ఫలితాలు ఇవ్వని పథకాలెందుకు?

             ఫలితాలు ఇవ్వని పథకాలెందుకు?

WELFARE SCHEMES
WELFARE SCHEMES

అందరికీ పారిశుద్ధ్య సేవలందించేందుకు మహాత్ముని 150వ జన్మదినోత్సవానికి కానుకగా పరిపూర్ణ స్వచ్ఛభారత్‌ ఆవిష్కరణే ధ్యేయంగా మన కేంద్ర ప్రభుత్వం 2014 అక్టో బరు 2 తేదీన స్వచ్ఛభారత్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయిదేళ్ల వ్యవధిలో గ్రామీణ ప్రాంతాలలో సుమారుగా లక్ష కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజీ, పారిశుద్ధ్యం, మురుగునీటి నిర్వహణ వ్యవస్థ, మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. ఇప్పటివరకు వివిధ రాష్ట్రాలకు 52వేల కోట్ల నిధులు కేటాయించగా, వచ్చే సంవత్సరం లోపల 48వేల కోట్ల నిధులు విడుదల చేస్తామని గత ఆగస్టులో స్వచ్ఛభారత్‌ ఒక కార్యక్రమం సందర్భంగా ప్రధాని ప్రకటించారు.

అయితే ఈ స్వచ్ఛభారత్‌ కార్యక్రమం అనుకున్న ఫలితాలను ఇవ్వడం లేదని, ప్రచార్భాటం తప్ప క్షేత్రస్థాయిలో ఎటువంటి ఉపయోగం లేదని తెలియచేస్తోంది. బహిరంగ విసర్జనకు దూరమైనట్లు ప్రకటించుకున్న నాలుగు లక్షల గ్రామాలలో మౌలిక సమస్యలు యధాతథంగా ఉన్నాయి. పద్దెనిమిది లక్షల కొత్తగా నిర్మించిన మరుగుదొడ్లలో ఆరోగ్య భద్రత ప్రమాణాల మేరకు ఉన్నవి 35 శాతం మాత్రమే. మరొక 35 శాతం ఎందుకు పనికిరానివని, తిరిగి భారీ ఎత్తున మరమ్మతులు చేపడితే తప్ప వినియోగానికి పనికిరావని సదరు నివేదిక తేల్చింది. 30 శాతం మరుగుదొడ్లలో డ్రైనేజీ, నీటి సదుపాయం లేని కారణంగా తాళాలు వేసి ఉంచారు.

ఒక గ్రామంలో వంద శాతం ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మించినా, ఎలాంటి మినహాయింపులు లేకుండా వంద శాతం ప్రజలు వినియోగించే సందర్భాలు తక్కువగా ఉన్నాయి. స్వచ్ఛగ్రామాల సర్టిఫికెట్‌ కోసం బహిరంగ విసర్జనరహిత గ్రామాలుగా ప్రకటించుకున్నవే చాలా ఎక్కువగా ఉన్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఆధునిక అవసరాలకు అనుగుణంగా ఘన,ద్రవ్య వ్యర్థాల నిర్వహణ సవ్యంగా జరగడం లేదు.

పంచాయతీల స్థాయిలో స్వచ్ఛభారత్‌ పేరిట వస్తున్న నిధులను సక్రమంగా ఖర్చు చేయగల సామర్థ్యం కొరవడిన కారణంగా క్షేత్రస్థాయిలో స్వచ్ఛభారత్‌ అనుకున్న ఫలితాలను ఇవ్వలేకపోతోందన్న సదరు నివేదిక పట్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం కావాలి. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో పౌరులు, మేధావ్ఞలు, సామాజిక నిపుణులను భాగస్తులను చేసి మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలి.
-సి.సాయి ప్రతాప్‌