బడీడులో పెళ్లిముడి!

wedding
wedding

బడీడులో పెళ్లిముడి!

స్త్రీవిద్య, స్త్రీ విమోచన, మూఢవిశ్వాసాల నిర్మూలన తదితర అభ్యుదయ ఆశయాలతో కన్యాశుల్యాన్ని కుల, మత, వర్ణవివక్షను తీవ్రంగా వ్యతిరేకించి రెండువందల ఏళ్లక్రితమే సంఘసంస్కరణల కోసం ఉద్యమాలు ఉవ్వెత్తున సాగాయి. సామాజిక చైతన్యాన్ని పురిగొల్పి స్త్రీసంస్కరణకు బాటలు వేశాయి. మహిళల బాల్యవివాహాలను అడ్డుకున్నాయి.

మహిళల విద్యకోసం పాటుపడ్డాయి. మహిళలకు స్వేచ్ఛ కల్పించే అవకాశాలు చూపించాయి. రాజారామ్‌మోహన్‌రా§్‌ు, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావ్ఞ వంటి సంఘసంస్కర్తలు ఈ ఉద్యమానికి ఊపిరి పోశారు. వీరు చూపించిన వెలుగుబాట స్త్రీ జీవితాల్లో వికాసం కల్పించింది. ఇంత చరిత్ర జరిగినా ఇంకా తెలుగురాష్ట్రాల్లో బాల్యవివాహాల ప్రహసనం కొనసాగుతుండడం సమాజానికి సిగ్గుచేటు. మైనార్టీ తీరకమునుపే ఆడపిల్లల మెళ్లో పసుపుతాడు వేయించి వారి బంగారు భవిష్యత్తును భగ్నం చేయిస్తున్న దారుణాలు ఇంకా సాగడం శోచనీయం.

మేనరికం వంకతో కొన్ని, పేదరికం కారణంగా కొన్ని, ఈ బాల్యవివాహాలు చాటుమాటుగా సాగుతున్నాయి. ఆడపిల్లల్ని చదివిస్తే అపర సరస్వతులే. ప్రోత్సహిస్తే ప్రతిభా జ్యోతులే. అయినా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రులు తమ గుండెలపై కుంపటిలా ఇంకా ఈ రోజుల్లో భావించడం సమంజసం కాదు. ఆడపిల్లలకు పెళ్లి చేయవద్దని ఎవరూ అనరు. ఏ వయసులో అది జరగాలి. అంతవరకు ఆమెను ఎలా పెంచుకోవాలో ఎలా చదివించుకోవాలో మగబిడ్డలతో సమానంగా బాధ్యత వహించడం తల్లిదంద్రుల కనీస ధర్మం. ఎంత చదివించినా ఎంత గారాబం చూపించినా ఆడపిల్ల ‘ఆడ పిల్లేకదా! అదే మగబిడ్డ అయితే తల్లిదండ్రులకు దిక్కు అవ్ఞతారన్న నమ్మకం తల్లిదండ్రుల్లో బాగా నాటుకుంది. అందుకే ఆడపిల్లను ఒకలా, మగబిడ్డను ఒకలా పెంచుతూ వివక్ష చూపిస్తున్నారు. ఈ వివక్షే ఆడపిల్లలకు శాపంగా వెంటాడుతోంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పరిశీలిస్తే ఆడపిల్లలను తల్లిదండ్రులు ఏవోకారణాలతో పెళ్లిళ్లు చేయించడానికి సిద్ధపడడం,

వాటిని బాలల పరిరక్షణ హక్కుల ఉద్యమకారులు, అధికారులు, స్వచ్ఛ´ంద సేవాసంస్థల వారు అడ్డుకుని వారికి భవిష్యత్తు చూపించడం జరిగింది. గత ఏడాది పెళ్లి కావలసిన ఇద్దరు మైనర్‌ బాలికలు ఈ ఏడాది ఇంటర్మిడియట్‌లో అత్యధిక శాతం మార్కులు సాధించి కాలేజీ టాపర్లుగా నిలవగలిగారంటే వారి ప్రతిభ ఎలా గుబాళించిందో చెప్పవచ్చు. గత ఏడాది హయత్‌నగర్‌కు చెందిన 16 ఏళ్ల మైనర్‌ బాలికలు ఇద్దరికి పెళ్లి చేయడానికి సన్నాహాలు జరిగాయి. కానీ బాలల హక్కుల పరిరక్షణ ఉద్యమకారులు, పాఠశాలల యాజమాన్యాలు అడ్డుకుని ఆ పెళ్లిళ్లు ఆపుచేయించారు. ఈ ఇద్దరు విద్యార్థులుగా తమ చదువ్ఞలు కొనసాగించి ఇంటర్‌లో కాలేజీ టాపర్లుగా నిలవడం ఆదర్శమవ్ఞతోంది. ఈ అమ్మాయిల్లో కె.సంధ్య 92శాతం మార్కులు తెచ్చుకుని కాలేజీ మొత్తం విూద టాపర్‌గా నిలిచింది. మరో బాలిక వి.సంధ్య 88శాతం మార్కులు తెచ్చుకోగలిగింది. వనస్థలిపురం ఎన్‌ఆర్‌ఐ జూనియర్‌ కాలేజీలో ఒకే తరగతిలో వీరు చదువ్ఞతుండడం విశేషం. అంతకుముందు కూడా వీరిద్దరూ హయత్‌నగర్‌ తుక్కియాంజిల్‌లోని సెయింట్‌ జోషప్‌ స్కూల్లో సహవిద్యార్థినులే. తల్లిదండ్రులు తమ ఇష్టం ప్రకారం గత ఏడాది వీరికి బలవంతంగా పసుపుతాళ్లు వేయించితే ఇంతవరకు వీరు చదివేవారు కారు. గతేడాది ఏప్రిల్‌ 3న వి.సంధ్యకు పెళ్లి నిశ్చయమయింది. అదేరోజున ఆమె ఎస్‌ఎస్‌సి సోషల్‌ సైన్స్‌ పరీక్ష రాసింది. ఆమెకు పెళ్లి ఇష్టం లేకున్నా తల్లిదండ్రుల బలవంతంతో తలవంచింది.

అయితే తోటివిద్యార్థులు, ఉపాధ్యాయులు ధైర్యం చేయడంతో బాలల హక్కుల ఉద్యమకారులు జోక్యం చేసుకుని పెళ్లి ఆపుచేయించారు. మైనర్‌ బాలికకు పెళ్లి చేస్తే నేరమవ్ఞతుందని పెళ్లికొడుకు వారిని హెచ్చరించారు. దాంతో వి.సంధ్యకు పెళ్లి నుంచి విమోచన కలిగింది. అదే సబ్జెక్టులో పేపర్‌-2 పరీక్షలు రాయడానికి ప్రేరేపించింది. అయితే రెండు వారాల తరువాత ఆమె తండ్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం సంధ్య జీవితంలో తీరని చీకటి అయింది.

ఇక కె.సంధ్య విషయాన్ని పరిశీలిస్తే గత ఏడాది ఏప్రిల్‌ 20న ఆమె పెళ్లి నిర్ణయమైంది. 35 ఏళ్ల వయస్సున్న మేనమామే పెళ్లికొడుకు. సంధ్య తండ్రి ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగి. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. సంధ్య మేనమామ సంధ్య తండ్రికి కొంత డబ్బు అప్పుగా ఇచ్చాడు. తిరిగి ఆ ఆప్తు తీర్చలేని పరిస్థితి ఏర్పడడంతో సంధ్యను తనకిచ్చి పెళ్లి చేయాల్సిందిగా ‘మేనమామ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. ఇక చేసేది లేక సంధ్యనిచ్చి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు ఒప్పుకోవలసి వచ్చింది. అయితే పరీక్షలకు ముందుగానే పెళ్లిసంబంధం కుదరడంతో పరీక్షలకు హాజరు కావడానికి సంధ్యకు ఎలాంటి ఆటంకం ఏర్పడలేదు. అయితే స్కూలు యాజమాన్యానికి, బాలల హక్కుల ఉద్యమకారులకు ఈ సంగతి తెలిసి ఏప్రిల్‌ 8న అటుఇటు పెళ్లివారిని హెచ్చరించారు. మైనర్‌ బాలికకు పెళ్లి చేయడం చట్టం ఒప్పుకోదని, మాట వినకుండా పెళ్లి చేస్తే కటకటాల పాలు కావలసి వస్తుందని గట్టిగా హెచ్చరించేసరికి ‘మేనమామ తప్పుకోక తప్పలేదు.

శంషాబాద్‌లోని చారీనగర్‌కు చెందిన 17ఏళ్ల కాలేజీ విదార్థినికి, ఆమె తల్లిదండ్రులు ఈనెల 27న బలవంతంగా పెళ్లిచేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, ఆ బాలిక శంషాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. దాంతో పెళ్లి ఆగిపోయింది. ఇటువంటి సంఘటనలు కొన్నే వెలుగులోకి వస్తున్నాయి. తమ ఆడపిల్లలు ఎక్కడ దారి తప్పిపోతారేమో అన్న అనుమానం తల్లిదండ్రుల ప్రమేయంతోనే 60శాతం బాల్యవివాహాలు జరుగుతున్నాయి. 13 నుంచి 17 ఏళ్లలోపు ఆడపిల్లలు ప్రేమ ఉచ్చులో పడుతున్నారు. వంచకుల మాయలకు లొంగిపోతున్నారు. కొంతమంది తమ పేదరికంతో బలహీనులై మెడలో పసుపుతాడు వేయించుకొంటున్నారు. మరికొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు ఒంటరైపోవడంతో వీరి భారాన్ని ఎలాగైనా తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ బాల్యవివాహాలకు దారితీస్తున్నాయి. సామాజిక హోదా ఈ సమయంలో అడ్డుకావడం లేదు. కులమతాలతో ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా అమ్మయిలు పెళ్లికి తయారవ్ఞతున్నారు. అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్‌ జిల్లాలో 2016 జనవరి నుంచి 2017 ఫిబ్రవరి వరకు జరిగిన బాల్యవివాహాల్లో 37 వివాహాలు స్త్రీశిశుసంక్షేమ విభాగం అడ్డుకోగలిగింది. రంగారెడ్డి జిల్లాలో 2016 జనవరి నుంచి అక్టోబర్‌లోగా 55 బాల్యవివాహాలను ఏప్రిల్‌లో అధికసంఖ్యలో అంటే 40 వరకు ఇలాంటి పెళ్లిళ్లు ఆపగలిగారు.

– పి.రేవతి