ఫిబ్రవరి రెండో వారంలో మంత్రివర్గ విస్తరణ

kcr
kcr

పూర్తి స్థాయి కేబినెట్‌పై కూడా కెసిఆర్‌ దృష్టి
మినీ స్థాయి అయితే, ముగ్గురు కొత్తవారికి చాన్స్‌
హైదరాబాద్‌: మంత్రివర్గ విస్తరపై టిఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టిసారించారని తెలుస్తోంది. ఫిబ్రవరి మూడోవారంలో అసెంబ్లీలో ఓటన్‌ బడ్జెట్‌ సమావేశం ప్రారంభించే సమయానికి మినీ మంత్రివర్గాన్ని లేదా పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. కాగా, ఫిబ్రవరి 8వ తేదీన మంత్రి వర్గం ఏర్పాటు ఉండవచ్చునని విశ్వసనీయంగా తెలుస్తోంది.మినీ కేబినెట్‌ అయితే మరో ఆరు మందిని తీసుకోవచ్చునని, ఇప్పటికే సిఎంగా కెసిఆర్‌,హోమ్‌మంత్రిగా మహ్మద్‌ అలీ ఉండటంతో వారితో కలిపి మొత్తం 8 మందితో కేబినెట్‌ ఏర్పడవచ్చు. లేదా కొత్తగా మరో 8మందిని తీసుకొని,మొత్తం 10మందితో కూడిన మినీ కేబినెట్‌ ఏర్పడవచ్చు. కొత్తగా మరో 8 మందితో కూడిన కేబినెట్‌ ఏర్పడితే,అందులో ముగ్గురు కొత్తవారు,ఐదుగురు పాతవారు ఉండేలా అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కొత్తవారిలో ఒక మహిళ తప్పనసరిగా ఉండే అవకాశం ఉందని, మిగతా ఇద్దరు మొదటిసారి గెలిచిన వారు లేదా ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన ఎమ్మెల్యేలు(సండ్ర వెంకట వీరయ్య తదితరులు) ఉండవచ్చునని తెలుస్తోంది.మినీ కేబినెట్‌ ఏర్పడితే, వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో అసంతృప్తుల ప్రభావం ఉండేలా ఉందని విశ్లేషణ కూడా జరుగుతుంది. అందుకని పూర్తి స్థాయి కేబినెట్‌ ఏర్పాటు కావచ్చుననే ప్రచారం కూడా సాగుతోంది. పార్లమెంటరీ కార్యదర్శులు పోస్టుల నియామకం మినీ కేబినెట్‌ లేదా పూర్తి కేబినెట్‌ ఏర్పడిన తర్వాతే ఉండవచ్చునని ప్రచారం జరుగుతోంది. మొత్తగా పార్లమెంట్‌ ఎన్నికలకు వెళ్లే ముందు ఎన్నికల కేబినెట్‌ తరహాలో ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఈసారి కేబినెట్‌లో పూర్తి స్థాయి సామాజిక న్యాయం పాటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పాత జిల్లాల వారీగా కూడా ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హరీష్‌రావు, కెటిఆర్‌లకు మంత్రి పదవి ఇవ్వకపోతే, తాజా మాజీ మంత్రుల్లో ఈటెల రాజేందర్‌తో సహా చాలా మంది సీనియర్లకు చాన్స్‌ ఉండే అవకాశం ఉండదని అంటున్నారు. పూర్తి స్థాయి కేబినెట్‌ ఏర్పడితే గెలిచిన తాజా మాజీ మంత్రులందరికీ చాన్స్‌ ఇచ్చి, మిగతా నలుగురి స్థానాల్లో కొత్తవారికి చాన్స్‌ ఉండే అవకాశం ఉందంటున్నారు.
ఇదిలా ఉండగా,అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్‌ విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రస్తుత సంక్షేమ పథకాలను కొన సాగిస్తూనే వాటిని మరింత విస్తృతం చేస్తామని పేర్కొంది. వీటికి నూతన కేబినెట్‌ ఆమోదం తెలపాల్సి ఉంది. ఎన్నికల సమయంలో ఆసరా పెన్షన్ల వయోపరిమితిని తగ్గిస్తామని,పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తామని ప్రకటించింది.రైతుబంధు పథకం కింద పంపిణీ చేసే సాయాన్ని ఎకరానికి ఇప్పుడున్న రూ.4వేల నుంచి రూ.5వేల పెంచుతామని హామీ ఇచ్చింది. గత ఎన్నికల తరహాలోనే రూ.లక్ష వరకు ఉండే పంట రుణాలను మాఫీ చేస్తామని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 61 ఏళ్లకు పెంచుతామని, నిరుద్యోగ భృతి కింద అర్హులకు నెలకు రూ.3,016 చెల్లిస్తామని పేర్కొంది. ప్రజల డిమాండ్లకు అను గుణంగా నారాయణపేట,ములుగు జిల్లాలతో పాటు కొత్తగా పలు రెవెన్యూ డివిజన్లను, మండలాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఎన్నికల్లో భారీ మెజారిటితో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే హామీల అమలుపై సిఎం కెసిఆర్‌ దృష్టి సారించారు. కొత్త జిల్లాలు,రెవెన్యూ డివిజన్లు,మండలాల ఏర్పాటు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. వయోపరిమితి సడలింపు నేపథ్యంలో ఆసరా పెన్షన్ల అర్హుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదలయ్యే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ఆసరా పెన్షన్ల అమలులో కొత్త విధానం అమలు చేయనున్నట్లు సిఎం కెసిఆర్‌ ప్రకటించారు. వచ్చే ఖరీఫ్‌ నుంచి రైతు బంధు సాయాన్ని పెంచనున్నారు. మిగిలిన హామీల అమలు విషయంలోనూ ఆర్థిక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సంక్షేమ పథకాలలో మార్పులు,పంట రుణాల మాపీ, ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదం తెలపనున్నారు. టిఆర్‌ఎస్‌ ఎన్నికల ప్రణాళిక అమలుకు అవసరమైన నిధులు కేటాయింపు, ఆదాయ వనరుల పెంపు అంశాలపై ఆర్థిక శాఖ అధికారుల కసరత్తు చేస్తున్నారు. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ తర్వాత ప్రవేశపెట్టే పూర్తి స్థాయి బడ్జెట్‌ లోనే దీనికి సంబంధించి నిధులను కేటాయించేలా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు.