ప్లాటుగా ముగిసిన మార్కెట్లు

stock market
stock market

ముంబై: పలు ప్రధాన కంపెనీల త్రైమాసిక ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఒక దశలో లాభాల బాటలో సాగిన దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరికి క్రితం స్థాయిలోనే ముగిసాయి. వాస్తవానికి నిఫ్టీ 23.50పాయింట్లు తగ్గగా, సెన్సెక్స్‌ 10,09పాయింట్లు లాభపడింది. శుక్రవారం రోజు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఐటిసి, మారుతిసుజుకి, ఐసిఐసిఐబ్యాంకు లాంటి పలు దిగ్గజ సంస్థలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మదుపరులు కాస్త ఆచితూచి ఆయా కంపెనీల పనితీరు ఆధారంగా పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా ఒకదశలో ప్రధాన సూచీలైన బిఎస్‌ఇ సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ కూడా మూడో రోజు కూడా సరికొత్త రికార్డుల దిశగా పరుగులు తీశాయి. అయితే గురువారం రోజు త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన ఎస్‌బ్యాంకు నిరాశజనకమైన పనితీరును కనపరచిన నేపథ్యంలో ఆ బ్యాంకు షేరు దాదాపు 20శాతం పడిపోవడం సూచీలపై తీవ్రప్రభావం చూపించింది. అయితే ఈ వారంలో సెన్సెక్స్‌, నిఫ్టీ రెండూ కూడా 1.5శాతానికి పైగా లాభపడడం గమనార్హం. మరోవైపు మెరుగైన ఫలితాలను ప్రకటించిన ఐటిసి, మారుతిసుజుకి షేర్లు కూడా లాభాల్లో ముగిసాయి. ఇక అంతర్జాతీయంగా అమెరికా టెక్నాలజీ దిగ్గజాలు అద్భుతమైన ఫలితాలను సాధించిన నేపథ్యంలో శుక్రవారం టెక్నాలజీ షేర్లన్నీ పుంజుకోవడంతో ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ముగిసాయి. ఐరోపా మార్కెట్లు కూడా ప్రారంభం నుంచే లాభాల్లో సాగాయి.
సెన్సెక్స్‌లో అదాని ఫోర్ట్స్‌ 4శాతానికి పైగా లాభపడగా, సన్‌ఫార్మా 3.6శాతం, ఒఎన్‌జిసి 3.5శాతం, టాటామోటార్స్‌ 2.5శాతానికిపైగా లాభపడ్డాయి. ఇక నష్టపోయినవాటిలో భారతీఎయిర్‌టెల్‌ 4.43శాతానికిపైగా కోల్పోయి అగ్రస్థానంలో నిలిచింది. మారుతిసుజుకి 0.47శాతం, ఐటిసి 0.3శాతం పెరిగాయి.