ఫ్లెక్సీపై తెలుగు తమ్ముళ్ల బాహాబాహి

TDP
TDP

కృష్ణా(పెనమలూరు): పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులో తెలుగు తమ్ముళ్లు ఘర్షణకు దిగారు. ఉగాది ఫ్లెక్సీ ఏర్పాటు కోసం టిడిపిలో రెండు వర్గాలు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్నాయి. వారంతా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ అనుచరులు కావటం గమనార్హం. ఉయ్యూరు ప్రధాన సెంటర్‌లో ప్రకాశ్‌ యాడ్స్‌ బోర్డ్‌ప కొద్దీ రోజుల క్రితం ఎమ్మెల్సీ వైవిబికి శుభాకాంక్షలు తెలుపుతూ రాజులపాటి ఫణికుమార్‌ నేతృత్వంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇదే బ్యానర్‌పై తెలుగు యువత మండల అధ్యక్షుడు దండమూడి చౌదరి ఉగాది శుభాకాంక్షలు ఫ్లెక్సీ ఏర్పాటుకు యత్నించారు. ఈ సమాచారం తెలుసుకున్న ఫణియూత్‌ అక్కడకు చేరుకొని చౌదరి ఫ్లెక్సీని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాలు బాహాబాహికి దిగాయి. చొక్కాలు పట్టుకొని సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. ఇరువర్గాల వారు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లడంతో గమనించిన ఆ నేతలు ఎవరికి వారే అక్కడినుండి జారుకున్నారు.