ప‌దో త‌ర‌గ‌తి టాప‌ర్ల‌కు ద‌క్కిన వినూత్న అవ‌కాశం

CAREER
CAREER

అనంత‌పురంః జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ టెన్త్‌ ఫలితాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు విమాన ప్రయాణ యోగం కలిగింది. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవు. చదువుల్లో పోటీతత్వం పెంపొందించి మంచి ఫలితాలు సాధించాలని ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఇటు ఉపాధ్యాయులు.. అటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ పదికి పదిపాయింట్లు సాధించిన విద్యార్థులను విమానంలో తీసుకెళతానని ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని ఆయన నెరవేర్చారు. జిల్లాలో 17 మంది టెన్త్‌ టాపర్లను గుర్తించి వారిని విమానంలో తీసుకెళ్లారు. అయితే అందులో 15 మంది విద్యార్థులే వెళ్లారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు శనివారం వారిని విమానంలో తీసుకెళ్లారు మధ్యాహ్నం 2.45 గంటలకు విమానంలో తీసుకెళ్లారు. 3.45 గంటల పాటు హైదరాబాద్‌లోని పలు ముఖ్యమైన ప్రాంతాలను వారికి చూపించారు. ఆ తరువాత తిరిగి బస్సులో అనంతకు బయలుదేరారు. ఆ విద్యార్థుల వెంట ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి, డీఈఓ పగడాల లక్ష్మీనారాయణ, సీనియర్‌ అసిస్టెంట్లు ముక్తియార్‌, పెద్దయ్య, ప్రధానోపాధ్యాయుడు జయ చంద్రనాయుడు, స్పాన్సరర్లు, ప్రైవేట్‌ స్కూల్స్‌ అసోసియేషన్‌ నాయకులయిన శ్రీసత్యసాయి బాలవికాస్‌కు చెందిన రవిచంద్రారెడ్డి, కదిరి వాల్మీకి పాఠశాల కరస్పాండెంట్‌ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్న, అమ్మానాన్న సొసైటీ వ్యవస్థాపకుడు సాలివేముల బాబు పయనించారు.
విమాన ప్రయాణం చేయడంపై పేద విద్యార్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. తమకు ఈ అరుదైన అవకాశం కల్పించిన అధికారులు, స్పాన్సర్లకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి నిర్ణయం పట్ల ఉపాధ్యాయులు.. విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇలా ప్రోత్సహించడం వల్ల మిగిలిన పిల్లల్లో చదువు పట్ల ఆసక్తి పెంపొందుతుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు సాధించడానికి దోహదపడుతుందన్నారు. కాగా, ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ..ఇది మరుపురాని రోజన్నారు. రాయలసీమలోని అన్ని జిల్లాల్లోనూ హామీ ఇచ్చానని, తొలిసారిగా సొంత జిల్లాకు చెందిన పిల్లలను ఇలా విమానంలో తీసుకెళ్లడం ఎంతో ఆనందం కలిగి స్తోందన్నారు. ఆర్జేడీగా ఉన్నంతకాలం ఇలాగే పేద పిల్లలను ప్రతి ఏటా ప్రోత్సహిస్తానన్నారు.