ప్ర‌త్యేక హోదా కోసం నేడు ఏపి బంద్

AP
AP

అమ‌రావ‌తిః ఆంధ్రకు జరిగిన అన్యాయంపై రాష్ట్రవ్యాప్తంగా బంద్‌, నిరసనలు జరగనున్నాయి. కాంగ్రెస్‌, వామపక్షాల బంద్‌ పిలుపునకు విపక్ష వైసీపీ మద్దతు ఇచ్చింది. ఇక… అధికార తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రవ్యాప్తంగా శాంతియుతంగా నిరసనలు తెలియచేయాలని పిలుపునిచ్చింది. ఇందుకు జనసేన కూడా మద్దతు పలికింది. ఏపీ ప్రజల ఆగ్రహం, అభిప్రాయాలు ఢిల్లీకి తెలియాలనే ఉద్దేశంతో ఈ బంద్‌కు టీడీపీ అనధికారికంగా మద్దతు పలుకుతున్నట్లు తెలిసింది. నేరుగా బంద్‌కు మద్దతివ్వకుండా… ప్రతిచోటా నిరసన ప్రదర్శనలు జరపాలని నిర్ణయించింది. ముందు జాగ్రత్తగా విద్యాశాఖ విద్యాసంస్థలకు గురువారం సెలవు ప్రకటించింది.
గురువారం జరగాల్సిన ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ను 22వ తేదీకి వాయిదా వేశారు. ఇక… ఆర్టీసీ బస్సులను నడపడంపై పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతిస్తున్నట్టు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ బంద్‌లో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా చేస్తున్న అన్యాయంతోపాటు బడ్జెట్‌ కేటాయింపుల్లో మొండిచేయిపై అందరం కలిసి పోరాడుదామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీపీఐ లేఖ రాసింది.