ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కం ప‌క‌డ్బందీగా అమ‌లు చేస్తున్నాం

ts minister etala
ts minister etala

హైదరాబాద్ : శాసనసభలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై లఘు చర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప‌లు ప్ర‌శ్న‌ల‌కు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లిదండ్రుల్లో భరోసా కల్పించిన మాట వాస్తవమని మంత్రి స్పష్టం చేశారు. కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో సంబంధం లేదని తేల్చిచెప్పారు. 2016-17లో రూ. 3,200 కోట్ల బకాయిలు ఉంటే రూ. 2,896 కోట్లు చెల్లించామని తెలిపారు. ఈ అకాడమిక్ ఇయర్‌లో ఇంకా విద్యార్థుల డాటా అప్‌లోడ్ కాలేదని, అడ్మిషన్లలో తేడా దృష్ట్యా ఏ అకాడమిక్ ఇయర్ రీయింబర్స్‌మెంట్ ఆ ఇయర్‌లో చెల్లించడం కుదరదన్నారు. అలాగే ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులకు అత్యధికంగా మెస్ ఛార్జీలను పెంచామని మంత్రి గుర్తు చేశారు. కళాశాల అనుబంధ వసతి గృహ విద్యార్థులకు స్కాలర్‌షిప్ రూ. 900 నుంచి రూ. 1500లకు పెంచామని పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థులకు రూ. 520 నుంచి రూ. 750కు పెంచామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకే కాకుండా అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ప్రయివేటు విద్యాసంస్థలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని మంత్రి ఉద్ఘాటించారు. విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని ప్రతిపక్ష పార్టీల నేతలకు ఈటల రాజేందర్ సూచించారు. హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యను అందిస్తున్నామని ఈట‌ల స్ప‌ష్టం చేశారు.