ఫిఫాః అర్జెంటీనా ప‌రాజ‌యం

FOOT BALL
FOOT BALL

మాస్కోః ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా గ్రూప్‌-డిలోని క్రొయేషియా-అర్జెంటీనా మధ్య గురువారం రాత్రి మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో క్రొయేషియా 3-0తేడాతో అర్జెంటీనాపై విజయం సాధించి నాకౌట్‌ దశకు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో ఒక్క గోల్‌ కూడా నమోదవ్వలేదు. రెండో అర్ధభాగంలో క్రొయేషియా ఆటగాళ్లు రెచ్చిపోయారు. 53వ నిమిషంలో రెబిక్‌ తొలి గోల్‌ నమోదు చేసి ఆధిక్యాన్ని ఇచ్చాడు. అనంతరం 80వ నిమిషంలో లుకా మాడ్రిక్‌ మరో గోల్‌ చేయడంతో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆట చివర్లో ఇవాన్‌ రాకిటిక్‌ మరో గోల్‌ చేయడంతో 3-0తో క్రొయేషియా విజయం సాధించి నాకౌట్‌ దశకు చేరుకుంది.
అర్జెంటీనా ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రాగా ముగించడంతో కేవలం ఒకే ఒక్క పాయింట్‌తో గ్రూపు-డి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. దీంతో అర్జెంటీనా తుది-16లో చోటు దక్కించుకోవడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఐస్‌లాండ్‌-నైజీరియా, అర్జెంటీనా-నైజీరియా మ్యాచ్‌ల్లో వచ్చే ఫలితాలను బట్టి అర్జెంటీనా భవితవ్యం తేలనుంది.