా ఆక్రమించుకొని ధర్జాగా ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తున్నారు. కొండా, గుట్ట అని తేడా లేకుండా రాత్రికిరాత్రే చదునుచేసుకొని ఇంటి నిర్మాణాలు సాగిస్తు న్నారు.

చక్రధరి నగర్‌, ఇందిరమ్మ కాలనీలతో పాటు సైనిక నగర్‌లో కూడా నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూమిని ఆక్రమించి అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ శాఖ ఏమిచేయలేదని విమర్శలు గుప్పుమంటు న్నాయి. సుమారు 10 నుంచి 20 మంది వరకు ప్రభుత్వ భూమిని కభ్జాలు చేస్తూ నకిలీ పట్టాలను సృష్టిస్తూ లక్షలాది రూపాయలు సంపాదించుకుంటు న్నారని అక్కడ ప్రజలు విమర్శిస్తున్నారు. వారిపై ఎన్ని మార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకున్న నాథుడే లేరన్నారు. సాక్షాత్తు ప్రభుత్వం దళితులకు కేటాయించిన కోళ్లఫారాల స్థలాలుకూడా ఆక్రమించుకొని నకిలీ పట్టాలు సృష్టించుకొని అమ్ముకుంటున్నారని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖ బోయనపల్లిలో జరుగుతున్న భూ ఆక్రమదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఎంతవరకు భూకభ్జాదారులపై చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.