ప్ర‌త్యేక హోదా కోసం జేఏసి ఏర్పాటుః ప‌వ‌న్

pawan kalyan
pawan kalyan

అమ‌రావ‌తిః ‘‘విభజన హామీలపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం రెండూ దోబూచులాడుతున్నాయి. నెపం ఒకదాని మీద మరొకటి వేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాయి. దీనిపై ప్రజల్లో విపరీతమైన ఆందోళన వ్యక్తమవుతోంది’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. విభజన హామీల సాధనకోసం జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) ఏర్పాటు కావాల్సిన అవసరం కనిపిస్తోందని, దీనికోసం గురువారంనుంచే తాను చొరవ తీసుకోనున్నట్టు ఆయన వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో పవన్‌ విలేకరులతో మాట్లాడారు.
‘‘కాంగ్రెస్‌ పార్టీ మాజీ నేత ఉండవల్లి అరుణ్‌ కుమార్‌, లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణలాంటి మేధావులతోపాటు కలిసొచ్చేవారందరినీ కలుపుకొని ప్రెజర్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నాను. ఈక్రమంలో కలిసివచ్చే అన్ని పార్టీలనూ కలుపుకొనిపోతానన్నారు. విభజన హామీలపై అటు కేంద్రంలో బీజేపీ, ఇటు రాష్ట్రంలో టీడీపీ ప్రజలను మభ్యపెడుతున్నాయన్న ఆయన, ప్రజలు తాము మోసపోయినట్లుగా భావిస్తున్నారన్నారు.
ఈ మొత్తం వ్యవహారంచూస్తే అందరూ కలిసికట్టుగా రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారనిపిస్తోంది’’ అని పవన్‌ ఆవేదన వ్యక్తంచేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే చట్టసభల్లో ప్రజల ఆకాంక్షలను నేరుగా లేవనెత్తే అవకాశం కలిగేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఈ నెల 11వ తేదీన హైదరాబాద్‌లో కలవనున్నట్టు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వెల్లడించారు. ‘‘పవన్‌ నాకు ఫోన్‌ చేశారు. ప్రత్యేక హోదా కోసం కలసి పనిచేద్దామని కోరారన్నారు.