ఫిఫా అభిమానుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌

putin
putin

ఫిఫా అభిమానులకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుభవార్త చెప్పారు. ప్రపంచకప్‌ టోర్నీ ముగిసినా, విదేశీ అభిమానులు వీసా లేకుండా ఈ ఏడాదంతా రష్యాలో పర్యటించే అవకాశం కల్పించారు. అయితే ఇది ఫ్యాన్‌ ఐడీ కార్డులు ఉన్న విదేశీయులకు మాత్రమే వర్తించనుంది. ప్రపంచకప్‌ సందర్భంగా రష్యాకు వచ్చే విదేశీ అభిమానుల కోసం నిర్వాహకులు ఫ్యాన్‌ ఐడీలను జారీ చేశారు. ఈ ఐడీల కాలపరిమితి ఈ నెల 25 వరకు మాత్రమే ఉంది. ఈ నెల 15తో ప్రపంచకప్‌ టోర్నీ ముగియడంతో, ఈ కార్డుల కాలపరిమితిని పెంచుతూ రష్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్‌ ఐడీలు కలిగిన విదేశీ అభిమానులు వీసా లేకుండా ఈ ఏడాదంతా ఎన్నిసార్లైనా రష్యాలో పర్యటించొచ్చని ఫైనల్‌ అనంతరం పుతిన్‌ ప్రకటించారు. ఈ పోటీలను నిర్వహించినందుకు గర్వపడుతున్నామని తెలిపారు. మరోవైపు విజయవంతంగా ఫిఫా పోటీలు నిర్వహించినందుకు పలు దేశాలు రష్యాను అభినందించాయి.