బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రక్రియ వేగవంతం..!

BIRENDER
BIRENDER

రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుశాఖ అభ్యంతరాలను నివృత్తి చేస్తే..
కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేందర్‌సింగ్‌తో చర్చించిన దత్త్తాత్రేయ
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్ర ఉక్కుశాఖ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై వెంటనే సంతృప్తికర వివరణలు పంపిస్తే..ఈఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రక్రియను వేగవంతం చేస్తామని కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌ హామీ ఇచ్చారు. బుధవారం ఆయనతో కేంద్ర కార్మిక, పట్టణాభివృద్ది శాఖల మాజీమంత్రి, జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ ఆన్‌ ఎంఎస్‌ఎ బండారు దత్తాత్రేయ న్యూడిల్లోలో సమావేశమై బయ్యారం, కడపల్లో ఉక్కు ఫ్యాక్టరీల ఏర్పాటుపై చర్చించారు. తొలుత బీరేంద్రసింగ్‌కు వాలువాను కప్పి దత్తాత్రేయ సన్మానించారు. అనంతరం ఆయనతో సమావేశమై ఖమ్మం జిల్లా బయ్యారంలో ఏర్పాటు చేస్తామన్న సమగ్ర స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈసందర్బంగా బయ్యారం, కడపల్లో ఉక్కు ఫ్యాక్టరీల ఏర్పాటుపై తమ శాఖ తీసుకుంటున్న సత్వర చర్యలను దత్త్తాత్రేయకు వివరించారు. ప్రధానంగా ఉక్కు శాఖ తెలిపిన అభ్యంతరాలైన..భూమి విలువ ఎంత అవుతుంది? విద్యుత్‌ సరఫరాకు ఎంత దూరంలో ఉంది? నీటి సరఫరా ఎలా? రైల్వే రవాణకు అనుసంధానం ఏమిటీ? ఐదేళ్లు కరెంటు ఛార్జీలను చెల్లింపు విధానం ఏమిటి? అనే తదితర విషయాలపై వెంటనే సమగ్రమైన వివరణతో నివేదిక పంపితే..తాము కూడా ఫ్యాక్టరీ ఏర్పాటుపై సత్వర చర్యలు తీసుకుంటామని దత్త్తాత్రేయకు ఆయన తెలిపారు. అంతేకాకుండా బయట మౌలిక సౌకర్యాల కల్పన, ఆర్థిక పరమైన అంశాలపై రాష్ట్రప్రభుత్వం స్పష్టమైన వైఖరిని చెప్పటం లేదన్నారు. అయినప్పటీకీ కూడా బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు తమ శాఖ సిద్దంగా ఉందని..అయితే తెలంగాణ ప్రభుత్వ సరైన సహకారం లేకపోవడంతోనే ఈప్రక్రియ ఆలస్యమవుతోందని దత్తాత్రేయకు..కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్రసింగ్‌ వివరించారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. కేంద్రమంత్రులు బీరేంద్రసింగ్‌, పీయూష్‌గోయల్‌ను కలిశామన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ కోసం స్థలం, నీళ్లు రాష్ర ప్రభుత్వం కల్పించాలని, కేంద్రంపై నిందలేయకుండా రాష్ట్రప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. సికింద్రాబాద్‌ నుంచి బికనూర్‌కు రైలు నడపాలని పీయూష్‌ గోయల్‌ను అడిగామని ఆయన తెలిపారు. ఎంఎంటిఎస్‌ ఫేజ్‌-2 కోసం కేంద్రం రూ.880 కోట్లు విడుదల చేసిందని..ఈఫేస్‌కు తెలంగాణ సర్కార్‌ ఒక్క పైసా ఖర్చు పెట్ట్లలేదని దత్తాత్రేయ పేర్కొన్నారు.