ఫ్రెంచ్ ఓపెన్ సిరీస్ రెండో రౌండ్‌లోకి శ్రీకాంత్‌, సింధు

sindhu, srikanth
sindhu, srikanth

పారిస్ః పారిస్‌లో జ‌రుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింట‌న్ సూప‌ర్‌ సిరీస్‌లో భార‌త ష‌ట్ల‌ర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్‌లు రెండో రౌండ్‌కి చేరుకున్నారు. మొదటి రౌండ్‌లో వీరిద్ద‌రూ ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచి వారి ప్ర‌త్య‌ర్థుల‌ను ఓడించారు. శ్రీకాంత్, జ‌ర్మ‌నీ క్రీడాకారుడు ఫాబియ‌న్ రోత్‌తో త‌ల‌ప‌డ్డాడు. ఓపెనింగ్ గేమ్‌లో 0-3 వ‌ద్ద ఫాబియ‌న్ రిటైర్ అవ‌డంతో శ్రీకాంత్ రెండో రౌండ్‌కి అర్హ‌త సాధించాడు. రెండో రౌండ్‌లో హాంగ్ కాంగ్‌కు చెందిన వాంగ్ వింగ్ కీ విన్సెంట్‌తో శ్రీకాంత్ త‌ల‌ప‌డ‌నున్నాడు.
స్పెయిన్ క్రీడాకారిణి బిట్రీజ్ కొర్రాలెస్‌ను 21-19, 21-18 తేడాతో ఓడించి పీవీ సింధు రెండో రౌండ్‌కి చేరింది. రెండో రౌండ్‌లో జ‌పాన్‌కి చెందిన స‌యాక ట‌క‌హ‌షితో సింధు త‌ల‌ప‌డ‌నుంది. ఇక పురుషుల డ‌బుల్స్‌లోనూ సాత్విక్‌సాయిరాజ్ , చిరాగ్ శెట్టిల జోడీ కూడా రెండో రౌండ్‌కి చేరుకుంది. వీరి జోడి, ఫ్రెంచి జోడి బాస్టియ‌న్ కుర్సాది, జూలియ‌న్ మ‌యోని 21-12, 21-14 తేడాతో ఓడించింది. రెండో రౌండ్‌లో డెన్మార్క్ జోడి మాడ్స్ కొన్రాడ్ పీట‌ర్స‌న్‌, మాడ్స్ పీల‌ర్ కోల్డింగ్‌ల‌తో త‌ల‌ప‌డ‌నుంది.